Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ప్రజలనైతే కన్నబిడ్డల్లా, కంటికి రెప్పల్లా కాపాడాలో, వారినే నానా ఇబ్బందులకు గురిచేస్తూ ఆనందాన్ని పొందే పాలకులను డెబ్భైనాలుగేండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పుడే చూస్తున్నాం. రైతన్న చేతులను నరికేస్తూనే... గిల్లిజోల పాడిన చందంగా ''రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక'' అని కీర్తించే జాణతనాన్ని కూడా ఇప్పుడే చూస్తున్నాం. అదురు, బెదురు లేకుండా ఒక శాస్త్రీయ విధానం లేకుండా ప్రతిరోజు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నెలకు రెండుమూడు సార్లు వంటగ్యాసు ధరలను పెంచుతూ ఓట్లేసి తమను గెలిపించిన సామాన్యులను అణగదొక్కే కృతఘ్నతనుకూడా చూస్తున్నాం. అంతే కాదు, ఇన్ని ఘన కార్యాలను చేస్తున్నందుకు మళ్ళీ తమనే గెలిపించమని దబాయించే రుబాబును ఇప్పుడు తప్ప మునుపెన్నడైనా చూశామా? ఈదుర్భర పరిస్థితులను భరించేటంతటి సహనం విపక్షాలకు, మేథావులకు, సాధారణ ప్రజలకు ఎక్కడ నుంచి వచ్చింది?
మరో విచిత్రమేమంటే.. ''అన్నమో మోడీ'' అని అరిచి అరిచి డీలా పడిన అన్నార్తులకు ''పిబరే రామరసం'' (రామరసం తాగండి) అని తత్వాన్ని బోధిస్తున్నారు. విధి కంటే రాముని సన్నిధే సుఖమని ప్రబోధిస్తూ ప్రపంచంలోనే ఎత్తయిన రాముడి విగ్రహంతో వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన అయోధ్య రామాలయానికి నిధులు వసూలు చేశారు, చేస్తున్నారు. మీకున్న ఏకభుక్తం నుంచి అర్థభుక్తాన్ని సమర్పించుకొని స్వర్గ ప్రాప్తిని పొందమన్నారు. మోక్షమార్గాలనేకముండగా ఆస్తిపాస్తులెందుకని ప్రజల ఆస్తులన్నిటినీ శతసహస్త్ర కోటీశ్వరులకు కారు చౌకగా కట్టబెడుతున్నారు (మరి వారికి మాత్రమెందుకనే ప్రశ్న ఉదయించరాదు). భూమ్యాకాశాలతో సహ పంచభూతాలను అమ్మేస్తున్నారు. చివరికి మన స్వతంత్య్ర భారత పౌరులు నీళ్ళు తాగాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా, అంబానీ, అదానీల అనుమతి తీసుకోవాల్సిన దుర్గతి దాపురించనున్నది. చేయాల్సిందంతా చేసి, ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభాన్నుంచి అనారోగ్యం నుంచి, అవినీతి నుంచి కాపాడమని దేవుణ్ణి కోరుతూ జనం డబ్బుతోనే యాగాలు చేస్తున్నారు. ఎంతటి నంగనాచితనం! ఇప్పుడు తాజాగా కరోనా అంశం చేరింది. కరోనా విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేసి, ఆ మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడమని దైవప్రార్థనలు చేయటం, ప్రజలను కూడా చేయమనటం బాధ్యత నుండి తప్పించుకునే సులభమైన మోసపూరిత చర్య. ప్రజలు కూడా గత్యంతరం లేక కరోనా నుండి కాపాడమని దైవ ప్రార్థనలు చేస్తున్నారు. కొందరైతే చైతన్యంగా కదిలి ఆ దేవుడూ ఈ దేవుడూ ఎందుకని కరోనాదేవికే గుడికట్టి, పూజలు చేస్తున్నారు. మూడు కోట్ల ఒకటో దేవతను సృష్టించి, అబద్దపు భరోసాతో బతుకులీడుస్తున్నారు. ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు. పాలకులు కచ్చితంగా ఇదే కోరుకుంటున్నారు. రాజకీయ మత కాలుష్యాలతో పాటు సాంస్కృతిక కాలుష్యాన్ని కూడా ప్రజల మెదళ్ళలో నింపే లక్ష్యంతో వడివడిగా అడుగులేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వెయ్యకపోతే ఇకపైన ప్రజలు తమ సమస్యకు పరిష్కారాలను పాలకులను అడగటం మానేసి దేవుళ్ళను అడగాల్సి వస్తుంది.
