Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుపాకులు పేల్చడం, మానవీయతను మంటగలపటం, తల్లికి పుట్టి తల్లుల్ని హింసించటం, మనిషి రక్తానికి రుచి మరగటం, మారణహౌమం సృష్టించడం, ప్రజల్ని పిట్టల్లా కాల్చి వేయడం, అరాచక ఆటలాడటం, ఆయుధాల శబ్దకాలుష్య సంగీత రాగాలు వినడం మాత్రమే ఉగ్ర తాలిబాన్లకు తెలిసిన అసలు సిసలైన అవిద్య. అఫ్ఘానిస్తానీ అశ్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తరిమేసిన తాలిబాన్లు వెంటనే 'ఇస్లామిక్ ఎమిరేట్స్' ఉగ్రవాద ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోవడం త్వరత్వరగా జరిగిపోతున్నాయి. అఫ్ఘానిస్తాన్‌ను తాలిబానిస్తాన్గా మార్చి వేసి, 'షరియత్ చట్టపు' చట్రంలో బంధించి భయానక పాలనకు పునాదులు వేస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో 33మందితో తాలిబాన్ తీవ్రవాదులు మంత్రి వర్గాన్ని ప్రకటించారు. తమ మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదు. అఫ్ఘాన్ సమాజంలో స్త్రీలకు, బాలికలకు స్వేచ్ఛ అందని ద్రాక్షయే అవుతున్నది. మంత్రివర్గంలో కనీసం 17మంది మంత్రులను ఐరాస భద్రతామండలి/అమెరికన్ యఫ్బీఐలు తీవ్రవాదులుగా గుర్తించి, వారిని పట్టుకోవడం కోసం వెతకడం ప్రారంభించాయి. మంత్రిగా నియమించబడిన హక్కానీ నెట్వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ గతంలో అఫ్ఘానిస్థానీ పౌరులు, ప్రభుత్వ యంత్రాంగంపై పలు భయంకర దాడులను చేయడం, వందలు వేలల్లో ప్రాణాలు తీయడం జరిగింది. అమెరికన్ యఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో చేరిన హక్కానీ తలపై 10 మిలియన్ డాలర్లు నగదు ప్రకటించారు. తుపాకీ తూటాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత సులభంగా పాలన కొనసాగించడం వీలుకాదని తాలిబాన్లకు ఇప్పడిప్పడే తెలిసి వస్తున్నది. 3.8కోట్ల అఫ్ఘానిస్తాన్ జనాభాను శాంతియుతంగా పరిపాలించడం తాలిబాన్లకు నల్లేరుపై నడక కాదు. అనేక సవాళ్ళ నడుమ ఆయుధ భాష మాత్రమే తెలిసిన తాలిబాన్లకు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. ఇప్పటికీ అఫ్ఘాన్‌లోని అన్ని జిల్లాలు తాలిబాన్ల పాలనలోకి రాలేదు. స్థానిక ప్రజలు తాలిబాన్లకు లొంగడానికి, వారి పాలనను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అఫ్ఘానిస్తాన్ లోని కొన్ని పట్టణాలు నేటికీ తాలిబాన్ల అదీనంలోకి రాలేదు. ప్రభుత్వ సుపరిపాలన కొనసాగించడానికి అంకితభావం, అర్హత కలిగిన మానవ వనరులు, మౌలిక వసతులు తాలిబాన్ల వద్ద లేవు. నేడు తాలిబాన్ల చేతిలో 80,000-90,000 మంది సాయుధ బలగాలు మాత్రమే ఉన్నాయి. తాలిబాన్ ఉగ్రవాదుల్లో అనేక తీవ్రవాద సాయుధ గ్రూపులు ఉండగా, అందులో కొన్ని సమూహాలకు మాత్రమే ప్రభుత్వంలో చోటు కల్పించబడింది. అమరుల్లా సాలేV్‌ా (మాజీ ఉపాధ్యక్షుడు), అహ్మద్? మసూద్? (ముజాహిదీన్ ప్రముఖ నాయకుడు అహ్మద్? షా మసూద్? కుమారుడు), ఇస్మైల్ ఖాన్ (తాజిక్ వర్గ నాయకుడు), అహ్మద్? మసూద్? (యన్ఆర్యఫ్ అధినేత) లాంటి అనేక వర్గాల నాయకులు తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి, ఆయుధం ఎత్తడానికి సిద్ధంగా ఉంటూ, తాలిబాన్ ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతున్నారు. అఫ్ఘానిస్తానీల