Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చారిత్రక నిజాం కళాశాల, కోటి మహిళా విద్యాలయం, సైపాబాద్ సైన్స్ కళాశాలల యొక్క వసతి గహాలు ఇకమీదట కొనసాగించబోమని ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించటంతో విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 25-08-2021 బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రిన్సిపాళ్ళ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. నిజాం కళాశాల, కోటి మహిళా కళాశాలు స్వయంప్రతిపత్తి కలిగినవి. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తామన్నది. నేడు అదే పాలకులు ఈ కళాశాలల హాస్టళ్ళను రద్దుచేసేందుకు పూనుకున్నారు. నిజాం కళాశాల హాస్టల్ హైదరాబాద్ మధ్యలో బషీర్‌బాగ్ లో ఉంది. హాస్టల్ సమీపంలో ఒక పక్క విద్యుత్ అమరవీరుల స్థూపం మరో వైపున తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాల హాస్టల్ కోటిలోని కళాశాల ప్రాంగణంలో అత్యంత భద్రతకలిగి ఉంటుంది. ఈ కళాశాలలో చదువుతున్న మెజారిటీ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందినవారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభిస్తూ మరోవైపు వసతి గృహాలు మూసివేయటంతో వీరందరు ఎక్కడ ఉండాలనేది ప్రశ్నార్థకంగా మారింది. 1887లో నిజాం పాలకులచే ప్రారంభమైన నిజాం కళాశాల ప్రతిష్టాత్మక కోర్సులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది. 1995 వరకు నిజాం కళాశాలలో ప్రముఖులైన రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తల పిల్లు, అగ్రకుల భూస్వాముల పిల్లలు చదివేవారు. అంతవరకు రిజర్వేషన్ రోస్టర్ విధానం అమలు చేయకపోవటం, రాజకీయ లాబీయింగ్ లాంటి చర్యలతో దళిత బహుజన విద్యార్థులను ఈ విద్యాసంస్థలలోకి అనుమతించలేదు. ఎంతో ప్రతిభగల వేల మంది విద్యార్థులు నష్టపోయారు. అనేక సమాజిక, విప్లవ పోరాటాలతో నేడు విద్య ఉద్యోగ రంగాలలో కొంతవరకు అమలవుతున్న రిజర్వేషన్ల ఫలితంగా నేడు దళిత బహుజన విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్లు పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ విద్యాసంస్థల యొక్క డిగ్రీ హాస్టళ్ళు మూసివేయడమంటే శోశితజనసమూహాల విద్యార్థులకు నాణ్యమైన విద్య పొందకుండా నిరాకరించడమే. 1924లో ప్రారంభమైన యూనివర్సిటీ మహిళా కళాశాల, విద్యార్థినిలకు కోటి మహిళా కళాశాల హాస్టళ్లలో అత్యంత భద్రత ఉంటుంది. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో అత్యున్నత విజయాలు సాధిస్తున్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలుగా, సివిల్ సర్వీసు అధికారుగా, ఇంజనీర్లుగా ఉన్నారు. ఇలాంటి కళాశాల హాస్టల్ మూసివేయడమంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, అక్షరాస్యతలో, రాజకీయ రంగాలలో మరింత వెనక్కినెట్టడమే. వసతి గృహాల మూసివేత దళిత బహుజన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వసతి గృహాల మూసివేత కుట్ర మానుకోవాలనే డిమాండ్‌తో ఉద్యమించాల్సిన కర్తవ్యం యావత్తు తెలంగాణ సమాజంపై ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉంటూ ఉద్యమించిన నిజాం కళాశాల విద్యార్థుల సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తట్టుకోలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతున్నదనేది స్పష్టమవుతున్నది. స్వయంప్రతిపత్తి గల నిజాం కళాశాల కోటి మహిళా కళాశాలలలో ఉస్మానియా యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి జోక్యానికి పాల్పడుతూ స్వయంప్రతిపత్తిని ద్వంసం చేస్తున్నారు. ఈ హాస్టళ్ళు మూసివేతకుగల కారణాలు రాష్ట్రప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం ఇంతవరకు బహిరంగపరచలేదు. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి పోరాటానికి మద్దతు తెలుపుతూ వారి ఉద్యమంలో భాగమవ్వటమే మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం.
- కోట ఆనంద్,
సెల్: 9653257076