Authorization
Mon Jan 19, 2015 06:51 pm
74వ స్వాతంత్య్ర దినోత్సవానికి (ఆగస్ట్ 15) దేశం సన్నద్ధమవుతోంది. ఇంకేం పాలక వర్గాలు దేశభక్తి, జాతీయత వంటి మాటలతో మీడియాలో ఊదరగొడతాయి. అయితే, దేశ సహజ సంపదను, దశాబ్దాల ప్రజల స్వేదం, రక్తంతో నిర్మించుకున్న అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రయివేటు వారికి, కార్పొరేట్లకు సంతర్పణ చేసేస్తూ, మరొక ప్రక్క జండా పండగ, దేశభక్తి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడాన్ని ఏమనాలి? ఇదేం స్వాత్రంత్రోద్యమ స్ఫూర్తి !!
ఎల్ఐసీలో వాటాలను అమ్మడానికి కేంద్రం
ఎల్ఐసీ ఆవిర్భావానికి దారి తీసిన బీమా జాతీయకరణ ఆలోచన స్వాతంత్రోద్యమ సమయంలో వెల్లివిరిసిన జాతీయ స్పృహలో అంతర్భాగం. స్వాతంత్రోద్యమం కేవలం వలస పాలన నుండి విముక్తిని పొందడమే కాకుండా, స్వేచ్ఛాయుతమైన సమసామాజ స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది. 'దోపిడీని అంతమొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆకలితో ఉన్న లక్షలాది మందికి నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి' అని 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సదస్సు తీర్మానించింది.
1934లో జరిగిన కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ సమావేశంలో తన చార్టర్ ఆఫ్ ఫ్రీడంలో 'ప్రజా పొదుపును జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉండాలని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుందని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రజల పొదుపుపై ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలనేదానిపై, అది ప్రయివేటు సంస్థల పరం కాకుండా జాతీయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించబడాలి అనేదానిపై, స్వాతంత్రోద్యమం చాలా స్పష్టంగా ఉందని మనకు అర్థమవుతుంది.
జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి. జీవిత బీమా వ్యాపారం కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో ప్రయివేట్ గుత్త సంస్థలు చేసిన ఆర్థిక అరాచకం గుర్తించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ గ్రంథంలో పేర్కొన్నారు.
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభ భారతదేశం సమతుల్యంగా అభివృద్ధి చెందాలంటే, దేశ ఆర్థిక రంగంలో ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించాలంది. 'బీమా వ్యాపార నిర్వహణ, యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వానికి బదిలీ చేసే చట్టాన్ని అమలుచేయడానికి వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఈ సభ అభిప్రాయపడుతుంది' అని రాజ్యాంగ అసెంబ్లీ జనవరి 12, 1948 నాడు తీర్మానించింది.
అయితే, ఆనాడు మనదేశ బీమా రంగంలో ఘోరమయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్సూరెన్స్, బ్యాంక్‌లు ప్రజల పొదుపును పోగుచేసి పెట్టుబడిగా తయారు చేసే సాధనాలు గనుక పెట్టుబడిదారులు ఒక బ్యాంక్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీని తమ చేతుల్లో ఉంచుకునే వారు. ఉదాహరణకు టాటా చేతుల్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. అలాగే, దాల్మియా చేతుల్లో భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండేది. బిర్లా చేతుల్లో బాంబే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ఉండేది. ప్రజల పొదుపును తమ సొంత పెట్టుబడిగా మార్చుకుని, 1953లో 12 కోట్లు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు 318 కోట్లు సంపాదించగలిగారు. ఈ పరిస్థితుల నడుమ 25 జీవిత బీమా కంపెనీలు మూతపడ్డాయి. మరొక 25కంపెనీలు ఇతర కంపెనీలకు బాలయించబడ్డాయి. దాల్మియా నేతృత్వంలోని భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.2 కోట్లు దగా చేసింది. బీమా కంపెనీల ప్రీమియుమ్ ధరల యుద్ధం నేపథ్యంలో కంపెనీ లాభాలు నిలబెట్టుకోవడం కోసం, సిబ్బందిని తగ్గించడం మొదలు పెట్టారు. ఈ పోటీలో నెగ్గలేని చిన్న కంపెనీలు మూతపడి ఉద్యోగులు వీధుల్లో పడ్డారు. దీంతో ఉద్యోగ భద్రత ప్రధాన సమస్య అయ్యింది. ఈ నేపద్యంలోనే జీవిత బీమా రంగంలో పట్టదారుల సొమ్ము, భద్రత ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో మృగ్యం అని, పట్టదారుల సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయకరణ ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో1951 నుంచి 1956 వరకు సమర శీలంగా జరిగిన ఉద్యమాల ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి19, 1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది. బీమా జాతీయకరణ ఆర్డినెన్స్‌ను అత్యంత గోప్యంగా ఇచ్చి ఉండకపోతే, ప్రయివేటు బీమా సంస్థలు మరింతగా ప్రజల సొమ్మును దిగమింగేవని ఆనాటి ఆర్థికమంత్రి సి.డి దేశముఖ్ తన ఆత్మకథలో రాసుకున్నారు.