నమ్మకం చూరగొనక పోవడం, ఆర్థికంగా అతి బలహీనంగా ఉండడం, మానవీయ మారణహౌమం, నైపుణ్య మానవ వనరుల కొరత, ప్రపంచ దేశాల గుర్తింపు లేకపోవడం, ఐయస్ ఉగ్రవాదుల హింస, అంతర్గత కుమ్ములాటలు, మహిళల రక్షణ/స్వేచ్ఛ హరించడం, ఇరుగు పొరుగు దేశాల సహాయం నిలిచిపోవడం, పేదరిక మబ్బులు కమ్మడం లాంటి కారణాలు రానున్న కాలంలో తాలిబాన్ల పరిపాలనకు పెను సవాళ్ళుగా మారనున్నాయి. అత్యంత పేదరికం కలిగిన అఫ్ఘానిస్తాన్ దేశవ్యాప్తంగా అనేక జాతులు పలు మౌలిక సమస్యల నడుమ నివసిస్తున్నారు. 1996-2001 మధ్య తాలిబాన్ 1.0ప్రభుత్వం కూడా సజావుగా పాలన నడుపలేక పోయింది. ప్రభుత్వ పాలనలో ఇమిడి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పాలన నీతి, పరిపాలనా దక్షత తాలిబాన్లకు అతి తక్కువ. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, విద్య, సురక్షిత నీరు, రవాణా వ్యవస్థ, కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు లాంటివి సాధారణ ప్రజలకు కల్పించడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. దేశ నిధుల్లో దాదాపు 40శాతం విదేశీ సహాయంగా వస్తుండేది. అమెరికా అందించాల్సిన 9.5బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఆపివేశారు. ఐయంయఫ్ నిధుల విడుదలకు కూడా దారులు మూత బడ్డాయి. నేటికి 5మిలియన్ల అఫ్ఘాన్లు నిరాశ్రయులై సహాయం కోసం ప్రభుత్వం వైపుకు చూస్తున్నారు. ఆగష్టు 2021 తాలిబాన్ల హింసాత్మక పోరులో 4లక్షల మంది నిరాశ్రయులైనారని అమెరికా తెలుపుతున్నది. ఈ శరనార్థులకు పునరావాసం కల్పించడానికి తాలిబాన్లకు అధిక నిధులు కావాలి.
ఫాక్షనిజం పునాదిపై వెలసిన తాలిబాన్ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమం ప్రధాన ప్రాధాన్య అంశం కాదు. ప్రస్తుత తాలిబాన్లలో మూడు ప్రముఖ వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ మార్పిడికి యుయస్తో సంప్రదింపులు జరిపిన రాజకీయ తాలిబాన్ వర్గానికి నాయకుడిగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, మిలటరీ విభాగ అధిపతి మెలావీ యాఖూబ్ (తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఓమర్ కుమారుడు), హక్కానీ నెట్వర్క్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీలు ఏకతాటిపైకి రావడం, సుపరిపాలన అందించడం అసాధ్యంగానే తోస్తున్నది. ప్రపంచ మానవీయ సంస్థలు ఆర్థిక సహాయానికి అంగీకరించినా తాలిబాన్ల ప్రతి చర్య ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా ఉంది. తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించడానికి అనేక దేశాలు అనుమాన పడుతున్నాయి. పలు దేశాల విదేశీ రాయబార కార్యాలయాలు నిలిపి వేయబడడం లేదా మూసి వేయడం జరిగింది. విశ్వ దేశాల మన్ననలు పొందటానికి తాలిబాన్ ప్రభుత్వం సకారాత్మక పాలన రుచిని చూపాల్సి ఉంది. తాలిబాన్లు తుపాకీ పాలనకు చరమగీతం పాడి, ఆధునిక పరిపాలనాశక్తిని వినియోగించి ప్రజా సంక్షేమ పాలనకు ప్రత్యక్షంగా చొరవ చూపాలని ఆశిస్తున్నారు. తాలిబాన్లు ఎలాంటి తీవ్రవాద హింసాత్మక పాలనను ప్రదర్శించినా, రానున్న రోజుల్లో ప్రజాగ్రహజ్వాలలు ఎగిసి పడడం, తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037