Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకుండా అక్రమంగా నల్లధనాన్ని కూడ బెడుతూ అక్రమార్జన చేస్తున్న నల్లకుబేరులు రోజు రోజుకు పెరిగి పోతున్నారు. వీరు ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీకృతమై నల్ల ధనరాశులు పెరిగి పోవడానికి కారణం అవుతున్నారు. ఇలా ఇది ఒక విశ్వ రుగ్మతగా రూపుదిద్దుకొంది.. ఏ ఆర్థిక వ్యవస్ధలో చూసినా ఆర్థిక స్థోమత లేని అల్పాదాయ మధ్యతరగతి వర్గాల వారు మాత్రమే పరోక్ష పన్నులరూపంలో నిజాయితీగా ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తూ ఉంటే. కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ కుబేరులైన వాళ్ళు మాత్రం తాము చెల్లించవలసిన ఆదాయ పన్నును ఎగవేసి అక్రమ సంపాదనను మూటలు కట్టుకుంటున్నారు. నల్లధనాన్ని ఏ విధంగానూ ఇబ్బంది లేకుండ చట్టానికి దొరకకుండా అత్యంత గోప్యంగా సురక్షితంగా దేశ సరి హద్దులు దాటించి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించే సంస్ధలు అనేకం పుట్టుకొస్తున్నాయి. గతంలో అయితే నల్లకుబేరులు అందరూ తమ ధనాన్ని స్విస్ బ్యాంకులలో దాచి పెడతారు అని అనుకునే వారు. కానీ కాల క్రమంలో మార్పు సంభవించింది. ప్రధానంగా పనామా పేపర్ల లీకేజీ తరువాత స్విట్జర్లాండ్ కొంత వరకూ పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఫలితంగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనం నిల్వ చేయడం సురక్షితం కాదనే ఆలోచనతో పన్ను ఎగవేతదారులు తమ డబ్బును మరింత గోప్యంగా ఉండే దేశాలకు తరలించడానికి సిద్ధం అయ్యారు. ఈ తరహా గోప్యతకు పనామా, దుబారు, మొనాకో, స్విట్జర్లాండ్, కేమాన్ ఐలాండ్స్ వంటి దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి.
నల్ల కుబేరులంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును ఈ దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు కంపెనీల్లో దాచుకుంటున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు వాటి దాకా చేరినా ఆ ట్రస్టులు కంపెనీల అసలు యజమానులెవరో తెలుసుకోవడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే వ్యక్తులు లేదా సంస్థల పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంలో ఈ దేశాల్లోని అధికారులు ఏ మాత్రం సహకరించరు. కాబట్టి పన్ను ఎగవేతదారు లేదా అక్రమ సంపాదన లేదా నల్లధనం కలిగిన వ్యక్తులకు తమ సంపాదన గురించి ఎటువంటి ఆందోళనా ఉండదు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వీరు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనితో పాటు ఈ దేశాలు అతి తక్కువ ఆదాయ పన్ను లేదా అసలు పన్ను లేకుండా చేయడం వంటి సదుపాయాలను నల్ల కుబేరులకు అందిస్తున్నాయి. అందుచేతనే ఈ దేశాలను పన్ను ఎగవేత దారుల స్వర్గ ధామాలు అని పిలుస్తున్నారు. వ్యక్తులే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ సంపదను ఈ దేశాలకు తరలిస్తుంటాయి. యాపిల్, గోల్డ్‌మన్ శాక్స్, నైకీ, ఫైజర్, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు తమ సంపదను ఇక్కడకు తరలించి బిలియన్ల డాలర్లను మిగుల్చుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఈ స్వర్గధామ దేశాలు పన్ను ఎగవేతలకు పావుగా ఉపయోగపడటమే కాదు అక్రమ సంపద, నల్లధనం కూడబెట్టేందుకు మార్గాలుగా నిలుస్తున్నాయి.
దీనివలన ఎన్నో దేశాలు ఆదాయపు పన్ను కోల్పోయి ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సమస్య ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సాంకేతికంగా వృద్ధి చెందిన నేటి కాలంలో దీని మూలాలు దీని ప్రవాహం బయట పడుతున్నాయి. ఇదే సాంకేతికతను ఆధారంగా చేసుకుని కుబేరులు గుట్టు చప్పుడు కాకుండా నల్లధనాన్ని మరింత సులభంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈ సమస్య పెను సవాలుగా మారింది. కానీ ఈ నల్ల కుబేరులను మాత్రం ఏమీ చేయలేక పోతున్నారు. వీరు పెట్టుబడులు పెట్టిన విధానంపై అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు ప్రాణాలకు తెగించి సేకరించిన సమాచారాన్ని పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ ఆధారాలతో సహా బయట పెట్టాయి. సొంత దేశంలో పన్నులు ఎగ్గొట్టి సంపదను సురక్షిత స్థావరాలకు తరలించే బడాబాబుల బాగోతాలు చాలా సార్లు బయటపడ్డాయి. అయితే తాజాగా 170 దేశాలకు చెందిన 600మంది జర్నలిస్టులతో ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐ.సీ.ఐ.జె) దాదాపు రెండేండ్ల పాటు అవిశ్రాంతంగా పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆదాయపు పన్ను ఎగవేసి నల్లధనాన్ని సంపాదించిన నల్ల కుబేరుల అక్రమ పెట్టుబడుల గుట్టు రట్టు చేసింది.