మరో ముఖ్యమైన విషయం.. ఏ రాజ్యాంగం ద్వారా తాము అధికార పీఠాన్నిధిగమించారో ఆ రాజ్యాంగ వ్యవస్థలనే ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు తమకు ఓట్లేసిన పాపానికి ప్రశ్నించినవారిని గుండు పగలగొడుతున్నారు. తోడేలు గొర్రెపిల్ల కథలో నీతిని పౌరులందరికి వర్తింప చేస్తున్నందున ఇప్పుడు సహజ న్యాయం అత్యంత సహజంగా గొర్రెపిల్ల లాగానే సంహరించబడుతుండటం ఒక విషాదం. ఈ మహాయజ్ఞంలో విపక్ష నాయకులు, మేథావులు, మహిళలు, వృద్ధులు, దళితులు చివరకు న్యాయమూర్తులు సైతం సమిథలవుతుండటం మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి షరా మామూలుగా మారింది. జనం బుర్రల నిండా వారి ఆలోచనలే ఉండాలి. సొంత ఆలోచనలుండరాదు. ఇప్పుడు పరిపాలన లేదు, ప్రజా సంక్షేమం లేదు. ''ఎన్నికలు - ప్రమాణస్వీకారం - ఎన్నికలు'' ఇదే ఎజెండా. ఇప్పుడు ఎన్నికలంటే భౌతిక యుద్ధాలు, బ్లాక్మెయిలింగ్లు, రిటైలు, టోకు వ్యాపారాలు. ఇక అబద్ధాలు సరేసరి. పదే పదే అబద్ధాలు చెబితే అవి నిజాలుగా మారుతాయని, ఎన్నికల్లో తమకు లాభిస్తాయని బీజేపీ తదితర పాలకపార్టీల నమ్మకం. పూర్వం ఒక బ్రాహ్మణుడు యాగార్థం తీసుకొని పోతున్న మేక కేవలం అబద్ధ ప్రచారం వల్ల కుక్కగా మారిన కథ మీద వారికి అమిత విశ్వాసం.
ఇక రాజకీయమంటే భయపడకపోవటం (ప్రజలకు, చట్టాలకు), భయపెట్టటం. అగ్రనేతల నుండి కింది స్థాయి కార్యకర్తల దాక అచ్చుగుద్దిన అహంభావం. అదొక ట్రేడ్ మార్కు రాజకీయం. ఈ పటాటోప రధచక్రాల కింద నలిగిపోతున్న సామాన్యుడు ఆపన్న హస్తం కోసం విపక్షాల వైపు చూస్తూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. ప్రతిపక్షాలు, ప్రజా తంత్రవాదులు, మేథావులు మౌనందాలిస్తే ఇక ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేదెలా? ప్రజాస్వామ్య గజరాజు నియంతృత్వ మొసలినోటికి చిక్కి గజగజలాడుతుంటే, ఆ ఏనుగుతోక పట్టుకొని బయటకు లాగే ప్రయత్నం చేస్తే ఏం లాభం? మొసలినే స్థానభ్రంశం చెయ్యాలి. అప్పుడే నిజమైన గజేంద్రమోక్షం జరుగుతుంది. అందుకు ఇప్పుడున్న దొక్కటే మార్గం. అది బీజేపీని ఒంటరిని చేయటం. కమ్యూనిస్టులలోను, ఇతర విపక్షాలలోను కాకలుతీరిన మేథావులున్నారు. దేశం కోసం ఛిద్రమవుతున్న పేదల బతుకుల బాగుకోసం, కలిసి కూర్చొని కామన్ మినిమమ్ ప్రోగ్రాంను రూపొందించుకొని ముందుకు పోవాలి. ఈ సందర్భంలో అన్ని పక్షాలు సర్దుబాటు వైఖరి ప్రదర్శించాలి. ఏ సిద్దాంతమైనా, ఎవరి సిద్ధాంతమైనా ప్రజల కోసమేగాని, నాయకుల కోసం కాదు కదా! ప్రస్తుత విపత్కాలంలో సిద్ధాంతాల కంటే ''ఇగోయిజమే'' ముందుకొస్తే అది ఇంగితమూ అనిపించుకోదు, దేశభక్తీ అనిపించుకోదు. ఎంత వెనకపట్టు పట్టినా కమ్యూనిస్టులవి విలక్షణమైన, విశ్వసనీయమైన రాజకీయాలు. ఈ విశాల ఐక్య వేదిక ఏర్పాటుకు వారే చొరవతీసుకుంటే బాగుంటుంది. పదునైన కొత్త కార్యక్రమాలతో దూకుడుగా ముందుకుపోకపోతే విపక్షాల నిరసన ప్రదర్శనల స్థానంలో మోడీ భక్తుల నగర సంకీర్తనలు చోటు చేసుకుంటాయి.
- కందాడై శ్రీనివాసులు
సెల్: 9246901149