Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా జీవిస్తున్న తమ జాతిపై సర్కార్ పేర జులుం చూపుతూ స్వేచ్ఛను హరిస్తూ సొంత గడ్డపైనే పరాయిగా మారుస్తున్న తీరును పసిగట్టిన కొమరం భీం తన ప్రజలను కాపాడు కోవడానికి ఆయుధం పట్టి తిరగబడ్డాడు. తన శక్తి చిన్నదని తెలిసినా తన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో వెనుకాడలేదు. అడవి బిడ్డ కొమరం భీం పోరాటం తెలంగాణలో ఎన్నో పోరాటాలను స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎలుగెత్తి చాటిన ''మావనాటే-మావరాజ్'' 'మా ఊళ్ళో మా రాజ్యం' నినాదం నేటికీ స్వాభిమాన ఉద్యమంలో ప్రతిధ్వనిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కొమరం భీం నినాదం, పోరాట స్ఫూర్తి ప్రధాన భూమిక పోషించింది. స్థానిక వనరులపై స్థానికులకే అధికారం ఉండాలని, అందుకోసం అధికారం అవసరమని ఆనాడు భీం పోరాటం కొనసాగింది.
ఆదివాసీలు మొదటి నుంచీ కూడా బయటి ప్రజల, అధికారుల అనవసర ప్రమేయాన్ని, ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. పరిసర ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై సార్వభౌమత్వానికి ఎవరు అడ్డు వచ్చినా వ్యతిరేకించారు. ఆ కోవకు చెందిన యోధుడే కొమరం భీం. ఎనిమిది దశాబ్దాల క్రితం స్వపరిపాలన కోసం కొమరం భీం చేసిన పోరాటం తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వస్తే తెలంగాణతో పాటు ఆదివాసి ప్రాంతాల్లో ఆదివాసీలకు కూడా విముక్తి జరుగుతుందని, స్వయం పాలనకు దారులు పడతాయని ఆశించి ఆదివాసి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల సమస్యలు తీరకపోగా మరింత జఠిలమయ్యాయి. ఆనాటి పాలకులతో వీరోచిత పోరాటం చేసి సాధించుకున్న భూమిని నేటి తెలంగాణ పాలకులు గుంజుకుంటున్నారు. గత 30ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై ప్రజలకు హక్కు లేదంటున్నారు. అటవీ ప్రాంతాల్లో నేడు మరిన్ని కొత్త సమస్యలు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ, ప్రపంచీకరణను పాలక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వాలు చూపెడుతున్న దూకుడు చర్యల వల్ల ఆదివాసీల జీవితాలు మరింత దుర్బరమవుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసేతరుల చొరబాటు వల్ల ఆదివాసీలకే కాకుండా సమాజానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. మానవాళి మనుగడకు ఎంతో అవసరమైన అటవీ సంపదను కాపాడడంలో ఆదివాసీలది కీలకపాత్ర. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వారిని వారు పోషించుకుంటూ మానవాళికి ఎంతో ఉపయోగకరమైన అటవీ సంపదను ఇంతవరకు కాపాడిన ఆదివాసులు సమాజానికి ఎంతో మేలు చేస్తుంటే... చొరబాటుదార్లు మాత్రం అటవీ సంపదను అక్రమంగా తరలించుకు పోతున్నారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను పాలకులు అర్థం చేసుకోకపోవడం, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనే అహాన్ని ప్రదర్శించడం వల్లనే ఆదివాసీ ప్రాంతాలు దోపిడీకి గురవుతున్నాయి. నిజాం పాలన మొదట్లో ఆదివాసీ ప్రాంతాల్లో చొరవడలేదు. నిజాం పాలకుల అండతో దేశ్ ముఖ్, దేశ్ పాండేలు, మొఖాసీల ప్రవర్తన గోండులను ఇబ్బందులకు గురి చేసింది. గోండుల సంస్కృతి ప్రకారం గ్రామంలోని ప్రకృతి వనరులైన నీరు, భూమి, అడవి గ్రామ ఆస్తి. వాటి నిర్వహణ, అధికారం, బాధ్యత గ్రామానిదే. నిజాం రెవెన్యూ పాలనతో భూపాలన నిజాం ప్రభుత్వం నియమించిన గ్రామాధికారి, పై అధికారులది అయింది. నిజాం వ్యవస్థ కారణంగా స్వతంత్రులుగా ఉన్న గోండు రాజులు రెవెన్యూ అధికారులకు సహాయకులుగా, బానిసలుగా మారారు. గోండుల జీవన విధానంలో భాగంగా గత్తర(అమ్మవారు) వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అడవి జంతువుల దాడి బాగా జరిగినప్పుడు తాత్కాలికంగా ఊరు వొదలి వెళ్తారు. వారు తిరిగి వచ్చేసరికి జమీందారులు, రెవెన్యూ అధికారులు ఆదివాసీల భూమిని కబ్జా పెట్టేవారు. వివిధ కారణాలతో సాగు చేయకుండా ఉన్న గిరిజనుల భూమిని కూడా రెవెన్యూ అధికారులు కాజేసేవారు. ఆదివాసీలకు పరిచయంలేని రిజర్వు ఫారెస్టులు, భూమి శిస్తు వ్యవస్థలను అమాయక గిరిజనులపై రుద్ది నిజాం పాలకులు దోపిడీకి శ్రీకారం చుట్టారు.