జీవిత బీమా జాతీయకరణ ప్రజల పొదుపును సమర్థవంతంగా సమీకరించే దిశలో మరో అడుగు. ఒక సంక్షేమ రాజ్యం తన ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన ముఖ్యమైన సామాజిక సేవ బీమా. లాభాపేక్ష తొలగించబడి, సమర్థవంతమైన సేవే ఏకైక ప్రమాణంగా మారిన జాతీయకరణ వల్ల బీమా ప్రయోజనాలను సాధ్యమైనంతవరకు విస్తృతంగా వ్యాప్తి చేయడం సాధ్యపడుతుంది. ఆనాడు విదేశీ కంపెనీలు దేశీయ పొదుపును చేజిక్కుంచుకున్న వైనాన్ని చూసి కలవరడిన ఆనాటి ప్రధాని నెహ్రూ సైతం భారతీయ కంపెనీలను మాత్రమే సమర్థించమని పిలుపునిచ్చారు. అందుకే, స్వాతంత్రోద్యమ ప్రమాణాలలో జీవితబీమా రంగ జాతీయకరణ అత్యంత కీలకం.
ఈరోజు ఏడాదికి రూ 3.5 లక్షల కోట్ల నుండి రూ 4 లక్షల కోట్లు దేశాభివృద్ధికి పెట్టుబడులు అందించగల స్థితిలో ఎల్ఐసీ ఉందంటే, దానికి స్వాతంత్రోద్యమ నాయకుల దార్శినికతే ప్రధాన కారణం.1956 నుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో 30లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, 35 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి, 40 కోట్ల పాలసీదారులకు ఎల్ఐసీ విశేష సేవలు అందిస్తున్నది. ఇది ప్రపంచంలోనే అరుదైన ఘనత. ఎల్ఐసీ దేశ సంక్షేమంతో పాటు దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు సైతం ఊతం అందిస్తున్నది. ఎల్ఐసీ ఈక్విటీ పెట్టుబడులు యాభై కంపెనీలలో ఉండటం దీనికి తార్కాణం.
అటువంటి ఎల్ఐసీ సంస్థలో వాటాలు దేనికి అమ్ముతున్నారో నిర్దిష్టమైన సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం కేవలం 5శాతం నుంచి 10శాతం మాత్రమే వాటాను అమ్ముతుంది అని అదేపనిగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఎల్ఐసీ చట్టానికి చేసిన తాజా సవరణల ప్రకారం ఐదేండ్లలో ఎల్ఐసీలో కేంద్ర పెట్టుబడులు 51శాతానికి పరిమితం కావడానికి కావలసిన భూమికను ఏర్పరిచారు. ఒకపక్క యునైటెడ్ ఇండియా సాధారణ బీమా కంపెనీలో 100శాతం ప్రభుత్వ వాటా అమ్మివేయాలని నిర్ణయించారు. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తే, అది కొద్ది మంది కార్పొరేట్లకు, ధనిక మదుపుదారులకు తప్ప దేశ ప్రయోజనాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకసారి లిస్టింగ్ అయితే షేర్ హౌల్డర్స్ ప్రయోజనాలకు తప్ప దేశ ప్రయోజనాలకు పని చేయడం సాధ్యం కాదు..Vూచీూ, దీAూజఉ, షవఅ్aబతీ నశ్ీవశ్రీలో జరిగిన అనుభవాలు చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. ఎల్ఐసీ లిస్టింగ్ అయితే సంస్థ నిజ విలువ ఆవిష్కారం అవుతుందని, దాని విలువ పెరిగి చిన్న మదుపుదారులకు లాభం అని ఒకటే ప్రచారం చేస్తున్నారు. అయితే, సంస్థ లాభదాయకతకూ, షేర్ విలువకూ సంబంధం లేదని న్యూ ఇండియా అష్యురెన్సు కంపెనీలో జరిగిన (ప్రభుత్వ సాధారణ బీమా రంగ కంపెనీ) పెట్టుబడుల ఉపసంహరణ ఉదంతం మనకు తెలియచేస్తుంది!
