Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనం సంపాదిస్తే సుఖాన్ని కొనుక్కోగలం. కాని సంతోషాన్ని పొందలేం. సంతోషం మనసుకు సంబంధించింది. సమున్నతమైన జీవన విధానంతో మాత్రమే అది సాధ్యం. కళాత్మక రసజ్ఞత కలిగిన సృజనాత్మక మానవుడి కలల ప్రపంచం సాకారమయ్యేది అప్పుడే. అక్కడే. అందుకోసం మనం బ్రతుకుతున్న ఈ సమాజాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి కనీస ప్రయత్నం చేద్దాం. కండ్లముందు జరుగుతున్న ప్రమాదకరమైన సాంస్కృతిక విధ్వంసానికి వ్యతిరేకంగా గొంతువిప్పుదాం. స్తబద్దత రాజ్యమేలుతున్న చోట అర్థవంతమైన శబ్దం చేయడమే పౌరసమాజ చైతన్యానికి చిహ్నం అంటూ ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమాఖ్య ఇటీవల (31.10.2021) కాకినాడలో ఒక సమాలోచన సదస్సు నిర్వహించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకధాటిగా సాగిన ఈ సదస్సులో నలుగురు ముఖ్యవక్తల ప్రసంగంలోని కీలకాంశాలు...
కె. పద్మ (మహిళా చేతన): ''భారతీయ సంస్కృతి -మహిళల ప్రస్థానం'' గురించి ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ కాలంలో (19-20 శతాబ్దాలలో) మన దేశ మహిళా స్థితిగతులను తెలిపారు. సతీసహగమనం, బాల్య వివాహం, నిరక్షరాస్యత, గృహబందీ అంధకారంలో నేటి మహిళ, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందని అణచివేతకు గురైందో వివరించారు. కరడుగట్టిన బానిసత్వ చాకిరీ - వేశ్యాలంపటత్వం సంస్కృతీ ఆచారం మాటున స్త్రీలపై దాడిచేసేవి. బాలికా శిశువ్యాపారం, కన్యాశుల్కం తాండవించేవి. ఇందుకు ప్రతిగా సంఘసంస్కరణోద్యమం పురుడు పోసుకుంది. రాజారామోహన్రారు వంటి వారి కృషి వలన సతీసహగమన వ్యతిరేక చట్టాలు వచ్చాయి. జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే వంటివారి వలన స్త్రీ అక్షరాస్యత ముందుకొచ్చింది. బ్రిటిష్ మిషనరీల ప్రభావంతో విద్యా - వైద్యరంగాల్లో స్త్రీలకు సముచిత స్థానం లభించింది. స్త్రీకూడా మనిషే అనే అభ్యుదయవాదం తెరుచుకున్నది. భర్త పోయిన స్త్రీ బతుకు నరకం అనే భావనను ఆధునిక విద్య తుత్తునియలు గావించింది.
స్వాతంత్య్రోదమ కాలంలో అభ్యుదయ గాములు తమతో పాటు స్త్రీలను కూడా ఉవ్వెత్తున రంగంలోకి దించారు. అనీబిసెంట్, సరోజిని నాయుడు వంటివారు 1919లోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షస్థానాల్లోకి వచ్చారు.
పెట్టుబడులు స్థాపించిన ఫ్యాక్టరీల్లో, తేయాకు తోటల్లో, పురుషులతో పాటు లేకుంటే ఎక్కువగానో స్త్రీలు ఉపాధిరంగంలోకి వచ్చారు. ఉత్పత్తిలో కీలక భాగస్వామ్యం అయ్యారు. దాంతో పాటు ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో అనివార్యంగా మహిళలు భాగస్వామ్యం వహించారు. భారత మహిళలు ఇంత ఉధృతంగా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడానికి నేపథ్యంగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం పనిచేసింది. స్త్రీలకు సమానహక్కులు అనే నినాదం (పురుషులతో సమానంగా) ఎల్లెడలా తోసుకువచ్చింది. ఇదో సామాజిక పరిణామం. ఈ పరిణామంలో స్త్రీలను పూజించడం కాదు తమతో పాటు సమానంగా స్త్రీలను గౌరవించాలనే ఓ మానవీయ సంస్కృతి ఉద్భవించింది. దీనిని కాపాడుకోకపోతే మనం తిరిగి అంధకారంలోకి ప్రవేశిస్తామని తెలిపారు.
