Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పర్యావరణ ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉంది. దీనికి కారణాలు ఏమిటో.. కారకులు ఎవరో మనకు తెలిసిందే.. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాటం వలన రోజు రోజుకి భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ ఉంది.దీనివలన భూమిపై ప్రస్తుతతరం వారికేకాదు, భవిష్యత్తు తరాల వారికి కూడా ప్రాణసంకటంగా మారుతోంది. మన చర్యల వలన ఈ భూమండలం యావత్తూ కర్బన ఉద్గారాలు వ్యాపించి, మానవాళితో పాటు అన్ని జీవరాశులకు ప్రస్తుతం మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. యథేచ్ఛగా అడవుల నరికివేత.. మితిమీరిన వాహనాల వినియోగం.. విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ వంటివి పర్యావరణాన్ని కబళిస్తున్నాయి.
పారిశ్రామిక విప్లవంతో ఆయా పరిశ్రమల నుంచి కర్బన ఉద్గారాలు విచ్చలవిడిగా వెలువడటం ఆరంభం అయ్యింది. మొదట్లో ఈ ప్రగతి చూసి ఎంతో గర్వపడ్డాం. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అనుకున్నాం. అత్యున్నత ఆవిష్కరణలను కనిపెడుతున్నాం అని గర్వించాం. కానీ మానవ చర్యల కారణంగా కాలుష్యం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని గుర్తించలేక పోయాం. గుర్తించినా కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధం కాలేకపోయాం. ఈ నిర్లక్ష్యమే భూతాపం పెరుగుదలకు కారణమై ప్రపంచాన్ని పెను ప్రమాదంలో పడేసింది.
వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలే భూతాపానికి కారణం అని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయినా మన చెవికి ఎక్కలేదు. ఏ విధంగా చూసినా భూతాపం అనేది మానవ స్వయంకృతాపరా ధమే అనేది సత్యం. జీవన సౌకర్యాలు, విలాసాల కోసం మానవులు చేపడుతున్న కార్యకలాపాల వల్లే భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనివలన భూ ఉపరితలం వేడెక్కి రోజురోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వలన అతివృష్టి అనావృష్టి పరిస్థితులు సహజం అయిపోయాయి. మానవ కార్యకలాపాల వల్లనే నదులు, సముద్రాలు, కాలుష్య భరితంగా మారుతున్నాయి. కొన్ని రకాల జీవరాశులు శాశ్వతంగా అంతరించిపోయాయి, మరికొన్ని అంతరించి పోతున్న జాబితాలో చేరాయి. అడవుల నరికివేత, అసంబద్ధ అభివృద్ధి విధానాలతో వాయు, జల, వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా సరికొత్త రోగాలతో మానవజాతి అతలాకుతుల మవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేల్కొన్నాయి.. ఈ భూమిని సురక్షితం చేసి మన మనుగడ కాపాడుకోవడం ఎలా అనే విషయంపై అనేక చర్చలు.. పరిశోధనలు చేపట్టడం మొదలుపెట్టాయి. అనేక సమావేశాలు ఏర్పాటు చేశాయి. ప్రకృతిని కాపాడే బాధ్యత అన్ని ప్రభుత్వాలది అంటూ తీర్మానాలు చేశాయి. కానీ ప్రపంచ దేశాలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు చిత్త శుద్దితో ఏ దేశం కూడా అమలు చేయలేదనే చెప్పవచ్చు.
పర్యావరణ పరిరక్షణకు జరిగే అన్ని ఒడంబడికలు ఒప్పందాలు కాగితాలకే పరిమితం అయిపోయాయి. సందర్భంలో ఈ భూతాపం వలన ఏర్పడే మహా విపత్తు మరెంతో దూరంలో లేదనీ, 2030 నాటికే దాని ప్రభావం మనం చూడబోతున్నామంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక మన ముందుకు వచ్చి కోడ్ రెడ్ హెచ్చరిక చేసింది. ఉష్ణోగ్రతలలో మార్పులు కర్బన ఉద్గారాలు మంచు కొండలు సముద్ర మట్టాలు వంటి భౌగోళిక వాతావరణ మార్పులపై 1988 నుంచి ప్రతీ ఐదేండ్లకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ కమిటీ నివేదిక అందిస్తూ ఉంటుంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన తాజా నివేదిక మాత్రం చాలా ఆందోళన కరంగా ఉంది. దీనితో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా కాలుష్యం భూతాపం విషయమై తాజాగా ఇదే రీతిలో మరొక ఆందోళనకర నివేదిక ప్రకటించింది.
మానవత్వం కోసం కోడ్ రెడ్?
ఐపీసీసీ నివేదిక ప్రకారం మున్ముందు మానవ మనుగడ మరింత క్లిష్టతరంగా మారనుంది. భూగోళం అత్యంత వేగంగా వేడెక్కనుంది. మనం గతంలో ఊహించిన దానికంటే మరింత తీవ్రంగా ఈ దుష్పరిణామం ఆందోళనకరంగా మారుతోందని హెచ్చరించింది. రాబోయే 20ఏండ్లలో సగటున ప్రపంచ ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ని చేరుకోగలదని అంచనా వేసింది. యూన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ నివేదికను ''మానవత్వం కోసం ఒక కోడ్ రెడ్''గా వర్ణించారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం ఉష్ణోగ్రతలు, సముద్రాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి గాలులపై తీవ్రంగా ఉంటుందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావంతో ప్రత్యేకించి మన దేశంలో భవిష్యత్‌లో వర్షపాతం భారీగా పెరుగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను కట్టడి చేయకుంటే.. తరచూ ప్రకృతి వైపరీత్యాలు తథ్యమని హెచ్చరించింది. 234 మంది శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ నివేదికపై గత నెల 26 నుంచి రెండు వారాల పాటు 195 సభ్య దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా చర్చించిన ఐపీసీసీ.. 3వేల పైచిలుకు పేజీల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను బట్టి వాతావరణ మార్పులు మానవాళి పాలిట 'కోడ్ రెడ్' స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2013 నాటి ఏఆర్-5 నివేదిక తర్వాత.. ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా భూతాపం పెరిగిపోతోందని ఐపీసీసీ చెబుతోంది. ఇప్పటికే 1.3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం భవిష్యత్‌లో మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమించనుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది..
భూతాప ఉత్పాతం నుంచి తప్పుకోలేం?
విషయమై ప్రపంచ దేశాలు తగు చర్యలు తీసుకోక పోతేమాత్రం ఈ ఉత్పాతం నుంచి ప్రజలు పారిపోయేందుకు కూడా స్థలం ఉండదని ఈ నివేదిక హెచ్చరించింది. అంటే భూతాపంతో ప్రభావితం కాని ప్రదేశం అంటూ ఈ భూమిపై లేదని ఈ నివేదిక అభిప్రాయంగా మనం భావించవచ్చు. ఇదే పరిస్థితులు కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉషోగ్రతలు మరింత తీవ్రంగా పెరిగిపోయి పరిస్థితులు మన చేయి దాటిపోయే విధంగా ఉన్నాయని నివేదిక అభిప్రాయ పడింది.
పారిస్ ఒప్పందం
2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. అయితే వాస్తవంలో మాత్రం నివరణా చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రపంచ దేశాలు చిత్త శుద్ధితో వ్యవహరించడం లేదు. అందుచేత ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ప్రపంచం యావత్తు కూడా ముప్పుకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఈ విపత్తు నుంచి బయట పడాలి అంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. సాధారణ లక్ష్యాలను కూడా చేధిచలేనిస్థితిలో ఉన్న ప్రపంచ దేశాలు భూతాపాన్ని రెండింతలు అధికంగా తగ్గించడం సాధ్యపడే విషయమేనా అనే సందేహం కలగక మానదు. 21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి ప్రమాదకర అంచనాలను ఎప్పుడూ వెలువరించలేదు. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి.
నివేదికలో ప్రమాద ఘంటికలు
సముద్ర మట్టాలు పెరగడం, ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరుగుదల వేగం కావడం, తుఫానులు తీవ్రంగా మారడం వంటి సంకేతాలే రాబోయే విపత్తు తీవ్రతకు కారణం. ఈ మధ్య కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు పరిశీలిస్తే గత వెయ్యేండ్ల కాలంలో ఎన్నడూ లేనంత వేగంగా తీవ్రంగా ఉన్నాయి. గ్రీసు, టర్కీ దేశాలలో తాజా కార్చిచ్చుకు సైతం ఈ ఉష్ణోగ్రతల మార్పే కారణం. పరిస్థితి విషమించే కొద్దీ సముద్రాల్లో ఆక్సిజన్ శాతం తగ్గి అవి ఆమ్లయుతాలుగా మారతాయి. తీవ్ర వడగాల్పులు అనేవి గతంలో 50సంవత్సరాలకు ఒక సారి కనిపించేవి. అయితే ఇప్పుడు అవి పదేండ్లకు ఒకసారి ప్రత్యక్షం అవుతున్నాయి. ఇప్పుడున్న ప్రపంచ ఉష్ణోగ్రత మరోడిగ్రీ పెరిగితే ఈ గాల్పులు మూడున్నర సంవత్సరాలకు ఒక సారి ప్రత్యక్షం అవుతాయి. వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులే ఈ ఉత్పాతాలకు నిదర్శనంగా చెప్పవచ్చు.
కాలుష్యాన్ని కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే ప్రళయం తప్పదు అని నాసా నివేదిక కూడా హెచ్చరించింది. ఎన్ని నివేదికలు చెప్పినా అన్నీ కూడా భూతాపం ముప్పు తప్పదనే చెబుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కరుగుతున్న మంచు పొంగుతున్న సముద్రాలు మానవ మనుగడకే కాదు సమస్త జీవరాశి ముప్పు వాటిల్లే ఘటనలుగా ముంచుకు వస్తున్నాయి. ఈ పరిణామాలపై గత 30ఏండ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, ప్రపంచ దేశాలు మాత్రం ఆర్భాటంగా చర్చలు సమావేశాలు ఏర్పాటు చేశాయి తప్ప, అమలులో మాత్రం చేసింది తక్కువే. లేకపోతే ఇంత విపత్తు ముంచుకు వచ్చేది కాదు. ప్రస్తుతం నెలకొన్న ఈ తాపాన్ని అదుపు లేయలేక పోయినా రాబోయే దశబ్దాలలో ఇవి మరింత పెరగకుండా కాపాడుకోగలిగితే మాత్రం భావితరాలు మాట ఎలా ఉన్నా ప్రస్తుత తరానికి చెందిన మనకు కొంత కాలం పాటు ఈ భూమి ఆవాసం కల్పిస్తుంది. మనమే కాదు కోట్లాది జీవరాసులు ఉనికికి అవకాశం కలుగుతుంది. ఇందుకోసం గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అదుపు చేయడం, ముఖ్యంగా కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించడం ఒక్కటే మార్గం. అప్పుడే ఈ ఉష్ణోగ్రతలు తగ్గటం మాట అటుంచి కనీసం పెరగకుండా ఉంటాయి.
స్కాట్లాండ్ పర్యావరణ సదస్సు
నవంబర్‌లో స్కాట్లాండ్లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదికలు చర్చకు రానున్నాయి. ఎప్పటిలాగే చర్చలు జరిపి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రకృతి కూడా తన పని తాను చేసుకుపోవడం ఖాయం. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని గుర్తించి సమావేశంలో పటిష్ట నిర్ణయాలు తీసుకోగలినప్పుడే ఫలితం ఉంటుంది. గతంలోవలే కాకుండా ఈ నివేదికల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోగలిగినప్పుడే ఇక ముందు ఉష్ణోగ్రత పెరగకుండా కట్టడి చేయగలం. ఇప్పటికైన పారిస్ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు జరప గలిగితేనే ప్రయోజనం. ప్రపంచ నేతలందరూ ఈ విషయంలో వాస్తవ చర్యలపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఎందుకంటే ఈ ఉత్పాతం నుంచి ఎవరూ మినహాయింపు కాదని నివేదికలు చెబుతున్నాయి. దీనినుంచి వేరే ప్రదేశానికి పారిపోయే ప్రదేశం కూడా ఈ భూమిపై ఉండదని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. విషయమై ప్రభుత్వాలే కాదు, ప్రతీ పౌరుడికీ ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని గుర్తిస్తే మంచిది.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, సెల్:9441239578.