Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 11, 1893న చికాగో సర్వమత మహా సమ్మేళనంలో స్వామి వివేకానందుడు 'అమెరికా సోదర సోదరీమనులారా' అంటూ ప్రారంభించిన అనితరసాధ్య ఆంగ్ల ప్రసంగంతో మహాసభ దద్దరిల్లేలా 3 నిమిషాలు కరతాళధ్వనులు మారుమోగాయి.అమెరికా ప్రజలు నీరాజనాలు పలికిన ఆ ప్రసంగం 'మానవ శాంతియుత సహజీవనానికి, పరమత సహనానికి పునాదులు వేసేది'గా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనించిన ఆ అసాధారణ ప్రసంగం ప్రపంచ మతాల పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. భారతీయ హిందూ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, అన్ని మతాల గమ్యాలు మానవీయతను బోధిస్తున్నాయని, భారతీయ హిందూ హృదయాన్ని ఆసాంతం ఆవిష్కరించారు. వివేకానందుడి విజ్ఞాన వివేక వాక్పటిమ, విలక్షణ వ్యక్తిత్వం, నిజాయితీతో కూడిన సంభాషణకు విశ్వ మతాల ప్రతినిధులే కాకుండా అమెరికన్ పత్రికలూ ప్రశంసించడం చూశాం. ప్రపంచ సామరస్యం, మానవతా తత్వాలను ఆవిష్కరించిన అద్భుత ప్రసంగంగా అది ఖ్యాతి గాంచింది.
సర్వమతాలకు, సమస్త దేశాలకు చెందిన పీడుతులను, శరణార్థులను గౌరవించి అక్కున చేర్చుకున్న భారతదేశ పౌరుడిగా గర్వంగా ఉందంటూ ప్రసంగం కొనసాగించారు. అన్ని మతాలు సహనాన్ని, సత్యాన్ని బోధిస్తున్నాయని విశ్వసిస్తున్నామని నొక్కివక్కానించారు. మతాభిమానం ముదిరి దురభిమానంగా, మూర్ఖత్వంగా మారగూడదని ఆవేదన వ్యక్తం చాశారు. మత విభేదాలతో ధరణి రక్తసిక్తం కాకూడదని, మత దురభిమానానికి చరమగీతం పాడాలని ముగింపు వాక్యంగా శాంతి పాఠం బోధించారు.
మతాలు మానవీయతను పోషించాలని, సర్వమత బోధనలు మానవాళికి శాంతి సంక్షేమ బాటలు వేయాలని ఘోసిస్తున్న భారతీయ హిందు మత హదయాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకున్న స్వామి వివేకానందుడిని 'సర్వ మానవ నాగరికత వికాసానికి దీపస్తంభం'గా భావించి ప్రపంచ శాంతి కపోతాన్ని సగర్వంగా ఎగిరేలా చూడాల్సిన కనీస బాధ్యత ప్రపంచ మానవాళి మీద ఉందని నమ్ముదాం. మానవ విధ్వంస పునాదులపై నిలబడిన క్రూర తీవ్రవాదం ఎన్నిటికీ గెలవదని చరిత్ర అనుభవాలు వివరిస్తున్నాయి. భారతీయ హిందూ మతం పరమత సహనాన్ని, మత సామరస్యాన్ని గట్టిగా నమ్మిందనే విషయాన్ని సర్వమత మహాసభల్లో వినిపించిన నరేంద్రుడి చికాగో ప్రసంగం విశ్వ మానవాళికి హెచ్చరిక కావాలి. మతం కన్న మానవత్వమే మిన్న అని, అహింసే అత్యంత పదునైన ఆయుధమని నినదించిన వివేకానందుడి బోధనలు నేటి పాలకుల వివేకాన్ని జాగృతం చేయాలి.
(11 సెప్టెంబర్ 'వివేకానందుడి చికాగో విశ్వ సర్వమత మహా సమ్మేళన తొలి ప్రసంగ దినం' సందర్భంగా)
డాక్టర్ బుర్ర
మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037