భారతీయ సమాజం - సాంస్కృతికోద్యమ చరిత్ర అంశంపై జి. భార్గవ మాట్లాడుతూ... సంస్కృతీ వికాసం లోతులను, ఉజ్వల విశాలతను తడవుడానికి ప్రయత్నించారు. సంస్కృతి అంటే జీవన విధానం అని తెలిసినప్పటికీ అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో ఉద్యమ అలలు ఉధృతితో ఎలా ఎగసిపడతాయో వివరించారు. ప్రజలు అంటే మనమే. మనం మనకు తెలియకుండానే దుష్టసంస్కృతిలో భాగస్వాములం అవుతున్నాం. జ్ఞానం పేరుతో రకరకాల భావజాలాలను పెంపొందించడం ఆయా చారిత్రక సందర్భాల్లో ఆ వ్యవస్థలు పుట్టిస్తాయి. ఉత్తర భారతంలో తులసీదాస్ కవిగాయకుడిని నారద స్వరూపంగా ప్రజలు భావిస్తారు. స్త్రీలు, శూద్రులు, పశువులు, తోళ్ళు, డప్పులు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి కాగపెడితే తప్ప అవి మాట వినవు అని ఆయన దాహాల్లో పాడారు. వాటినే అందిపుచ్చుకుని ఇప్పటికీ పాడుతున్నారు. ఇవి ఆమోదయోగ్యంకావు. అయినా చలామణి అవుతున్నాయి. కావున మాటలు, పాటలు, భావాలు కాకుండా వాటి వెనుక ఉండే అంత: సారాన్ని గ్రహించాలి. ఆ జ్ఞానాన్ని ఇప్పటి సమాజానికి ఇవ్వాలి.
కృతుల్లోని సత్యాన్ని వెతికే జ్ఞానాన్వేషణ అవశ్యం అవుతున్నది. ఇది ఇప్పటి పరిణామం. సింధునాగరికతలో ప్రజల భౌతిక జీవన విషయాలు తెలిసినంతగా సాంస్కృతిక జీవన విషయాలు తెలియలేదు. నగర రాజ్యాలు విచ్ఛిన్నమైపోయాక జనం పాయలు పాయలుగా చీలిపోయారు.
ఆర్యులు పశుపాలకులు, మంత్రోక్తమైన కర్మకాండ సంస్కృతి వారిది. హౌమం, సోమం, భోగం వాటి లక్ష్యాలు. అంటే తిను, తాగు, తిరుగు అనే అర్థం. ఈ ఆరాధనలో కూడా క్విట్ ప్రొకో ఉంటుంది. నేనింత సమర్పించుకుంటాను. నీవు నాకు ఇది ఇవ్వు. లేదా నాకిది ఇస్తే నీకిది ఇస్తాను అని భగవంతునితో బేరమాడే పద్ధతి ఉంటుంది. ఇందులో ఇంత దిగజారుడు పద్ధతులు ఉండటం వలనే స్వచ్ఛమైన ఆధ్యాత్మిక చింతన కోసం శ్రవణక సంస్కృతి ఆవిర్భవించింది. శ్రవణుకులు అంటే సన్యాసులు. సేవ-పరిత్యాగం వీరి లక్ష్యం. వైదికులకు పూర్తి వ్యతిరేకం. ఇది ఉజ్వల వేగంతో వ్యాప్తి చెందింది. ఇందులో నుండే జైనం - బౌద్ధం ఉద్భవించాయి. ఈ సైద్దాంతిక, నైతిక పునాదుల నుండే సాంఖ్య, వైశేషిక, న్యాయదర్శనాలు పుట్టుకు వచ్చాయి. తాత్విక చింతనతో తర్కయుగం మొదలైంది. సత్యాన్వేషణ కోసం భిన్న భావాల మధ్య చర్చించుకునే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంస్కృతి నెలకొన్నది.
పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసలు మొదలయ్యాయి. కర్మకాండలను పునరుజ్జీవం చేయాలనే లక్ష్యంగా పూర్వ మీమాంస భావజాలం కృషి చేసింది. యోగ పతంజలికి ఇదొక నిదర్శనం. ఓ మిషన్లాగ క్రమబద్దమైన కర్మకాండలు సాగించాలనే ఈ పూర్వమీమాంస ఉద్యమం ఆచరణలో వైఫల్యమైంది. అవశేషంగా భక్తి ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇందులో ప్రశ్నకు తావులేదు. ప్రశ్నించినవాడు బహిష్కృతుడు లేదా ద్రోహి అవుతాడు. పితృభక్తి, పతిభక్తి, రాజ్యభక్తి, దైవభక్తి, అహేతుకంగా సాగాల్సిందే. సొంత ఆలోచన, సొంత ప్రయత్నాన్ని ఇది సమాధి చేస్తుంది. ఎంతగా అంటే తాను ఆలోచన రహితుడుగా సమాధి అవుతున్నట్టు తెలుసుకోలేనంతగా మూఢత్వంలోకి లాక్కుపోతుంది. ఈ మూర్ఖభక్తి ఉద్యమంలో హైందవంలోనే శైవం - వైష్ణవం మద్యపెద్ద ఎత్తున మారణ ఘర్షణలు చెలరేగిన విషయం కాదనలేం.
బ్రిటిష్ వలసవాదం ప్రవేశంతోనే ఆధునికత మనలో ప్రవేశించింది. అక్రమాల గురించి, అన్యాయాల గురించి సహేతుకంగా ఆలోచించడం, స్వతంత్రంగా నిర్ణయాధికారం తీసుకోవడం తిరిగి ప్రారంభమైంది. 'మనుషలందరూ సమానమే' అన్న ఆధునిక భావమే అందరికి శిరోధార్యమైంది.
'సాంస్కృతిక స్రవంతి - సమైక్యతా భావన' అనే అంశంపై కొప్పర్తి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ.... గతంలో మనుషుల మధ్య రాకూడని ఓ విభజనరేఖ చరిత్రలో ఆవిర్భవించింది. (ద సెల్ఫ్ - ద అదర్) నేను, మేము లేదా ఇతరులు. ఇది మనిషిని చీల్చుకుంటూ సాగుతున్నది. సింధునాగరికతను ద్రవిడులు నిర్మించారు. అప్పటికి భారతదేశమే లేదు. బయట నుండి ఆర్యులు, అరబ్బులు, గ్రీకులు, తురుష్కులు, హుణులు, కుషాణులు ఇలా ఎన్నెన్నో తెగలవారు ఈ ప్రాదేశిక భూమిలోకి అడుగిడినారు. ఇవన్నీ జాతుల పేర్లే తప్ప మతాల పేర్లు కావు. సంలీనమైన జాతులు. ముస్లింలుగా స్థిరపడినవారు ఎందరో ఉన్నారు. మొగలులు పాలకులుగా ఉన్నప్పుడు హిందూ రాజులు, సంస్థానాధీశులు ఆయా ప్రాంతాల్లో పాలన చేశారు. ముస్లిం పాలకుల్లోని యంత్రాంగంలోనూ, సైన్యంలోనూ హిందువులున్న విషయం తెలిసిందే. కాని బ్రిటిష్‌వారి రాకతో డ్రయిన్ థియరీ (కాలువ సిద్దాంతం) ముందుకు వచ్చింది. బ్రిటిష్ ఆర్థిక (సామ్రాజ్యవాద) వ్యవస్థకనుగుణంగా మన వనరులన్నీ ఒకేవైపునకు ప్రవహించడం, అంటే.. ఇంగ్లండ్ వైపునకు ప్రవహించడం జరిగింది. అంతకు ముందు అలాకాదు, పాంటైన్ థియరీ (ఎక్కడివారు అక్కడే విస్తరించేలా) అమలైంది. మొగలుల ఆర్థిక వనరులు ఆయా ప్రాంతాల ప్రజల అభివృద్ధికే తోడ్పడ్డాయి. మహమ్మదీయులు అలా ఈ ప్రాంతంలో అంతర్లీనమయ్యారు. ఏది ఏమైనా మనుషుల మధ్య చీలికలు, బేధభావాలు సాంస్కృతిక సమైక్యతకు, వికాసానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.
