Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో అనేక సమస్యల వలన మనిషి ఎంత ఒత్తిడికి గురవుతున్నాడో అందరికీ తెలిసిందే. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య, వైవాహిక, ప్రేమ విషయాలు, చదువుల, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ అభద్రత, నిరుద్యోగ సమస్య ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మనిషి తప్పక మానసికంగా కృంగిపోవటం, నిరాశ, నిస్ఫ్రుహలకు లోనుకావటం సహజమే. వీటికి తోడు గత రెండేళ్లనుండి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావాల వలన సామాన్యుల జీవితం మరింత దుర్లభం అవటం గమనిస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులలో ఏదో రీతిగా తమకూ వైరస్ సోకుతుందా? సోకితే కోలుకోగలమా? వైద్య ఖర్చు భరించగలమా? అందరి భవిష్యత్ ఏమై పోతుందో? అన్న మనోవ్యధతో కృంగిపోయి కూడా నిస్సహాయ స్థితిలో క్షణికావేశంలో ఆత్మహత్య ఆలోచనలకు లోనుకావడం జరుగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 8లక్షల మంది అన్యాయంగా ఆత్మహత్యలకు బలవుతున్నారు. వీటిని అరికట్టడానికి, ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని, ఓదార్పును అందించి వారి బాధను పంచుకుంటూ వారి భవిష్యత్పైన ఆశను తిరిగి చిగురింప చేసి ఆత్మహత్య ఆలోచన నుంచి మరల్చి బతుకుపై ఆశను నింపేందుకు కృషి చేయాలి. ఇదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10 రోజును ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిపై ప్రజలలో చైతన్యాన్ని కలిగించే పని 'రోష్ని' ఎన్జీఓ నిర్వహిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల వివరాలు:
- డబ్ల్యూహెచ్ఓ సమాచారం ప్రకారం ప్రపంచంలో ఏటా 8 లక్షలమంది ఆత్మహత్యలకు బలవుతున్నారు.
- ప్రతి 40 సెకన్లకు ఒకరు ఈ రకంగా చనిపోతున్నారు.
- ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఎక్కువగా 15 సం. నుండి 29 సం. మధ్య వయస్కులే. వీరిలో పురుషులే అధికం.
- మన దేశంలో 2019 సంవత్సరంలో 1,39,123 మంది ఆత్మహత్యలకు బలైనారు. దేశంలో ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, అలాగే రోజుకు 381 ఆత్మహత్యలు నమోదు కావడం కూడా విచారించతగిన విషయం.
- మన దేశంలో రాష్ట్రాల వారీగా ఆత్మహత్యల వివరాలు
మహారాష్ట్ర:13.6 శాతం, తమిళనాడు: 9.7శాతం, బెంగాల్ : 9.1శాతం, మధ్యప్రదేశ్: 9శాతం, కర్నాటక : 8.5శాతం, తెలుగు రాష్ట్రాలలో: 5.5 శాతం. 'రోష్ని' హెల్లైన్కిి రోజూ సుమారు 40 నుండి 50 కాల్స్ ఆత్మహత్య చేసుకోవాలని ఉందని ఫోన్ చేస్తుంటారు.
ఆత్మహత్యలను ప్రేరేపించే ముఖ్య కారణాలు:
ఆత్మహత్యా భావనకు ప్రధానమైనది మానసిక ఒత్తిడే. ఒంటరితనం, కుటుంబ సమస్యలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వైఫల్యాలు, లైంగిక వేధింపులు, చదువులు, పరీక్షలు, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, అభద్రతా భావం, అనారోగ్యం, వద్ధాప్యం కారణాలవల్ల తీవ్ర ఒత్తిడికి లోనయి నిస్సహాయతలో బలహీన క్షణాలలో విలువైన ప్రాణాలను బలిచేసుకుంటున్నారు.
ఆత్మ హత్య చేసుకోవాలనుకునే వారిని క్రింది లక్షణాలతో గుర్తించ వచ్చు.
ఆకలి, నిద్ర సన్నగిల్లటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, ఎప్పుడూ ఒంటరిగా ఒత్తిడిలో ఉండటం, తమ బాధ్యతలను ఇతరులకు అప్ప చెప్పటం, ఏదో కోల్పోయినట్లు, దిగులుగా, అలసటగా, బలహీనంగా, నీరసంగా ఉండటం, కొత్తగా డైరీ రాయటం, శరీరానికి హాని కలిగించే వస్తువులను (నిద్రమాత్రలు, కత్తి, పాయిజన్ లాంటివి) సమకూర్చుకోవడం, రోజూ చేసే పనుల్లో తరచుగా తప్పులు చేయడం, అన్నిటిపై ఆసక్తి తగ్గి నిరాశ, నిస్పృహలో ఉంటూ సమస్యలు నాతోనే సమసిపోతాయి అనటం, ప్రతి చిన్నవిషయానికీ విషయాన్ని పెద్దగా ఊహించుకుని తల్లడిల్లడం, తమ ఇష్టమైన వస్తువులను నచ్చినవారికి ఇవ్వటం వంటి లక్షణాలున్న వారిని వారి దగ్గరి కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులు లేదా వారే స్వయంగా గుర్తించి అప్రమత్తం కావాలి.
వారి సమస్యలను, ఆలోచనలను శ్రద్ధగా విని అర్థంచేసుకోవటం ముఖ్యమైన విషయం. వారికి తోడుగా ఉన్నామని భరోసానూ, ఓదార్పునిస్తూ మానసిక ఆసరాగా ఉంటామని నమ్మకం కలిగించాలి. వారికి మనోధైర్యాన్ని కలిగించి తిరిగి జీవితం మీద ఆసక్తిని కలిగించగలగాలి, అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఆత్మహత్యా ఆలోచనలతో బాధపడే వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఒంటరిగా ఉంచకూడదు. వారు ఇష్టపడే వ్యక్తులను కలిసేలా, మాట్లాడేలా ప్రోత్సహించాలి. వారి బాధను పంచుకుని వారి మనసును తేలిక పరిచేలా చేసి సాధారణ స్థితిలోకి రప్పించే ప్రయత్నం చేయాలి.
''ఆత్మహత్యా ప్రయత్నం ఇష్టపడి చేసే పని కాదు!
అది ఒక సహాయం కోసం చేసే ఆక్రందన అని గుర్తించాలి!!'' అందరం కలిసి ఆత్మహత్యలులేని అందమైన సమాజాన్ని నిర్మించుదామని ఈ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం రోజున (సెప్టెంబర్ 10) ప్రతిన పూనుదాం!
శ్రీమతి ఆనంద దివాకర్
సెల్:9391018972