Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టిలో ప్రేమ, దయ, కరుణ లాంటి విలక్షణమైన గుణాలున్న ఏకైక జీవి మనిషి. ఇతర జీవులతో పోలిస్తే- ఆపదలో ఉన్న సాటివారికి అపన్న హస్తం అందించే గొప్ప మనసు మనిషికి మాత్రమే ఉంటుంది. అందుకే 'ప్రార్థించే పెదవులకన్నా, సహాయం చేసే చేతులు మిన్న' అనే మదర్ థెరెసా స్ఫూర్తి లోకానికి ఆదర్శవంతమైంది. ఆది నుంచి సంఘజీవిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మనిషికి మానవతాకోణం ఆవశ్యకతను చాటడానికి ఐక్యరాజ్యసమితి 2009 ఆగస్టు 19 నుంచి ప్రపంచ మానవతా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. 2003 ఆగస్టు 19న ఇరాక్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో సమితి మానవ హక్కుల హై కమిషనర్ సెర్గియో వీయేరా డిమెల్లో, మరో 21 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డిమెల్లో మూడున్నర దశాబ్దాల పాటు ఐరాస మానవతావాద సహాయ కార్యక్రమాల్లో అంకిత భావంతో పని చేశారు. ఆ ఉదంతం స్మృత్యర్థం ప్రపంచవ్యాప్తంగా ఏటా మానవతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మానవతా సిబ్బందిని గుర్తించేందుకు, మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఇది. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవలందించిన వారిని స్మరించుకుంటారు. సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను ప్రచారం చేస్తారు. గత సంవత్సరన్నర కాలంగా కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యకలాపాలకు అతిపెద్ద సవాలుగా నిలిచిన తరుణంలో ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సేవలను స్మరించుకునేందుకు నేటి మానవతా దినోత్సవం వేదిక కానుంది.
ప్రస్తుత ఆధునిక యుగంలో మానవత్వం క్రమంగా కనుమరుగైపోతోంది. సాటి మనిషిని ఆదరించే సంస్కృతి కొరవడింది. బాధ్యతలను విస్మరించే మనుషుల సంఖ్య పెరుగుతోంది. మనుషుల మధ్య ఈ దూరం మానవతా విలువలను తుంచేస్తోంది. కొవిడ్ వ్యాధి పట్ల కొరవడిన అవగాహన- దుర్విచక్షణకు దారి తీస్తోంది. ముఖ్యంగా వైరస్ ఉందనే అనుమానంతో సాటి మనిషికి సహాయం నిరాకరించడం, కుటుంబాలను ఇంటి నుంచి గెంటివేయడం, గ్రామస్తులు బాధిత కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం, దహన సంస్కారాలకు సైతం నిరాకరించడం లాంటి ఉదంతాలు సిగ్గుచేటు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో పాలుపంచుకుంటున్న ఆరోగ్య సిబ్బంది సేవలు, లాక్డౌన్ సమయంలో ఆదాయం కోల్పోయిన వలస కూలీలు, సాధారణ ప్రజల అవసరాలను తీర్చిన పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదుల దాతృత్వ కార్యక్రమాలు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇటీవల వలస కూలీలకు అందించిన సహాయ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సుప్రీంకోర్టు స్వచ్ఛంద సంస్థల సహాయ కార్యక్రమాలను ప్రశంసించడం గమనార్హం. విపత్తు సమయంలో సమస్యల్లో ఉన్నవారికి నేనున్నానంటూ కొందరు ప్రముఖులు అండగా నిలవడమూ సమాజంలో మానవత్వం కలిగి ఉన్న మనుషులు ఇంకా అక్కడక్కడా ఉన్నారని రుజువు చేస్తోంది. సోను సూద్ సేవలే దీనికి నిదర్శనం. విపత్తు వేళ సహాయంచేసే కార్మికులు, ఆరోగ్య సిబ్బందిపై విశ్వవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించడం ఆందోళన కలిగిస్తోంది.
మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఐక్యత వల్ల సహనం పెరుగుతుంది. ప్రస్తుత సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. డబ్బుతోనే ప్రతిదాన్ని ముడిపెడుతున్నారు. డబ్బే సర్వస్వం కాదని అందరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మానవత్వాన్ని పాదుగొల్పే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ హ్యుమానిటేరియన్ పరిశీలన-2021 ప్రకారం, ప్రస్తుతం దాదాపు 23.5కోట్ల మందికి సహాయం, రక్షణ అవసరం. అంటే- ప్రపంచంలోని ప్రతి 45 మందిలో ఒకరికి సాటి మనిషి సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్తుల మూల కారణాలను పరిష్కరించి, మానవాతా చర్యలకు పూనుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఐరాస హెచ్చరించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఐరాస మూడు ప్రపంచ మానవతా ప్రతిస్పందన (గ్లోబల్ హ్యుమానిటేరియన్ రెస్పాన్స్) ప్రణాళికలు రూపొందించడం హర్షించదగిన అంశం. అందులో మొదటిది కొవిడ్ వ్యాప్తిని, మరణాలను తగ్గించడం. క్షీణిస్తున్న మానవ హక్కులను కాపాడటం రెండోది. మహమ్మారి బారిన పడిన శరణార్థులు, వలసదారుల రక్షణ సహాయ చర్యలు మూడో అంశం. ప్రభుత్వం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రాజ్యాంగ విలువలను నేటి తరానికి పరిచయం చేయాలి. చదువుల సారం సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా ఉండాలి. దీనికై విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి. గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు, తల్లితండ్రులు కృషి చేయాలి. స్వచ్ఛంద సేవ, దాతత్వ కార్యక్రమాలలో యువత భాగస్వాములు కావడానికి జాతీయ సేవా పథకంను ప్రతి కళాశాలలో ప్రవేశపెట్టాలి. యువతను వ్యసనాల నుంచి దూరం చేసి మానవ సంబంధాలను పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలి. స్వచ్ఛంద సేవ, దాతత్వ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కీలకం.
ఎస్.శ్యామల, సెల్:8008539905