Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపావళి వచ్చిందంటే గోండు ప్రాంతంలో దండారి పండుగ హడావుడి మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండులకు ఈ పండుగ చాలా ముఖ్యం. దండారి పండుగలలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి గోండులు గుంపులుగా వెళ్లటం ఆచారం. ఐదుగురు అన్నదమ్ముల గోత్రం వారి పూర్వీకుడైన రౌర్, వారి దేవతయైన మాన్క్ ఇది మొదలుపెట్టారని గోండులు నమ్ముతారు. అయినా గోండులలో అన్ని గోత్రికులకు ఇది పండుగగా స్వీకరించబడిందని ప్రముఖ మానవ శాస్త్రజ్ఞుడు హైమాండర్ప్ రాసారు.
ఈ పండుగ కొన్ని గ్రామాల్లో దీపావళి ముందు, కొన్ని గూడాల్లో దీపావళి తర్వాత జరుగుతుంది. అతిథులుగా ఒక గ్రామంలో దండారికి చుట్టు పక్కల గ్రామాల వారిని ఆహ్వానిస్తారు. వారు వచ్చిన దగ్గర నుండి వసతి భోజనం మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలోని గోండులు అందరూ కలుసుకొని సరదాగా కొంత సమయం గడిపి ఒకరి మంచిని మరొకరికి పంచి ఇచ్చే గోండు సంస్కృతికి ప్రత్యేక చిహ్నం దండారి పండుగ. పండుగ వచ్చిందంటే ఇళ్ళకు వెల్లవేయడం, రంగు కాగితాలు అంటించటంతో పాటు ఇంటి పక్కల చిన్న చిన్న గుడిసెలు వేస్తారు. అవి ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి ''విడిది'' అని అంటారు.
గోండులకు భద్రాజుల లాంటి వారు ప్రధానులు. వారు కాలికోమ్, పెప్రి, కింగ్రి మొదలైన వాయిద్యాల సహకారంతో పాటలు పడతారు. గోండుల దేవతలు, వారి పుట్టుపూర్వోత్తరాలు కథలుగా చెప్పడం వారి ఆచారం. ప్రతిఫలంగా డబ్బు గానీ, ధాన్యం గానీ, మాన్యాలు గానీ పొందుతారు. రెండు రోజుల పాటు ఆపకుండా పాడగల సామర్థ్యం, జ్ఞాపక శక్తి వీరి ప్రత్యేకత. పక్క గ్రామాల నుంచి దండారి వస్తుందంటే ఒక పక్క ప్రధానుల వాయిద్యాలు, మరోపక్క గోండుల వాయిద్యాలతో ఊరంతా దద్దరిల్లిపోతుంది. దండారి వస్తున్న కొద్దీ ఉత్సాహం ఎక్కువ అవుతుంది. పిల్లలు ఎగిరి గంతేస్తారు. దండారి ముందర గుస్సాడీలు ఉంటారు. నెత్తి మీద నెమలి ఈకలు పెద్ద టోపీలతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండ పూసల దండలు, కాళ్లకు గజ్జెలు వేసుకొని చేతిలో దండంతో గంతులు వేసుకుంటూ సాంప్రదాయ నృత్యం చేస్తారు. వీరు చాలా గౌరవ ప్రదమైన వ్యక్తులు. వారి గ్రామ దేవతకు ప్రతినిధులు అని గోండుల నమ్మకం. అందుకే దండారి బయలుదేరేందుకు వారం రోజుల ముందు ''భోగి'' చేస్తారు. ఆ రోజు వేసిన వేషం దండారి ముగిసే వరకు ఉంచుకుంటారు. ఈలోగా స్నానం చేయరు, ఎక్కడ పడితే అక్కడ అన్నం తినరు. మత్తు పానీయాలు లాంటివి మర్చిపోవాలి. తర్వాత గుస్సాడీలు పోలీకేకలు పెట్టి నాట్యం ఆపిన అనంతరం వచ్చిన వారి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. ఒకరినొకళ్ళు రాం! రాం! అని పలకరించుకుంటారు. ''చొక్కాట మంతి''(బాగున్నారా?) అని అడుగుతారు. పిల్లలు, పెద్దలు అందరూ బాగున్నారా అని పరామర్శలు చేసుకుంటారు. అతిధులను కాళ్ళు కడిగిన తర్వాత మూడు సార్లు కౌగలించుకొని చేయి పట్టుకొని వారిని విడిదికి తీసుకుని వెళతారు. కొందరిని భుజం మీద ఎక్కించుకుని తీసుకొని వెళతారు. విడిదిలో ''భారు'' ఇచ్చి తాగిన తర్వాత ఒక్కొక్కరికి బీడీలు అందజేస్తారు. కొంత సేపటి తరువాత దండారి నృత్యం ప్రారంభం అవుతుంది. దండారి నృత్యంలో చాలా భాగాలు ఉంటాయి. గుస్సాడీ, గుమేల, పార, ధీమ్సా, భజన్, ఖేల్ మొదలైనవి ముఖ్యం. అన్ని నృత్యాలలోనూ గుస్సాడీలు పాల్గొంటారు. రాత్రి వరకు భజనలు కొనసాగుతాయి. ఆ రాత్రి రేల పాటలు పాడతారు. ఉదయాన్నే ఆకిపేన్ పూజ అనంతరం సూర్యచంద్రుల గుర్తుతో తయారు చేసిన కొత్త జెండాను వివిధ వాయిద్యాల మోతతో ఆవిష్కరిస్తారు. కొన్ని గంటలు విశ్రమించిన తర్వాత గ్రామస్తులు మంచి దండారి వీడ్కోలు తీసుకుంటారు. పెద్దల కాళ్ళకు నమస్కరించి ఒక్కొక్కరు కౌగలించుకొని వీడ్కోలు చెప్పుకునే ఆచారం ఎంతో గొప్పది. స్నేహభావం, సంఘీభావం పెంపొందించే ఈ దండారి పండుగ ఎంతో గొప్పది.
- పెనుక ప్రభాకర్
సెల్: 9494283038