Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గెయిల్ ఓమ్వెడ్ - భారతదేశ ప్రాచీన, ఆధునిక సాంస్కృతిక, చరిత్రపై నిశితమైన అధ్యయనం చేసిన మహా మేథావుల్లో తొలి అగ్రగామి మహిళా రచయిత. గెయిల్ ఓమ్వెడ్ ఆగస్టు 2, 1941 జన్మించిన అమెరికన్- భారతీయ సామాజిక శాస్త్రవేత్త, మానవ హక్కుల కార్యకర్త. భారతదేశంలో కుల వ్యతిరేక ఉద్యమం, దళిత రాజకీయాలు, మహిళల పోరాటాలపై అనేక పుస్తకాలను ప్రచురించారు. అంతేకాకుండా దళిత, కుల వ్యతిరేక ఉద్యమాలు, పర్యావరణ, రైతు, మహిళా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలలో చైతన్యానికి విశేష కృషి చేశారు. స్త్రీవాదం, మహిళా ఉద్యమంలో ఆమె సహకారం చాలా ముఖ్యమైనది. అమెరికాలో జన్మించినప్పటికీ... సమాజశాస్త్రం లోని అన్నీ అంశాలను ఈ లోకానికి విశదపరచడానికి భారతదేశాన్ని తన పరిశోధనా కేంద్రంగా చేసుకొన్నది. ఒక విద్యార్థిగా అమెరికా నుంచి 1970లో భారత్కి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. వర్ణ వ్యవస్థపై మహారాష్ట్రలో మహాత్మ పూలే సాగించిన ఉద్యమం గురించి పీహెచ్డీ పరిశోధకురాలుగా ఇండియాకు వచ్చారు. చివరికి భారతీయుడైన ప్రముఖ మార్క్సిస్టు మేథావి, ఉద్యమకారుడు భారత్ పటణ్కర్ను పెండ్లాడారు. గ్రామీణ మహిళల హక్కుల పోరాటం, పర్యావరణం, రైతులు, దళిత కుల నిర్మూలన పోరాటాలపై ఉద్యమిస్తూ గొప్ప గొప్ప రచనలు చేసారు. ఆమె జీవితాంతం అణగారిన వర్గాల విముక్తికోసం కృషి చేశారు. దేశంలో కుల వ్యవస్థ, అస్పృశ్యత గురించి తెలుసుకొని ఎంతో చలించిపోయారు. సుదీర్ఘ కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న గెయిల్ 81ఏండ్ల వయసులో ఆగస్టు 25న తుది శ్వాస విడవడం బాధాకరం. నాలుగు దశాబ్దాలుగా సామాజిక శాస్త్రవేత్తగా, మానవ హక్కుల ఉద్యమ నేతగా భారతదేశానికి ఎప్పటికి గుర్తుండిపోయే స్ఫూర్తి వంతమైన జ్ఞాపకం ఆమె. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యమాలకు ఆమె కృషి నిత్యం స్ఫూర్తిగా నిలుస్తుంది.
భారతదేశంలో అనాదిగా కొనసాగుతున్న అసమానతలపై గళం విప్పి, సామాజిక విప్లవానికి పురుడు పోసిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దాకా జరిగిన మహత్తర పోరాటాన్ని తన రచనల ద్వారా నేటి సమాజానికి అందించిన మహా మేథావి. ఆమె రాసిన పుస్తకాలు నేటి భారత దేశ చారిత్రక పరిశోధనకు దార్శనిక పత్రాలుగా నిలుస్తున్నాయి. ''దళిత అండ్ డెమొక్రటిక్ రెవల్యూషన్'' అనేది ఆమె రాసిన ప్రధాన గ్రంథాలలో ఒకటి. అంతేకాకుండా ''బ్రిటిషర్ల కాలంలో అంబేద్కర్, దళిత ఉద్యమాలు'', ''భారతదేశంలో బుద్ధిజం'', ''పోరాటంలో భారతీయ మహిళలు'', ''మేము ఈ బంధనాలను విచ్ఛిన్నం చేస్తాం'' వంటి రచనలు అందరినీ ఆలోచింపజేశాయి. భర్తతో కలిసి ''శ్రమిక్ ముక్తి దల్'' అనే సంస్థను ఏర్పాటు చేసి చైతన్యానికి నాంది పలికారు. ఎమర్జెన్సీ కాలంలో సామాజిక ఉద్యమాలు పెరుగుతున్న సందర్భంలో ఫూలే-అంబేద్కర్ వారసత్వాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆమె పరిశోధన ద్వారానే మహాత్మా పూలే సత్యశోధక ఉద్యమం గురించి యావత్ ప్రపంచానికి తెలిసింది. ఓమ్వెడ్ అనేక పరిశోధన ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు, ఐక్యరాజ్యసమితి సంస్థలైన ఖీAఉ, ఖచీణూ, ఆక్స్ ఫార్మ్ (చీఉV×దీ) లకు సలహాదారుగా పని చేశారు. ఆమె రచనలు, పోరాటాలు నేటి బహుజన మేథావులకు మార్గదర్శకం అని చెప్పవచ్చు. పూలే నుంచి అంబేద్కర్ వరకు వరకు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం అనేక హక్కులను అనుభవిస్తున్నారు. కానీ, ఈ జాతి నుంచి వచ్చే ఎంతో మంది మేథావులు, రచయితలు, పరిశోధకులకు తమ వెనుకబాటుతనం పై సమగ్ర, శాస్త్రీయమైన అవగాహన లేకపోవడం శోచనీయం. అందుకే 75 సంవత్సరాల స్వతంత్య్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాల విముక్తి ప్రశ్నార్థకంగానే మిగిలింది. నేటికీ అనేక మంది బహుజన మేథావులుగా చెప్పుకుంటున్నవారు ఆధిపత్య వర్గాల చరిత్ర, వారి పోరాటం, వారి రాజకీయ జీవితం చుట్టే తమ వాణిని వినిపిస్తున్నారు. వ్యక్తిగత స్వలాభం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో చారిత్రక మూలాలతో వెళ్లే ఉద్యమాలు, రచనలు కరవై పోయాయి. కనీసం ఇప్పటికైనా గెయిల్ వంటి మేథావిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ హక్కుల కోసం గళం విప్పి ఆత్మగౌరవ జీవనం కొనసాగించాలి. అప్పుడే ప్రజలకు నిజమైన విముక్తి.
ఎస్. శ్యామల
సెల్:8008539905