Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతి ప్రయోజనాల కోసం సృష్టించిన ఆస్తులను, మౌలిక సదుపాయాలను, ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఒత్తిడితో బడా పెట్టుబడిదారులకు చట్టబద్ధంగా దోచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ నగదీకరణ ప్రణాళిక పేరుతో శరవేగంగా ముందుకు వెళ్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి భారత రాజ్యాంగాన్ని అనుసరించి, జాతి సంపదను, వనరులను కాపాడి, సేవలను అర్హులకు పారదర్శకంగా బదిలీ చేయాలే గానీ అమ్మకూడదు. కానీ దానికి పూర్తి భిన్నంగా మానిటైజేషన్ పేరుతో యావత్ జాతి ఆస్తులను అమ్మకం లేదా తాకట్టు పెట్టడమంటే స్థూలంగా భారతదేశాన్ని నిట్టనిలువుగా నడిబజార్లో నగంగా వేలం వేయడమే. భారతీయ వనరులను ఈ విధంగా బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడంలో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి.
మానిటైజేషన్ బ్లూప్రింట్‌లో సామాన్య జనహితం కాకుండా బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలే కన్పిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే ప్రభుత్వ మద్దతుతో వచ్చే లాభాలన్నీ చట్టబద్ధంగా నేరుగా కార్పొరేట్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. మానిటైజేషన్ ప్రక్రియలో ప్రభుత్వ ఆస్తులపైనా, మౌలిక వనరులపైనా వ్యాపారులకో, సంస్థలకో 50 నుంచి 100 సంవత్సరాలు నిర్వహణాధిపత్యం ఇవ్వడం ప్రయివేటైజేషన్ కన్నా ప్రమాదకరం. దీన్ని బట్టి మానిటైజేషన్ అంటే ఒకేసారి మొత్తంగా అమ్మడం కాకుండా అంచెలంచెలుగా అమ్మడం అని అర్థమవుతుంది. ఎలా అమ్మినా మొత్తానికి ఇది ప్రభుత్వ ఆస్తుల అమ్మక పథకమే. మౌలిక వనరుల సంపద సృష్టించడానికి, ఇప్పుడున్న జాతీయ మౌలిక వనరులపై అదుపును, యాజమాన్యాన్ని, లాభాలు చేసుకునే అధికారాన్ని ప్రయివేట్ వ్యక్తులు లేదా సంస్థల పరం చేయడమే మానిటైజేషన్ ప్రధానోద్దేశం. బడ్జెట్ నిర్వహణలో ప్రభుత్వ వ్యయం నిమిత్తం ప్రజలకు చెందిన ఉమ్మడి ఆస్తులను మానిటైజేషన్ చేయడమనేది ద్రవ్యలోటును పెంచడమే అవుతుంది.
ప్రభుత్వ నిర్వహణ ఖర్చు కోసం ద్రవ్యలోటును పెంచేటప్పుడు ఆ ఖర్చు నిమిత్తం ప్రయివేట్ రంగం నుండి తీసుకునే సొమ్ముకు ప్రభుత్వం సెక్యూరిటీల రూపంలో హామీ ఇస్తుంది. ఆ హామీకి గ్యారంటీగా ఉండేది ప్రభుత్వ ఆస్తులే. అదే మానిటైజేషన్ అయితే ప్రభుత్వ ఆస్తులనే నేరుగా ప్రయివేట్ రంగానికి అప్పజెప్పి అందుకు బదులుగా సొమ్ము తీసుకుని ఖర్చు చేస్తుంది. ఏదో ఒక రూపంలో ప్రభుత్వ ఆస్తులని ప్రయివేట్ రంగం చేతుల్లో పెడుతుంది. స్థూలంగా ప్రభుత్వాలు ద్రవ్యలోటును పెంచి ఖర్చు చేయడం వలన దేశ ప్రజల వినియోగం పెరుగుతుంది. కానీ మానిటైజేషన్ జరిగినప్పుడు ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ రంగం లీజుకు తీసుకుంటుంది. ఆ ఆస్తుల మీద లాభాలు సంపాదించడం కోసం వినియోగ చార్జీలు పెంచుతుంది. కార్మికుల వేతనాల నిమిత్తం అయ్యే ఖర్చును తగ్గిస్తుంది. