Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిరంకుశ భూస్వాముల దోపిడీకి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన అగ్నికణం చాకలి (చిట్యాల) ఐలమ్మ. నేటి జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం కేంద్రానికి చెందిన ఐలమ్మ... వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చూపిన తెగువ, ధైర్యం, ఆమెకు చరిత్రలో సమున్నత స్థానం కల్పించాయి.
ఐలమ్మ వరంగల్జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి శివారులోని క్రిష్టాపురంలో 1895లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఐలమ్మకు బాల్యంలోనే 13వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం, కుమారులు చిట్యాల సోమయ్య, లచ్చయ్య, ఉప్పలయ్య, లింగయ్య, లక్ష్మీనర్సయ్యలు, కుమార్తె పొలాస సోమనర్సమ్మ. ఐలమ్మ మల్లంపల్లి జమీందార్ వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పంట సాగుచేసింది. పేదరైతులను భూముల నుంచి తొలగించాలని రైతులు పండించుకున్న పంటలను దేశముఖ్‌ల గూండాలు దౌర్జన్యంగా కోసుకెళ్ళడం, అడ్డుకున్న రైతాంగాన్ని చితకబాదడం, అత్యంత క్రూరమైన వెట్టిచాకిరీ అమలు జరుగుతున్న రోజులవి. ఆర్థికంగా వెనకబడిన నిమ్నకులాల ప్రజలు దొరల పొలాల్లో వెట్టిచాకిరి చేయాల్సిందే. అంతటి క్రూరమైన పరిస్థితులను ఎదురించిన సాహసం ఐలమ్మది. పుట్టింది పేద రజక కుటుంబంలోనైనా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇది సహించలేని విసునూరు దేశ్‌ముఖ్ ఆగ్రహం చెంది సంఘం నాయకులు, ఐలమ్మ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించారు. అయితే అందరూ నిర్ధోషులుగా బయటపడగా తన ఓటమిని జీర్ణించుకోలేని దేశ్‌ముఖ్ పలుమార్లు పాలకుర్తి గ్రామంపై దాడులుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు దేశ్‌ముఖ్‌ను ప్రేరేపించి ఐలమ్మ పండించిన పంటను దోపిడీ చేయడానికి కుట్రపన్నాడు. భూమి తనదేనంటూ తప్పుడు కాగితాలు సృష్టించాడు. దీంతో ఐలమ్మ కమ్యూనిస్టు పార్టీ నల్లగొండజిల్లా నాయకత్వం సహకారం తీసుకొని పార్టీ నాయకత్వంతో పాలకుర్తిలో మకాంపెట్టించి భూపోరాటానికి కార్యకర్తలను సిద్ధం చేసింది.
ఆ సమయంలో దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఐలమ్మ పంటను దోచుకురావాలని గూండాలను ప్రేరేపించారు. విషయం తెలుసుకున్న నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కల్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు, వెంకటరెడ్డి, ధర్మభిక్షం, ఆవుల పిచ్చయ్య, నీలం విశ్వనాధం, నిర్మాల కృష్ణమూర్తి, ప్రతాపరెడ్డి, పాలకుర్తికి చెందిన 28మంది వాలంటీర్లు దేశ్‌ముఖ్ కిరాయి మూకలను అడ్డుకున్నారు. పంట పొలంలో అడుగు పెట్టనీయకుండా ఎదురొడ్డి పోరాడారు. ఆంధ్రమహాసభకు జై, దేశ్‌ముఖ్ దౌర్జన్యాలు నశించాలంటూ కమ్యూనిస్టులు నినాదాలు చేస్తూ పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దేశ్‌ముఖ్ అక్రమ కేసులు బనాయించినా ఐలమ్మ కుటుంబం అధైర్యపడకుండా ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చుకుని పోరాటాలు నిర్వహించింది. ఆ అమ్మ పోరాట పటిమకు ఆకర్షితులైన ప్రజలు పోలీస్ పటేల్ గడిపై దాడిచేశారు. అదే స్థలంలో మొక్కజోన్న పంట వేశారు. అలా పాలకుర్తి గ్రామం నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించింది. ఐలమ్మ భూపోరాటం సాయుధ రైతాంగ ఉద్యమానికి నాంది పలికింది. మహానేత పుచ్చలపల్లి సుందరయ్య పాలకుర్తిలోని అయిలమ్మ ఇంటికి చేరి ఆమె ఇంటి ఆవరణలోనే అరుణపతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి అయిలమ్మ ఇల్లు కుటుంబం అంతా ధైర్య సాహసాలతో కమ్యూనిస్టు పార్టీకి అంకితమైంది.
ఇది విసునూరు దేశ్‌ముఖ్ సహించలేకపోయాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించారు. అయిలమ్మ భర్త కొడుకులను సైతం అకారణంగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా పోరాడింది. యుద్ధ వ్యూహాలు నేర్చిన ఆర్గనైజరయింది. ఆయుధమెత్తిన గెరిల్లానే కాదు, జన సమీకరణ జరిపే నాయకురాలయింది. ఆమె బుర్రకథలు, నాటకాలతో, కళాకారిణిగా కూడా ప్రజలను చైతన్యం చేయడంలో తన వంతు కృషి చేసింది. ఎంతోమంది యువతీయువకులకు చైతన్యపరచి కార్యకర్తలుగా తయారు చేసింది. భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, కల్కూరి రాంచంద్రారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, నల్లనర్సింహులు, మల్లుస్వరాజ్యం, మద్దికాయల ఓంకార్ లాంటి హేమాహేమీలతో కలిసి ఆమె పార్టీ నిర్మాణానికి కృషిచేసింది. భూస్వామ్య సంకెళ్లను తెంచే విముక్తి పోరాటమైంది.
కాని నేడు అదే భూస్వామ్య భావజాలంతో ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ప్రశ్నించే హక్కు లేదంటూ నిర్బంధానికి గురిచేస్తున్నాయి. రాచరికపు వ్యవస్థ లక్షణాలనే ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన చూస్తుంటే నైజాం రజాకార్ల పాలన గుర్తుకు వస్తోంది. వీటన్నింటిని ఎదుర్కొని నిలబడాలంటే ఐలమ్మ సాగించిన పోరాటమే మనకు ఆదర్శం కావాలి. అందుకే ఆ వీరవనిత విగ్రహం ట్యాంక్‌బండ్‌పై పెట్టాలనీ, జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలనీ ప్రజలు కోరుతున్నారు. ఆమె స్ఫూర్తిని కాపాడుకోవాలి. భావితరాలకు అందించాలి. ప్రజల గుండెల్లో చెరగని స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న కన్నుమూసింది. ఈ వర్థంతి సందర్భంగా ఆమె ఆశయాల సాధనకు పునరంకితం కావడమే ఆమెకు నిజమైన నివాళి.
- జి. నరేష్
సెల్: 9491039520