Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్ ఉత్తరాలు ఖండాంతరాలకు పంపిస్తున్నాం. నాడు ప్రయాణాలు చేసి మనిషి, మనిషిని కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని చుట్టేస్తున్నాం. టెలిగ్రామ్, టెలిఫోన్లు నిన్నటి నాగరికతలు. నేడు అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని కుగ్రామం చేశాం. నేటి వయోవృద్ధులకు తెలియని ఎన్నో నవ్య శాస్త్రసాంకేతిక ఉపకరణాలు నవ యువతరానికి జీవనశైలిలో భాగమైనాయి. తాతలు పాత చింతకాయ పచ్చడి అయినారు. సాంకేతిక విప్లవ తుఫానులో యువత కొట్టుకుపోతున్నారు. తండ్రి ఆలోచనలకు కొడుకు/కూతురు అభిప్రాయాలకు అంతరాలు పెరిగాయి. కొడుకు తండ్రిని 'నీకేమీ తెలియదు' అనే సంస్కృతి వెలసింది. తరానికి తరానికి మధ్య ఆలోచనలు, జీవనశైలి, నాగరికతల్లో సువిశాల వ్యత్యాసాలు మొగ్గలు తొడిగాయి. నేటి తరాల అంతరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధునిక భావనల నేపథ్యంలో వయస్సును బట్టి తరాలను ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది.
1.బేబీ బూమర్స్: 1946-1964ల మధ్య జన్మించిన 57-75 వయస్సు కలిగిన జనాభాను బేబీ బూమర్స్గా వర్గీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వీరి జనాభా అధికంగా ఉన్నది. బేబీ బూమర్స్ సాంప్రదాయ ఆలోచనలు చేస్తారు. టీవీ, రేడియో, మ్యాగ్జైన్లు, దినపత్రికలు లాంటి మాద్యమాలను ఇష్టపడతారు. నేటి ఫేస్బుక్, వాట్స్‌యాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాలను కూడా వినియోగించే వృద్ధులు అధికంగానే ఉన్నారు. కుటుంబ సమైక్య భావనలకు పెద్దపీట వేస్తున్నారు. సమకాలీన మిత్రులు, బంధాలు బంధుత్వాలకు విలువను ఇస్తారు. వీరి అనుభవాలు, ఆలోచనలకు నేటి యువత పని తీరుకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. వీరిని యువత చిన్నచూపు చూసే నవ సంస్కృతిని కూడా చూస్తున్నాం. 1925-45ల మధ్య జన్మించి 76-96 వయస్సుగల వయోవృద్ధులను 'సైలెంట్ జనరేషన్'గా, 1910-24ల మధ్య జన్మించి 97-111 వయస్సు కలిగిన పండుటాకుల తరాన్ని 'గ్రేటెస్ట్ జనరేషన్'గా వ్యవహరిస్తారు.
2. జనరేషన్ ఎక్స్ (శ):ఈ తరం ప్రజలు 1965-1980 మధ్య జన్మించి నేడు 41-56 ఏండ్ల వయస్సును కలిగి ఉన్నారు. వీరినే 'యంటివీ' లేదా 'లచ్కీ' తరం అని కూడా వ్యవహరిస్తారు. ఈ వర్గపు జనులు పేపర్, మ్యాగ్జైన్లు, టీవీ, రేడియోలను వినియోగించినా నేటి సామాజిక మాద్యమాల్లో కూడా కనీసం వారానికి 7గంటలు గడుపుతున్నారు. వీరికి పరిశోధించే తత్వం, ఆర్థిక క్రమశిక్షణ, మానవ సంబంధాల పట్ల అవగాహన అధికంగా ఉంటుంది. రెండు తరాల మధ్య నలిగిపోయే స్థితిలో ఉన్న ఈ తరం తమ పిల్లలకు ఆధునిక చదువుల సౌకర్యం కల్పిస్తూనే, తమ తల్లితండ్రులను గౌరవిస్తుంటారు. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ, చేసిన అప్పులను తీర్చడానికి కృషి చేస్తారు. వీరు బ్రాండెడ్ వస్తువులను, నాణ్యతలను శోధిస్తారు.
