Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ సమాజానికైనా అవసరమైనవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు. ఇవే ఆ సమాజ స్థితిని, నాగరిక స్థాయిని అంచనా వేసే సాధనాలుగా నిలుస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ విలువలు, సాధనాలను పెంపొందించేది విద్యారంగమే. సమాజం తాను ఏ రకంగా రూపుదిద్దుకోదలిచిందో నిర్ణయించుకొని, అందుకు తగిన లక్ష్యాలను విద్యా రంగానికి నిర్దేశిస్తుంది. విద్యా లక్ష్యాలను సమాజం నిర్దేశిస్తే, సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అలా సమాజం - విద్య పరస్పర సహకారం, గౌరవంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా అనేక విప్లవాత్మక మార్పులకు లోనవుతూ వచ్చింది. లింగ, కుల, మత, వర్ణ వివక్షతలు చవి చూసింది. కొన్ని వర్గాలకే పరిమితమైన వేద కాలం నాటి నుంచి నేటి అందరికీ విద్య వరకు సమాజాన్ని మాత్రమే కాకుండా తనను తానూ సంస్కరించుకుంటూ వచ్చింది. అదే విద్య నేడు ఆర్థిక వివక్షతో, దాని మూలంగా ఏర్పడిన దొంతరల (అంతస్తుల)తో సమాజ అంతరాలకు కారణమవుతుంది. సామాజిక వివక్షలెన్నింటినో అధిగమించి సామాజిక వికాసానికి దోహదపడిన విద్య నేటి ఆర్థిక వివక్ష (పెట్టుబడి) విసురుతున్న సవాలును స్వీకరించే మలుపు వద్ద నిలిచి, వేచి ఉంది. చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే మలుపు ఇది. తనలో ప్రధాన భాగమైన ఉపాధ్యాయులు, వారి ఆచరణ, ఉద్యమ వ్యూహాల వైపు ఆశగా వేచి చూస్తూ ఉంది. ఇదే విద్యారంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. విద్య ఈ సవాలును అధిగమిస్తుందా లేదా అనేదే ప్రశ్న. దీనికి సమాధానం విద్యారంగానికి కీలకమైన ఉపాధ్యాయులు చేపట్టాల్సిన కార్యాచరణ, సమీకరించవల్సిన సమాజం మీద ఆధారపడి ఉంటుంది. తనకే తెలియకుండా అదే పెట్టుబడి మాయలోకి జారిపోతున్న ఉపాధ్యాయుడు తన బాధ్యతలను ఎంతమేరకు నిర్వర్తించను న్నాడనేదే కీలకమైన అంశం.
అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. ఇది మిగతా వృత్తులు, ఉద్యోగాల నుంచి ఉపాధ్యాయ వృత్తిని వేరు చేసింది. అందుకు తగినట్లుగానే ఉపాధ్యాయుడూ ప్రవరిస్తూ వచ్చాడు. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య ఘర్షణ నెలకొల్పబడ్డది. దీనికి కారణం ప్రపంచీకరణ విధానాలు. ఉపాధ్యాయుడు మార్కెట్ విసురుతున్న ఆకర్షణలకు, వస్తు వ్యామోహాలకు అతీతంగా ఉండలేని అనివార్యత నెలకొంది. ఇది ఒక సహజాతం. సమాజం మొత్తం ఆ వైపుగా పరుగులు తీస్తూ, అదే సమాజంలో భాగమైన ఉపాధ్యాయుడిని మాత్రం కట్టుబాట్లతో తాను కట్టబెట్టిన ఉన్నత (ఉత్త?) స్థానానికే పరిమితం అయి ఉండాలని వాదిస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని, ఆదాయం సమకూరే ఇతర పనులు ఎందుకు చేస్తున్నట్లనే ప్రశ్నలు అందులో భాగమే. సమాజం మొత్తం డబ్బు చుట్టూ, విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతూ తనను మాత్రం అందుకు అతీతంగా జీవించాలంటే ఎలా సాధ్యమనేది ఉపాధ్యాయుడి వాదన. ప్రస్తుతం సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య నడుస్తున్న (నడిపిస్తున్న) ఘర్షణ ఇది. వాటిని అధిగమించే నైపుణ్యం మీదే భవిష్యత్ కార్యాచరణ ఆధారపడుతుంది. సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను రెండు వర్గాలకు చెందకుండా, మూడో పక్షంగా బయట నుంచి చూసినప్పుడు మాత్రమే వాస్తవాలను విశ్లేషించడం సాధ్యం. ఇక్కడ విశ్లేషణ మాత్రమే లక్ష్యం కాకూడదు. అది విద్యారంగ విజయానికి తద్వారా సమాజ విజయానికి దోహదం చేయడమే లక్ష్యంగా ఉండాలి. మూడో పక్షంగా చూసినప్పుడు నైతిక, సామాజిక విలువలను విస్మరించి, అభిలషనీయమైన మార్పులను తోసిపుచ్చి మార్కెట్ ఆకర్షణ వలల్లో, భ్రమల్లో తూలుతున్న సమాజానికి విద్యా పరిరక్షణ అనేది సంబంధంలేని అంశంగా మారింది. ఎంత డబ్బు ప్రోగేస్తే అంత నాణ్యమైన విద్యను కొనుక్కోవచ్చు అని సమాజం నమ్ముతుంది. ఆ విద్య సంపదను పెంచే మరొక యాంత్రిక మనిషిని తయారు చేస్తే చాలని విశ్వసిస్తుంది. విలువలు, మానవీయత అనేవి దానికిప్పుడు ఎంతమాత్రం అవసరం లేదు. పెట్టుబడి కల్పిస్తున్న దోపిడీ అవకాశాలను, సృష్టిస్తున్న లాభాలను అందుకోవడమే ప్రస్తుతం దానికి అవసరం. తాము అదే దారిలో సాగుతామంటూ అందులో భాగమైపోతున్న ఉపాధ్యాయులు, విద్యావంతులు విద్యా పరిరక్షణను అప్రధాన అంశంగా భావిస్తున్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ సమాజానికి సంబంధం లేనిదిగా మారితే, ఉపాధ్యాయునికి అప్రధానమైనదిగా మారింది. విద్యా పరాయికరణ (ప్రయివేటీకరణ, కార్పొరేటికరణ)ను ఈ రెండు విషయాలే సులభతరం చేస్తున్నాయి. వీటన్నింటినీ బట్టి పెట్టుబడి ఎంతటి బలమైన బంధాలు, అనుబంధాల మధ్యనైనా ఘర్షణ సృష్టించగలదని స్పష్టమవుతోంది. అది నేర్పుతున్న భావజాలం విద్యను, సమాజాన్ని కూడా మింగే శక్తివంతమైనదని స్పష్టంగా కనిపిస్తోంది. తాను కూర్చున్న కొమ్మను తన చేతనే నరికించగలదని, సామాజిక స్వయం వినాశనానికి గురి చేయగలదని అర్థమవుతుంది. అయితే ఈ స్పష్టతను అర్థం చేసుకోగలిగే వివేచన, అవకాశం, అవసరం ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివేచనే వినాశనాన్ని నిరోధించగలదు. నేటి తక్షణ కర్తవ్యాలను ముందుకు తీసుకరాగలదు. పెట్టుబడితో యుద్ధానికి సిద్ధం చేయనూగలదు.
పెట్టుబడితో యుద్దానికి ముందు విద్యారంగంలోకి అది ప్రవేశించిన 90వ దశకం నుండి ద్రవ్య పెట్టుబడిగా మారిన నేటి వరకు దాని వ్యూహాలను, విజయాలను తరచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర తెలిసిన వాడే వర్తమానాన్ని సరిచేసి భవిష్యత్‌ను రూపొందించగలడు. పెట్టుబడి తన దోపిడీకి, లాభాలకు సుదీర్ఘ కాల ప్రణాళికలు అమలు చేస్తుందని ఎన్నో అనుభవాలు తెలియజేస్తున్నాయి. 3 దశాబ్దాల క్రితం అందరికీ విద్య అనే జనామోదిత నినాదంతో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డి.పి.ఈ.పి) పేరుతో విద్యా రంగంలోకి ప్రపంచ బ్యాంకు ప్రవేశించింది. దాని ద్వారా అమెరికా, యూకే, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం మొదలైంది. సేవ, సాయం పేరుతో ఎల్లలు దాటిన ద్రవ్యం నేడు వామన పాదంలా మారి సంప్రదాయ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నిటినీ అణగ దొక్కిన స్థితి కళ్ళముందు ఉంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక చ.కి.మీ.కు ఒక ప్రాథమిక, 3 చ.కి.మీ. కొక ప్రాథమికోన్నత, 5 చ.కి.మీ. ఒక ఉన్నత పాఠశాలలను ఏర్పరిచారు. తక్షణ రాజకీయ అవసరాలు, దీర్ఘకాల పెట్టుబడి ప్రయోజనాల కోసం ఇబ్బడిముబ్బడిగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినారు. ఆ ఉపాధ్యాయ పోస్టులే నేడు హేతుబద్దీకరణ పేరుతో మిగులుగా ముద్ర వేయబడుతున్నాయి. నాడు ఏర్పాటైన ఏక గదితో కూడిన ఏకోపాధ్యాయ పాఠశాలలే నేడు మూసివేతకు గురవుతున్నాయి. ఇవే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అప్రతిష్ట మూటగట్టుకోవడానికి మూల కారణం. ఇవే 15ఏండ్ల తర్వాత అంటే సుమారు 2010 నుండి ఊపందుకున్న విద్యా వ్యాపారానికి, బోధనా దుకాణాలకు పెట్టుబడి వ్యూహకర్తలు 90వ దశకంలో వేసిన పునాదిరాళ్లు. అందరికీ విద్య పేరుతో కొందరికే (కొనగలిగే వారికే) విద్యను పరిమితం చేసిన మహా ప్రణాళిక. పెట్టుబడి ఆడిన చదరంగం. నాడు విద్యార్థుల సంఖ్య అనే అంశం పరిగణలోనే లేదు కానీ, నేడు అదే ముఖ్యమైన అంశం. నాడు 10మంది విద్యార్థుల కోసం ప్రారంభించబడ్డ బడి నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులను అసమర్థులుగా చిత్రీకరించింది. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల కంటే పక్కనే 10 మంది ఉపాధ్యాయులున్న ప్రయివేట్ బడి వైపు తల్లిదండ్రుల దృష్టి మరల్చింది. దానికి తోడు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న ఆంగ్ల మాధ్యమం ఆకర్షణ మంత్రంగా మారింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రయివేట్ వ్యవస్థలో అమలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కొనసాగించింది. ఇదంతా పెట్టుబడి వ్యూహంలో భాగం. ప్రభుత్వ బడులను కొన ఊపిరితో కొట్టుమిట్టాడేలా చేసి, వాటి గొంతు నులమాల్సిన నాటి వ్యూహం నేడు అమలవుతుంది. దానికి సమాజం మద్దతును సంపాదించడం వెనుక పెట్టుబడి యొక్క 20 ఏండ్ల రహస్య ఎజెండా పని చేసింది.
ఈ బలాలు, బలహీనతల బేరీజులో మేధావి వర్గం కొట్టుమిట్టాడుతుంది. అదే అదునుగా కార్పొరేట్ ప్రభుత్వాలు తమ జూలు విదుల్చుతున్నాయి. సర్వేలు, నివేదికల పేరుతో ప్రభుత్వ విద్యారంగంపై విషం చిమ్ముతున్నాయి. ప్రజా (కార్పొరేట్) ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ విద్య, ఉపాధ్యాయుల పట్ల వ్యతిరేకతను పెంచే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ, పని సర్దుబాటు, పాఠశాలల విలీనం వంటి విధానాలతో బడులను చంపేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యకు కేటాయిస్తున్న కొద్దిపాటి బడ్జెట్‌ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర అమలు కానుంది.
విద్యారంగం చారిత్రక మలుపు వద్ద వేచి ఉన్న తరుణంలో ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానాలను సూత్రప్రాయంగా వ్యతిరేకించడం వల్ల నిలువరించడం సాధ్యం కాదని స్పష్టమైంది. విద్య తనను తాను కాపాడుకోవడానికి సంఘటిత ఉపాధ్యాయ శక్తి కోసం ఎదురుచూస్తుందనేది కళ్ళ ముందున్న వాస్తవం. సంఘటితంగా ఉద్యమించి, విద్యా వినాశకర వ్యూహాలను చిత్తు చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, చరిత్ర దోషులుగా నిలబెడుతుందనేది కూడా స్పష్టం. దోషులుగా కాకుండా పెట్టుబడి చెరలో చిక్కిన విద్యను విడుదల గావించిన మహౌద్యమ కారులుగా నిలిచిపోగల అరుదైన అవకాశం ఈ తరానికి ఉంది. అందుకోసం ఉపాధ్యాయులకు వృత్తి నిబద్ధతతో పాటు, ఉద్యమ నిబద్ధత ఎంతో అవసరం. పాఠశాలల పరిరక్షణకు ప్రభుత్వాలతో, పెట్టుబడితో పోరాడుతూనే తాము పనిచేస్తున్న పాఠశాల, అక్కడి సమాజం యొక్క సంపూర్ణ మద్దతును కూడగట్టడం అవసరం. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, పెట్టుబడి అనర్థాల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ, ఆ ప్రజలను పోరాటాలలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అంటే మండల, జిల్లా, రాజధాని కేంద్రాలతో పాటు ప్రతీ గ్రామాన్ని ఒక విద్యా ఉద్యమ క్షేత్రంగా మార్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమం గా మారుతుంది. అది మాత్రమే చరిత్ర సృష్టించగలదు. ప్రభుత్వ విద్యను పరిరక్షించగలదు.
- చుంచు శ్రీశైలం, సెల్:9704609265