వివిధ దేశాలు నుంచి అక్రమ ధనాన్ని గోప్యంగా తరలించిన విధానాన్ని, దాని తరలింపునకు సహాయపడిన 14 సంస్థల నుంచి రహస్యంగా సమాచారాన్ని సేకరించి 1.2 కోట్ల పత్రాలలో జర్నలిస్టులు విపులంగా వివరించారు. వీటినే పాండోరా పేపర్స్‌గా పేర్కొంటున్నారు. ఈ పేపర్స్‌లో నల్లధనాన్ని గోప్యంగా పెట్టుబడులుగా పెడుతున్న 14 అంతర్జాతీయ కార్పొరేట్ సంస్ధలు... తమ దొంగ వ్యవహారాలను నడపడానికి ఏకంగా 29వేల డొల్ల కంపెనీలు, ట్రస్టులను ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది. వీరి పరిశోధన ద్వారా 91దేశాల్లోని అక్రమార్కుల పేర్లు బయట పడ్డాయి. వారిలో ఏకంగా 35మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీలు ఉన్నారు. మరో 336మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారంటే నల్లధనం అవినీతి ఎంత విశృంఖలంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నివేదిక ప్రకారం కూడా మన దేశంలో నల్ల కుబేరులు తక్కువేం కాదు. మొత్తం 380మంది దాకా మనదేశంలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న మన దేశానికి చెందిన ఇండియన్ ఎక్స్ ప్రెస్.. వారిలో 60మంది చిట్టాను సంపాదించినట్లు పేర్కొంది. వారిలో ఆరుగురు దిగ్గజ రాజకీయ నాయకులు కాగా అందరూ మాజీ ఎంపీలని వెల్లడించింది. ఈ జాబితాలో అనిల్ అంబానీ, కిరణ్ మజుందార్ భర్త జాన్, నీరా రాడియా, జాకీ ష్రాఫ్, కెప్టెన్ సతీష్ శర్మ, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. వీరిలో అనిల్ అంబానీ బ్రిటన్ కోర్టులో దివాళా ప్రకటించి కోట్లాది డాలర్ల విలువ చేసే పెట్టబడులను విభిన్న కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టారని నివేదిక పేర్కొంది. అంతకన్నా ముఖ్యంగా మన దేశం నుండి పరారయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఆయన సోదరి పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించి నల్ల ధనాన్ని తరలించారని తేలింది.
మన దేశంలో రుణాలు ఎగవేయడం ఆదాయ పన్నులు ఎగవేయడం ద్వారా పన్ను ఎగవేతదారులు సంపాదించిన నల్లధనాన్ని సురక్షితంగా పన్ను స్వర్గ ధామ దేశాలకు తరలిస్తున్నారు. ఇలాంటి పన్ను ఎగవేతల మూలంగా ప్రపంచవ్యాప్తంగా 600 బిలియన్ డాలర్లు (45 లక్షల కోట్ల రూపాయలు) ఆయా ప్రభుత్వాలు కోల్పోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇలా కోల్పోయిన ఆదాయంలో తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలకు చెందిన మొత్తం 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రావలసిన ఈ ఆదాయం అంతా అక్రమ పెట్టుబడులకు తరలి పోతుంది. కుబేరులు మరింత కుబేరులు అయిపోతున్నారు.
ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ విధానాల ప్రాధాన్యం పెరగడం వలన పెట్టుబడి ఎక్కడికైనా పంపవచ్చు అనే విధానాలు ఈ స్వర్గధామ కంపెనీలలో పెట్టుబడులకు అవకాశాలు పెంచాయని ఆర్థిక వేత్తల అభిప్రాయం. దీనివల్లనే దోపిడీ విధానాలకు ఇవి ఆజ్యం పొసే అవకాశం కల్పించాయి. పాండోరా నివేదిక కూడా ఈ తరహా ఘరానా మోసాలకు ఉదారవాద ఆర్థిక విధానాలే మూలం అని పేర్కొంది.
- రుద్రరాజు శ్రీనివాసరాజు
సెల్: 9441239578