Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020 మార్చి 22న కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభుత్వం ఆరు నెలలు కఠినమైన లాక్డౌన్ విధించింది. అన్ని వ్యవస్థలతో పాటు రాష్ట్రంలోని విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. మహమ్మారి ధనవంతుడు దరిద్రుడు అన్న తేడా లేకుండా అందరి జీవితాల్లో ప్రభావం చూపించింది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అతలాకుతలమయ్యారు. ఉపాధిలేక పస్తులుండి పోయిన కుటుంబాలున్నాయి. వైరస్సోకి కుటుంబాలకు కుటుంబాలే మాయమైపోయాయి. చాలామంది పిల్లలు అనాధలయ్యారు. ఈ వ్యాధి పెద్దల జీవితంలో ఎంత ప్రభావం చూపించిందో విద్యార్థుల జీవితాల్లో అంతకంటే ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. 17నెలల పాటు చదువు సంధ్యలు లేక ఆనెలైన్ క్లాసులు అర్థమయ్యి అర్థంగాక సెల్‌ఫోన్, టీవీ లాంటి సౌకర్యాలులేక ఒకవేళ ఉన్నా సిగల్ సరిగాలేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేద్దామన్నా చేసే పరిస్థితులు లేక విద్యార్థులు అభ్యసనా కాలాన్ని చాలా నష్టపోయారు. సరైన జ్ఞానసముపార్జన చేయలేకపోయారు. ఇటు తల్లిదండ్రుల కొట్లాటల మధ్య, అటు సమాజం వేధింపుల మధ్య విద్యార్థులకు జ్ఞాన శూన్యం ఏర్పడటమేగాక మానసిక క్షోభ అనుభవించారు. కనీస భాషా సామర్థ్యాలు వినడం, చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియ లు చేయడం మర్చిపోయారు. అభ్యసనకు మూల మైన ఓనమాలు ఒకటి రెండ్లు కూడా చదవలేని పరిస్థితి ఉంది.
ఎట్టకేలకు థర్డ్‌వేవ్ భయాల మధ్య సెప్టెంబరు ఒకటో తారీకు నుండి పాఠశాలలు పునః ప్రారంభయ్యాయి. అమ్మ ఒడిలాంటి ఊరు బడికి వెళ్లి మళ్లీ చదువుకునే అవకాశం విద్యార్థులకు కలిగింది. ఇన్నాళ్లు సుద్ద ముక్కలు చేతిలో లేక విద్యార్థుల ముద్దు మాటలు చెవులకు వినరాక బోసిపోయిన గది గోడల మధ్య బిక్కు బిక్కుమంటూ కూర్చుని విసిగిపోయి సంవత్సరమున్నర కాలం వెల్లదీసిన ఉపాధ్యాయుల నుదురు పాఠశాల ప్రారంభంతో నూరు దీపాల కాంతితో వెలిగిపోయింది.
కోవిడ్ కాలంలో అనాధలైన పిల్లలకు, ఆదాయం కోల్పోయిన తల్లిదండ్రులకు, ఫీజుకట్టలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు, నడిమంత్రపు ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు కొన్నేండ్లపాటు వలస వెళ్లి మళ్లీ వచ్చిన పిల్లలకు అనాధలకు అభాగ్యులకు ఏ ఆధారంలేని వారికి పచ్చటి చెట్టు లాంటి ప్రభుత్వ బడి మాత్రమే నిలువ నీడనిచ్చింది. నీకు నేనున్నానంటూ ప్రతి విద్యార్థినీ పలకరించింది ఆదరించింది అక్కున చేర్చుకుంది. అయితే ప్రభుత్వ బడిలో అరకొర వసతులంటాయని, అందరు నిరు పేద దళిత, గిరిజన, బహుజన వర్గాల పిల్లలు మాత్రమే చదువుతారని, అది మనలాంటి వాళ్లకు సరితూగదని వెక్కిరించిన వాళ్లే నేడు ఏదున్నా లేకున్నా మా పిల్లవాడికి చదువులు వస్తే చాలు ప్రయివేటు ఫీజులు కట్టలేమని ఒకప్పుడు మేము సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదివామని వారి చిన్నారులను ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి ప్రేమను ఆస్వాదిస్తూ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసిస్తూ ఊరు బడికి మించిన గుడి, దానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదని ఈరోజు తల్లిదండ్రులకు అర్థమైంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. మూత పడతాయని, మూతపడాలని ఎదురుచూసిన పాఠశాలలే మళ్ళీ తెరుచుకుంటున్నాయి. అదును చూసి విద్యార్థులు తక్కువగా ఉన్న సమయంలో హేతుబద్ధీకరణ చేయాలని చూసిన ప్రభుత్వ ప్రయత్నానికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో కొంత అడ్డంకి ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆదరణ లేకున్నా ప్రమోషన్లు లేకున్నా ట్రాన్స్ఫÛర్లు లేకున్నా హెచ్ఆర్ఏ తగ్గించి ఉన్న వసతులు తగ్గించి పీఆర్సీ ఇచ్చినా సమయానికి డీఏలు ఇవ్వకపోయినా, పెన్షన్ లేకపోయినా, పాఠశాలలో ప్రతి పనికి ప్రతి పైసాకు బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేసినా సస్పెన్షన్లు చేసినా చివరికి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కారని వెక్కిరించినా తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా, దండించేవాడుగా, దారిచూపే వాడుగా, బహురూపిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుముఖ పాత్రలు పోషిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇప్పుడు మరొక బాధ్యత వచ్చి చేరింది. అదే స్కావెంజర్ చేసే పారిశుద్ధ్య పని బాధ్యత.
విద్యార్థులకు అజ్ఞానమనే బూజు దులిపి విజ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఊడవడం ఊడిగం చేయడం కొత్తగాక పోయినా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పెరిగిన విద్యార్థుల సంఖ్యను కాపాడు కుంటూ గుణాత్మక బోధన చేస్తూ మన పాఠశాలలను మనమే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది.
- మన్నె చంద్రయ్య, సెల్: 9441681685