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో కార్మికుల వేతనాల వాటా తగ్గిపోతుంది. ప్రయివేట్ యజమానుల లాభాల వాటా పెరుగుతుంది. దీని వలన మార్కెట్లో సరుకుల వినియోగం తగ్గుతుంది. కార్మికుల ఆదాయాలు తగ్గితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇంకోవైపు మానిటైజేషన్ వలన యజమానుల లాభాలు పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టు వినియోగం మాత్రం పెరగదు. అంటే మానిటైజేషన్ ఫలితంగా మొత్తం మీద వినిమయం తగ్గుతుంది. అదే ద్రవ్యలోటు పెంచితే ఆ సొమ్ము ప్రయివేట్ రంగం నుంచి వస్తుంది గనుక వేతనాల మీద దాని ప్రభావం ఉండదు. అదే విధంగా అదనపు ఖర్చు కోసం సంపద పన్నును గాని లాభాలపై పన్నును గాని పెంచినా దాని వలన కూడా మార్కెట్లో వినిమయం మీద ప్రతికూల ప్రభావం పడదు. అందుచేత మానిటైజేషన్ అనే ప్రక్రియ తీవ్ర స్థాయిలో నిరుద్యోగం ఉన్నప్పుడు, ఉత్పత్తి స్థాపక సామర్థ్యం వినియోగంలో చాలావెనకబడి ఉన్నప్పుడు చేపట్టకూడని విధానం. భారతదేశంలో ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళిక గురించి గొప్పగా మాట్లాడుతూ, ప్రభుత్వ రంగాన్ని విక్రయించాలనే తమ దోపిడీ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరంతో ముగిసే నాలుగేండ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల మేరకు ముందస్తు లేదా దశలవారీ చెల్లింపులకు ప్రతిగా దేశంలోని 26,700 కి.మీ రహదారులు, 400 రైల్వే స్టేషన్లు, 90 రైళ్లు, 1,400 కి.మీ రైలు మార్గం, 265 గూడ్స్ రైళ్ళు, 15 రైల్వే స్టేడియాలు, 28,608 సర్క్యూట్ కి.మీ విద్యుత్ సరఫరా లైన్, 2,86,000 కి.మీ భారత్ నెట్ ఫైబర్, 14917 బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ టవర్లు, ఆరు జిగా వాట్ల విద్యుదుత్పత్తి రంగం, 8,154 కి.మీ సహజ వాయువు పైప్ లైన్లు, 3,930 కి.మీ పెట్రోలియం ఉత్పత్తుల పైప్ లైన్లు, ఫుడ్ కార్పొరేషన్‌కు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన 210 గోడౌన్లు, 160 గనులు, 25విమానాశ్రయాలు, 9 ఓడ రేవులకు చెందిన 31 ప్రాజెక్టులు, 2 జాతీయ క్రీడా స్టేడియాలు, 2 ప్రాంతీయ కేంద్రాలు, ఢిల్లీలో ఇళ్ల స్థలాలు, దేశవ్యాప్తంగా హౌటళ్లు మొదలైనవన్నీ బడా ప్రయివేట్ పెట్టుబడిదారులకు అప్పగించగా వచ్చిన సంపదను, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచి రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలన్నదే ఆ ప్రణాళిక నిజ స్వరూపం. ఏండ్ల తరబడి ప్రభుత్వ ఆస్తులను ప్రయివేట్ సంస్థలకు కట్టబెడితే రోడ్ల మీద, రేవుల్లో, ఎయిర్ పోర్టుల్లో, పవర్ గ్రిడ్‌లో, గ్యాస్ పైపుల విషయంలో పెరిగే ధరలకు సామాన్యులు బలికావలసిందే. ముందు కాంట్రాక్టులు సాధించి, తర్వాత బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని, లాభాల కోసం జనాన్ని పెంచిన ధరలతో పీడించడమనే దారుణాలు ఈ అందమైన నగదీకరణ వెనక ఉండే పచ్చినిజాలు. డీమానెటైజేషన్తో ప్రతి సామాన్యుడి బతుకు అల్లకల్లోలం కావడం చూశాం. ఇప్పుడు మానిటైజేషన్‌తో జాతి సంపద కుదువ పెట్టే కార్యక్రమం ఈ ఏడాది నుంచే అమలు కాబోతున్నది. సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కొంతమంది అస్మదీయులనే ప్రోత్సహించి, ఆశ్రిత పెట్టుబడిదారులను అందలం ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దేశమంటే పాలకవర్గం కాదు. వారిని ఓట్ల ద్వారా గద్దెనెక్కించే ప్రజలు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిరంకుశ చర్యలను నిరసించి,మన జాతీయాస్తులను కొల్లగొట్టడాన్ని ప్రతిఘటించాల్సిన అవసరముంది.
సెల్: 9676407140
నాదేండ్ల శ్రీనివాస్