Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వ అంశంగా 'సుస్థిర నగరాలు, నగర సమూహాలు (సస్టేనబుల్ సిటీస్ అండ్ కమ్యునిటీస్)'ను ముఖ్యమైనదిగా తీసుకొని పలు సూచనలు చేసింది. 2007 నుంచి పట్టణీకరణ పెరుగుతూ దాదాపు 50శాతం జనాభా, అనగా సుమారు 4బిలియన్లు నగరాలకు చేరడం జరుగుతోంది. 2030 నాటి ప్రపంచ పట్టణ జనాభా 60శాతానికి, అనగా 5బిలియన్లకు చేరవచ్చని అంచనా. నగరాలు, మెట్రో ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా 60శాతం జీడీపీకి కారణం అవుతున్నప్పటికీ నగరాలు కాలుష్య కేంద్రాలుగా, మురికి కూపాలుగా మారుతుండడం చూస్తున్నాం. నగర ప్రజల్లో 90శాతం గాలి కాలుష్యం బారిన పడుతున్నారని ఐరాస తేల్చింది. కరోనా కేసుల్లో 90శాతం నగరాల్లోనే నమోదు అవడం మనకు విధితమే. భూమిలో 3శాతం మాత్రమే ఆక్రమించిన నగరాలు 60-80శాతం శక్తి వనరులను వాడుకుంటూ 75శాతం కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతున్నాయి. నగర విస్తరణ పరిస్థితులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అభద్రత, అశాంతి, అనారోగ్యాలు, కాలుష్యం లాంటివి తీవ్రం అవుతాయని గమనించాలి. 2016 వివరాల ప్రకారం గాలి కాలుష్యంతో నగరవాసుల్లో 4.2 మిలియన్లు అకాల మరణం పొందారని అంచనా వేశారు.
మార్చి-2020 నుంచి మహానగరాలు, పట్టణాలు కరోనా కేంద్రాలుగా భయానక వాతావరణాన్ని సష్టించాయి. సురక్షిత నీరు, గృహవసతులు, ప్రజారోగ్య సదుపాయాలు, రోడ్లు, ప్రజారవాణ, మౌలిక వసతులు, పారిశుధ్యం, మురికి నీటి వ్యవస్థలు, ఆట స్థలాలు, పబ్లిక్ గార్డెన్లు లాంటి సౌకర్యాల తీవ్ర కొరతతో నగర జీవితం నరక ప్రాయం అవుతున్నదని మనకు తెలుసు. దీనికి తోడుగా ఆర్థిక, సామాజిక, లింగ, రాజకీయ అసమానతల నడుమ బడుగుల బతుకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నగర మురికి వాడలు లేదా స్లమ్స్ జనాభా (దాదాపు ఒక బిలియన్) 2014, 2018 మధ్యలో 23శాతం నుంచి 24 శాతానికి పెరగడం గమనించారు. మురికి వాడల్లో జీవించే జనాభా అత్యధికంగా ఆసియాలో 596 మిలియన్లు, ఆఫ్రికాలో 238 మిలియన్లు ఉన్నట్లు తేలింది. మురికివాడల్లో జీవిస్తున్న అభాగ్యుల ఉన్నతికి సంబంధించిన పట్టణ ప్రణాళికలు, ఆర్థిక కేటాయింపులు, పాలసీలు, జీవన ప్రమాణాన్ని పెంపొందించే చర్యలు నేటికీ అరకొరగానే నత్తనడకన కొనసాగుతున్నాయి.
పట్టణీకరణ అస్తవ్యస్తంగా విస్తరించడం, రోడ్లు, రవాణా వసతులు కొరవడడంతో పేదల కాలనీలు మురికి కూపాలవలె తయారవడం చూస్తున్నాం. 2019 వివరాల ప్రకారం 95దేశాలకు చెందిన 610నగరాల అధ్యయనంలో ప్రపంచ జనాభాలో 50శాతం మాత్రమే కిలోమీటర్ల లోపు దూరంలో రైలు/బస్సు లాంటి ప్రజారవాణా సౌకర్యాలను కలిగి ఉన్నారని తేలింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 32-34శాతం జనాభాకు మాత్రమే సమీపాన ప్రజారవాణ కల్పించబడింది. 2020లో చేసిన అధ్యయనంలో 114 దేశాలకు చెందిన 911 నగరాల వివరాల ప్రకారం పట్టణాల్లో 16శాతం భూమి మాత్రమే రోడ్లు, పార్కులు, ఆటస్థలాలకు (పబ్లిక్ స్పేసెస్) కేటాయించబడింది. ఐరాస ప్రమాణాల ప్రకారం 30శాతం నగర భూమి రోడ్లకు, మరో 10-15శాతం పార్కులు, క్రీడా మైదానాలకు కేటాయించాలి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 12-14శాతం మాత్రమే పబ్లిక్ స్పేసెస్ అందుబాటులో ఉన్నాయి. మార్చి-2021 నాటికి 156 దేశాల్లో సకారాత్మక నగరాభివృద్ధి పాలసీలు అమలు అవుతున్నాయని తేలింది.
పట్టణాభివృద్ధి ప్రణాళికాబద్దంగా జరగాలి. భవన నిర్మాణాలు, మురుగు నీటి వ్యవస్థలు, రోడ్లు, ప్రజారవాణ వ్యవస్థలు, పార్కులు, క్రీడా మైదానాలు, సురక్షిత తాగు నీరు, ప్రజారోగ్య కేంద్రాలు, హరిత వనాలు లాంటి సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతలను ఇవ్వాలి. అధిక జనాభా కలిగిన భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రాబోయే దశాబ్దంలో అధికశాతం పట్టణీకరణ జరుగవచ్చని తేల్చడంతో దానికి సమానంగా మౌలిక వసతుల కల్పనకు కృషి జరగాలి. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70శాతం నగర ప్రాంతాలకు వలసలు జరగవచ్చని ఐరాస హెచ్చరిస్తున్నది. ప్రభుత్వాలు రాబోయే పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధిని దూరదృష్టితో చేపట్టేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. మహానగరాలు నందన వనాలుగా, పట్టణాలు నివాసయోగ్య ఆవాసాలుగా రూపొందాలి.
- డా|| బి.ఎం.ఆర్.