భూమి, అడవులపై యాజమాన్యం, నిర్వహణ గిరిజన తెగల నుంచి ప్రభుత్వానికి పోవడం ఆదివాసీలను వారి మాతృ భూమికే పరాయివారిగా మార్చింది. వారు పుట్టి పెరిగిన అటవీ ప్రాంతంలోనే అక్రమంగా నివసిస్తున్నారనే పేరుతో ఆదివాసీలపై కేసులు కూడా పెట్టారు. వారసత్వంగా వచ్చిన సాంప్రదాయానికి, రెవెన్యూ అధికారుల రికార్డుల సాంప్రదాయానికి మధ్య వైరుధ్యం ఏర్పడింది. ఈ పోరులో ఎప్పుడూ అధికారులదే పై చేయి అయ్యేది. స్వేచ్ఛ ఉన్న సమాజంలో అధికారుల ప్రవేశంతో గిరిజనుల జీవన విధానం చిన్నాభిన్నం అయింది. వలసదారుల కుతంత్రాలు, అధికారుల దౌర్జన్యాలతో గిరిజనులు తమ భూమిని కోల్పోయారు. క్రమంగా అధికారులు గిరిజనులపై పన్నులు వేయడం మొదలు పెట్టారు. మేకలు ఉన్నవారికి ''మేక పట్టి'', దుంపలు తెచ్చుకునే వారికి 'దుంప పట్టి', అరకలు ఉన్నవారికి 'అరకపట్టి' అనే అక్రమ వసూళ్లు చేసి గిరిజనులని దోచుకునేవారు. ఈ నేపథ్యంలో గిరిజనులు పోరాటానికి సన్నద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏకమైన గిరిజనులకు కొమరం భీం నాయకత్వం వహించాడు. అక్టోబర్ 22, 1901న ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కొమరం భీం చిన్ననాటి నుండే తిరుగుబాటు స్వభావం కలవాడు. కొమరం భీం పంటను కాజేయాడనికి వచ్చిన సిద్ధిక్‌ను హతమార్చాడంతో సర్కార్‌పై సమరం మొదలైంది.
కొమరం భీం తన 15ఏండ్ల వయసులోనే తన జాతి పడుతున్న బాధల గురించి ఆలోచించేవారు. తాము పోడు చేసుకున్న భూమి తమది కావాలంటే ప్రభుత్వం పట్టా లభించాలంటే... చట్ట జ్ఞానంతో కాదు, సర్కార్ తమదైతే తప్ప సాధ్యం కాదన్న రాజ్య జ్ఞానం కొమరం భీంది. నిజాం పాలకులపై పోరు చేయడం కోసం తుపాకులు తయారీ చేయించాడు. ప్రజా సమీకరణ పన్నెండు ఊళ్లకే కాకుండా ఆదివాసీ ప్రాంతమంతా విస్తరించాలని ప్రయత్నం చేసాడు. యుద్ధం తీవ్రమవుతున్న దశలో నైజాం భీం సోదరులకు, బంధువులకు దున్నుకునే భూమికి పట్టాలిస్తామని ఆశ చూపాడు. కొమరం భీం లొంగకపోవడంతో భీం పోరాటం చేసే పన్నెండు ఊళ్లలో పట్టాలు ఇస్తామని చెప్పాడు. పన్నెండు ఊళ్లలో పట్టాలు కాదు మాకు కావాల్సింది ఆ ఊళ్లపై మా అధికారాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. తన పోరాటానికి ముందు కొమరం భీం ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో గాథలను తెలుసుకున్నాడు. వీటన్నిటి స్ఫూర్తితో తన పోరాట మార్గం ఎన్నుకున్నాడు. ''మా ఊళ్ళో మా రాజ్యం'' అంటూ 12 గ్రామాల్లో ప్రచారం చేసాడు. కొమరం భీం పోరాటం మొదట్లో చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది. ఉద్యమం తీవ్రతరమై కొమరం భీం అడవుల్లోకి ప్రవేశించి సాయుధ పోరాటం కొనసాగించాడు. కొమరం భీం అనుచరులు తమ పోరాటంలో భాగంగా ప్రజా కంఠకులైన కొందరు అధికారులను హతమార్చారు. మరికొందరిని హింసించారు. అధికారులపై దాడులు చేయడంతో ఆనాటి అక్కడి కలెక్టర్ భీంను చర్చలకు పిలుస్తాడు. ''మా ఊళ్ళో మా రాజ్యం'' డిమాండ్‌ను ఒప్పుకుని ఆస్తిని సమాజానికి ధారాదత్తం చేయడానికి కలెక్టరు ఒప్పుకోకపోవడంతో భీం తన పోరాటాన్ని మరింత ఉదతం చేసాడు. సెప్టెంబర్ 1, 1940న భాభిఝరి కొండల్లో నిజాం పోలీసులతో జరిగిన యుద్ధంలో కొమురం భీం, ఆయన అనుచరులు వీర మరణం పొందారు. కొమరం భీం అమరుడై ఆదివాసీల, పీడిత ప్రజల జీవితాల్లో కాంతి కోసం ఉద్యమాన్ని ఆయుధంగా ఇచ్చి వెళ్ళాడు.
అదే స్ఫూర్తితో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. ప్రజలు ఆశించిన తెలంగాణ కాలేకపోయింది. సబ్బండ వర్గాలు బాగుపడే తెలంగాణ రాలేదు. అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి జరిగే సంపూర్ణ తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరముంది. నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రపంచీకరణ విధానాల దాడికి మొట్టమొదట బలి అవుతున్నది గిరిజనులే. పోరాడి సాధించుకున్న హక్కులన్నీ తిరిగి హననమవుతున్న వేళ.. కొమరం భీం తిరిగి మనకు స్ఫూర్తి కావాలి.
(కొమరం భీం 81 వర్థంతి సందర్భంగా)
- ఎస్. నరేందర్
సెల్: 9701916091