నవంబర్ 2017లో న్యూ ఇండియా కంపెనీకు చెందిన 14.56శాతం ప్రభుత్వ వాటాలను రూ.9,600 కోట్ల రూపాయలకు ఐ.పి.ఓ రూపేణా విక్రయించడం జరిగింది. ఐ.పి.ఓ చేసేటప్పుడు ప్రతి షేర్ ధర రూ.770-800 మధ్య నిర్ణయించారు. మొత్తంగా 12కోట్ల షేర్లు అమ్మారు. తదనంతరం బోనస్ షేర్లు కూడా ఇచ్చారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఆఫర్ షేర్ ధరలో రూ.30 తగ్గించారు. అయినా, కేవలం 2శాతం ఉద్యోగులు మాత్రమే షేర్లు కావాలని దరఖాస్తు చేశారు. బోనస్ షేర్ కూడా కలుపుకుంటే, న్యూ ఇండియా ప్రారంభ షేర్ ధర సుమారు రూ.350 అనుకోవాల్సి ఉంటుంది. అయితే, నేడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అవుతున్న న్యూ ఇండియా షేర్ ధర సుమారు రూ.165 ఐ.పి.ఓ తర్వాత, ఒకసారి మాత్రమే గరిష్టంగా రూ.179కు షేర్ ధర చేరింది. అసలు న్యూ ఇండియా షేర్ ధర ఆశించినంత మేర ఎందుకు ఉండడం లేదు?
సాధారణ బీమా రంగంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏ విభాగంలో చూసినా న్యూ ఇండియా కంపెనీ అద్భుతమైన ప్రదర్శన చేసి సాధారణ బీమా రంగంలో 16.8శాతం మార్కెట్ వాటా సొంతం చేసుకుని ముందంజలో ఉంది. కంపెనీ నికరవిలువ, సేకరించిన ప్రీమియం, పన్నుల తర్వాత లాభం, బ్రాంచ్ శాఖలు, ఇలా అనేక అంశాల్లో ఇతర బీమా కంపెనీలతో పోలిస్తే న్యూ ఇండియా కంపెనీ దూసుకుపోతోంది. మరి, ఇంత అద్భుతంగా రాణిస్తున్న న్యూ ఇండియా కంపెనీ షేర్ విలువ తారాజువ్వలా పైపైకి పెరగాలి. అలా, ఎందుకు పెరగడం లేదు!!! సంస్థ లాభదాయకతకూ, షేర్ విలువకూ సంబంధం లేదని ఈ ఉదంతం మరొకసారి తెలియచేస్తోంది!!
నేడు న్యూ ఇండియా షేర్లు కలిగి ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల (2 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు పెట్టె వారి) శాతం - కేవలం 0.81శాతం. వారి సంఖ్య -1,01,800. కనుక, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేసే సందర్భంలో చెప్పే వాదనలన్నీ అసంబద్ధ వాదనలే!! పెట్టుబడుల ఉపసంహరణ వల్ల, రిటైల్ ఇన్వెస్టర్లు లాభపడతారు అనే వాదన భ్రమ!! అతి కొద్ది మంది మాత్రమే షేర్లు కలిగి ఉంటారు. అసలు హవా అంతా స్వదేశీ, విదేశీ మదుపుదారులదే!! ప్రభుత్వ రంగ సంస్థల లాభదాయకతకూ, వాటి షేర్ ధరలకు ఎటువంటి సంబంధం లేదు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల షేర్ ధరలు పెరగకుండా, స్టాక్ మార్కెట్లోని తిమింగలాలు కుయుక్తులు పన్నుతాయి. (ఎస్బీఐ షేర్ ధరను, హెచ్డీఎఫ్సీ షేర్ ధరను పోలిస్తే ఇదే అర్థం అవుతుంది). షేర్ ధర పెంచడానికంటూ కంపెనీని లాభాల వేటలో పరుగులు తీయిస్తారు. సామాజిక లక్ష్యాలకు మంగళం పాడతారు. పర్మినెంట్ ఉద్యోగులసంఖ్యను తగ్గించాలని చూస్తారు. భవిష్యత్‌లో ఎల్ఐసీని లిస్టింగ్ చేసినా జరిగేదిదే!!
ఎల్ఐసీ లిస్టింగ్ విషయంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. 1969లో బ్యాంకుల జాతీయకరణపై పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆనాడు యువ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి పాల్గొని, బ్యాంకుల జాతీయకరణను వ్యతిరేకిస్తూ నాలుగు అంశాలు పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ ఒక వికృతమైన చర్య అని, అవసరం లేనిదనీ, అకారణమైనదనీ, అనుచితమని వాజపేయి పేర్కొన్నారు. అప్పటినుండీ ప్రభుత్వ రంగ సంస్థల పట్ల జనసంఫ్‌ు, జనతా, బీజేపీ వైఖరి అలాగే ఉంది. అందుకే, ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం? ఎందుకు ఎల్ఐసీని లిస్టింగ్ చేస్తున్నారు? ఎందుకు ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నారు? ఇది ఎవరి ప్రయోజనాల కోసం? వాజపేయి మాటల్లోనే చెప్పాలంటే, ఎల్ఐసీలో ఐ.పి.ఓ వికృతం, అనవసరం, అకారణం, అనుచితం, అనైతికం కాదా!! ఈ చర్య జాతీయోద్యమ స్ఫూర్తికి విఘాతమని దేశభక్తులైన ప్రజానీకం భావిస్తున్నారు.
- పి. సతీష్
సెల్: 9441797900