3. జనరేషన్ వై (్): ఈ తరానికి చెందిన పౌరులు 1981-1996 మధ్య జన్మించి 25-40 ఏండ్ల వయసును కలిగి ఉంటారు. ఈ తరాన్ని 'మిలినియల్స్' అని కూడా అంటాం. వీరు సాటలైట్ టివీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి సౌకర్యాలను వాడతారు. సామాజిక మాద్యమాల్లో అధిక సమయం వెచ్చిస్తారు. స్మార్ట్ఫోన్లు వీరి శరీరంలో ఒక అంగమై పోతాయి. బ్రాండ్ విలువలకు తిలోదకాలిస్తూ, ఆకర్షణలను లొంగిపోయి తొందర పడతారు. వెంటనే ఫలితాన్ని ఆశించే విచిత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ విప్లవ ఫలాలను అందుకుంటారు. పెళ్లిళ్లను ఆలస్యంగా చేసుకోవడం, స్వంత గృహం, సంసారం కోసం ఆరాట పడతారు. సంపాదనను వినోదాల కోసం వెచ్చిస్తూ, పొదుపుకు దూరంగా 'ఇన్స్టంట్' సంస్కృతికి బానిసలుగా నిలుస్తున్నారు.
4. జనరేషన్ జడ్ (్గ): 1997-2012 మధ్య జన్మించి 9-24 ఏండ్ల వయసును కలిగి ఉంటారు. ఈ తరం వారిని 'ఐ-జనరేషన్', 'హౌమ్‌లాండ్ జనరేషన్' అని కూడా పిలుస్తాం. ఈ వర్గపు పిల్లలు/యువత సగటున 10.3ఏండ్లలోనే సెల్‌ఫోన్ కలిగి ఉంటారు. చిరుప్రాయం నుంచే ఫోన్ లేదా టాబ్లకు అలవాటు పడతారు. రోజుకు కనీసం 3గంటలు ఇంటర్నెట్తో గడుపుతారు. ఇంట్లో ఇంటర్నెట్ లేదా మొబైల్ డాటా కలిగి ఉండాలని కోరుకుంటారు. డెబిట్ కార్డులతో కొనుగోలు, ఈ-మార్కెట్లను ఇష్టపడతారు. తల్లితండ్రుల ఆర్థిక స్తోమతను అర్థం చేసుకోకుండా అందని ఆడంబరాల కోసం పట్టుబడతారు. ఈ తరం వారికి బ్యాంకు ఖాతాలు చిన్న వయస్సులనే ఉండాలని ఆరాటపడతారు.
5. జనరేషన్ ఆల్ఫా: 2012 నుంచి నేటి వరకు జన్మించిన 0-9ఏండ్ల వయసున్న పిల్లల్ని ఆల్ఫా జనరేషన్గా పిలుస్తాం. సాంకేతిక విప్లవం వెలసిన ఇళ్లలో జన్మించిన పిల్లలు అన్ని రకాల నూతన ఎలక్ట్రాన్లకు ఉపకరణాలను వాడతారు. కరోనా పుణ్యాన వెలసిన ఆన్లైన్ తరగతులను ఇష్టపడుతూ, ఆఫ్‌లైన్ తరగతులకు ఆసక్తి చూపరు. వీడియో గేమ్స్‌కు బానిసల వలె వ్యవహరిస్తూ, ట్యాబ్ లేదా స్మార్ట్‌ఫోన్ ఇస్తేనే ముద్ద దిగే దుస్థితిలో ఉంటారు. హైటెక్ జీవితాన్ని ఆస్వాదిస్తూ, డిజిటల్ జీవితాలు గడుపుతారు. ఆన్లైన్ నగదు బదిలీలు, ఈ-నగదు యాప్ సదుపాయాలను వాడతారు. జేబులో నగదు లేకుండా కార్డులను కలిగి ఉంటారు.
నవ్య టెక్నాలజీ విషయంలో యువతరం నుంచి వయోజనులు/వయోవృద్ధులు పలు అంశాలను నేర్చుకుంటారు. బేబీ బూమర్స్ తరం టెక్నాలజీని త్వరగా ఆకలింపు చేసుకొని వినియోగించే ప్రయత్నాలు చేస్తుంటారు. జనరేషన్ల మధ్య వస్త్రాల వేషధారణ, ఆహారపు అలవాట్లు, జీవనశైలి లాంటి అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. మానవ విలువలు కూడా మారడం చూస్తున్నాం. ఇంటి వంటకు బదులు బర్గర్, ఫిజ్జాలకు అలవాటు పడతారు. తరాల అంతరాలు, జీవనశైలిల మార్పులను ఆహ్వానిస్తూనే, మానవీయ విలువలకు పట్టం కట్టడానికి అన్ని తరాలు సమ్మతించాలి. ఆధునికత పేరుతో అనాగరిక అలవాట్ల దరికి చేరరాదు. ఏ తరం పౌరులకైన 'మంచితనం' ఓ విజయ మంత్రమని, అన్ని కాలాల్లో అందరికీ సమానమని గమనిద్దాం. తరాల మధ్య అంతరాలను గౌరవిస్తూ, కుటుంబ సుఖజీవనానికి పునాదులు వేద్దాం.
సెల్: 9949700037
డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి