Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షరసత్యం. ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మానవ శరీరం తమ విధులు నిర్వహించేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో పోషకాహార లోపం ప్రధాన అవరోధాలలో ఒకటి. దానిని అధిగమించి, అరికట్టడానికి 1982 నుంచి ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన, స్థిరమైన జీవనశైలిని అవలంబించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పౌష్టికాహార ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం. మనం తినే ఆహారం మన శరీరానికి శక్తి, ప్రోటీన్, అవసరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. మంచి ఆరోగ్యం , శ్రేయస్సు కోసం సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్థ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్ర. గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లికి అందిన పోషకాహారాన్ని బట్టే చిన్నారుల్లో మానసిక వికాసం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరిగి పలురకాల అంటువ్యాధులతో పాటు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణలో మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారానికి అంతటి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో నేటి పౌష్టికాహార వారోత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నవి.
పోషకాహార సమస్యకు ప్రధాన కారణాలు...
మన ఆరోగ్యానికి, పోషకాహారానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. పౌష్టికాహార లోపం తక్కువ బరువు, ఉబయకాయం, బుద్ధిమాంద్యం, రక్తహీనత, గర్భస్రావం, శిశు మరణాలు లాంటి సమస్యలకు దారి తీయడం జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చిస్తున్నారు. అంతేకాకుండా ఇది రక్తపోటు, మధుమేహం, మూత్రపిండ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పుకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణమైన పేదరికం, నిరుద్యోగంతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక అంశాలూ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ఆహార, వ్యవసాయ సంస్థ నివేదికలో (స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2020) భారతదేశంలో కోట్లాది ప్రజల కొనుగోలుశక్తి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే విధంగా లేదని పేర్కొనడమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఐసిఎంఆర్ నిర్దేశించిన సంపూర్ణ ఆహార పట్టిక అమలు కావడం కష్టతరం అని పేర్కొనవచ్చు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల అమలు పేలవంగా ఉండటంతో పోషకాహార లోపాలు క్షేత్రస్థాయిలో పెచ్చుమీరుతున్నాయి. రోజు రోజుకు మనిషి జీవనం యాంత్రికంగా మారిపోవడంతో ఆహార వినియోగంలో రీతిలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సులభ లభ్యత, సమయం ఆదా అవడం మూలంగా అధిక కేలరీలు, సాధారణ పిండి పదార్థాలు, సంతృప్త కొవ్వులు, చక్కెర, అధిక సోడియం కలిగిన భోజనం వైపు ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. ఇంటి వంటకాల బదులు సాధారణ పిండి పదార్థాలు లేదా సులభంగా లభ్యమయ్యే జంక్ ఫుడ్(చిరుతిళ్ళు), ప్రాసెస్ చేసిన ఆహారాల వైపు మొగ్గు చూపడంతో భారతీయ ఆహారంలో ప్రోటీన్ల కంటే కార్బొహైడ్రేట్లు అధికంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా పిల్లలు అధిక బరువు, స్థూలకాయం లాంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మరోవైపు రోగనిరోధక శక్తి లోపించి పలు అంటు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ, సమతుల ఆహారంపై అవగాహన లోపం, సరైన పారిశుద్ధ్య వ్యవస్థ కొరవడటం కూడా పోషకాహారాన్ని దెబ్బతీస్తున్నాయి.
భారతదేశంలో పోషకాహారలోపాన్ని పరిశీలిస్తే...
భారతదేశంలో తీరు తెన్నులు పరిశీలిస్తే... ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల్లో 69శాతం పోషకాహార లోపం ఉందని గత సంవత్సరం విడుదల చేసిన యూనిసెఫ్ నివేదిక పేర్కొన్నది. 2025 నాటికి ప్రపంచ పోషకాహార లక్ష్యాలను కోల్పోయే 88 దేశాలలో భారతదేశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్-2020 దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. పథకాలు ఎన్ని చేపట్టినా క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు భారతదేశం పోషకాహార లోపాన్ని నివారించలేకపోయిందని అనేక జాతీయ, అంత ర్జాతీయ సర్వేలు పేర్కొనడం గమనార్హం. ఆచరణలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలే ఇందుకు కారణం.
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చర్యలు...
పోషకాహార లోపం అనేది ఒక ప్రజారోగ్య సమస్య. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలున్న ఆహారం తప్పనిసరి. బహుముఖ కోణంలో కొనసాగుతున్న పోషకాహార లోపాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన, చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంది. సమతుల్య ఆహారం కొరకు క్యాలరీలు, మాంసకత్తులతో పాటు సూక్ష్మ పోషకాలైన ఐరన్, విటమిన్ ఎ, డి, జింకు వంటి అనుబంధ ఆహారాన్ని అందించాలి. అప్పుడే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలను పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. పిల్లలకు వ్యాధి నిరోధకశక్తిని కలిగించటంతో పాటు దైనందిన జీవితంలో సక్రమమైన పారిశుద్ధ్య వ్యవస్థను రూపొందించాలి. మనం తీసుకునే మొత్తం ఆహారంలో మాంసకృత్తుల విలువను పెంచేందుకుగాను సరియైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంలో భాగం కావాలి. ఆరోగ్యానికి అవసరమైన సమతుల ఆహారాన్ని తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు జామ, అరటి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, యాపిల్ వంటి పండ్లు, కూరగాయలను తీసుకుంటే పోషకాలు లభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీటిని పెరటి తోటల పంటలుగా పండించే స్వచ్ఛమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలి. అధిక ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలపై పరిశోధన జరగాలి, వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చిరుతిళ్ళు అలవాటును తగ్గించాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. రసాయన మందులు వాడి పండించిన ఆహారపదార్థాల ద్వారా ఊబకాయం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ విధానాలతో పాటు ఆహార వినియోగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలి. ప్రతి వంటిల్లు పోషకాహారశాలగా తయారు కావాలి. అందుకు ఆరోగ్యం అందించే ఆహార పట్టికను తయారు చేయాలి. నేడు సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛ ఆహార ఆవశ్యకత పెరుగుతున్న తరుణంలో పోషకాలనిచ్చే ఆహార పదార్థాలు ఉత్పత్తి అనివార్యం కావాలి.
- ఎస్. శ్యామల
సెల్: 8008539905
(సెప్టెంబర్ మాసాన్ని ''పోషకాహార మాసం''గా జరుపుకుంటున్న సందర్భంగా)