మన చుట్టుపక్కల ఉన్న బౌద్ధారామాలు శైవుల విధ్వంసం వల్లనే పంచారామాలుగా విలసిల్లాయని చరిత్ర చెపుతుంది. మంచి - చెడ్డలు వ్యక్తుల్లో ఉంటాయి తప్ప మతాల్లో ఉండవు. ప్రతి మతమూ 'సర్వేజనా సుఖినో భవంతు'నే కోరుకుంటుంది. గతంలోకి పోయి అశాస్త్రీయ భావజాలంతో విద్వేషాలు రెచ్చగొట్టడం సాంస్కృతిక విధ్వంసమే తప్ప వికాసం కాదు అని కొప్పర్తి తేల్చి చెప్పారు.
''సాంస్కృతిక పునరుజ్జీవనం - తక్షణ కర్తవ్యం'' అంశంపై ఎన్ వేణుగోపాల్ కీలక ప్రసంగం చేశారు.. 'సాంస్కృతిక పునరుజ్జీవనం' అనే మాట సరైనదేనా అని ప్రశ్నిస్తూ... ఎందుకంటే సంఫ్‌ుపరివార్ శక్తులు వర్ణాశ్రమ ధర్మమే సాంస్కృతిక పునరుజ్జీవనంగా భావిస్తున్నాయి. సగంపైగా ఉన్న మానవ జాతిని మనుషులుగా చూడని బానిస సమాజం అది. ఆ విధంగా గతంలో ఉజ్వలమైన ఘటనలు లేవు. ఇప్పుడు మనం సాధించవలసింది సాంస్కృతిక పునర్వికాసం. రాజుల సంస్కృతి వేరు, ప్రజల సంస్కృతి వేరు. రాజుల సంస్కృతి అంటేనే పరిష్కరించబడేది. మానవుల సహజ లక్షణాలు కనుమరుగు చేసే రీతిలో కులం, మతం, ప్రాంతం, భాషా వైషమ్యాలు ముందుకొచ్చాయి. సరుకు, మార్కెట్, వినియోగదారి సంస్కృతి రుద్దబడుతున్నది. నిత్యజీవితంలో మానవ ప్రవర్తనల సమాహారంగా సంస్కృతిని యునెస్కో అభివర్ణించింది. ఉత్పత్తి సంబంధాల్లోనే మానవ సంస్కృతి ఆవిర్భవించినట్టు మనకు అర్థమవుతున్నది. మానవ ప్రవర్తనలో సామాజిక ప్రవర్తన అంతర్భాగం. అరిస్టాటిల్ మనిషిని సంఘజీవి అన్నాడు. మరి మత సంబంధాలు సమిష్టి సంఘ వర్తనకు, సమాజ చర్యలకు అడ్డుపడుతున్నాయి. వాటిని తొలగించినప్పుడే మానవ వికాసం, సాంస్కృతిక వికాసం. సంస్కృతి ఎప్పుడూ, ఎక్కడా ఏకశిలా సదృశ్యంకాదు. స్థిరబిందువు కాదు. నిత్యచలనం. అసలు భారతదేశమే ఓ ఉపఖండం. ఖండంలో ఓ మూస సంస్కృతి ఉండదు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ నాలుగు వేల కులాలు ఉన్నాయి.
స్వేచ్ఛా, సమానత్వం, సౌబ్రాతృత్వం నినాదాలతో పెట్టుబడిదారీ సంస్కృతి వచ్చినప్పటికీ ఇక్కడ ఫ్యూడల్ సంస్కృతితో మిలాఖత్ కాక తప్పలేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా మనిషిని నిలువెల్లా దోపిడీ చేసేది పెట్టుబడిదారీ సంస్కృతి. నీ రక్తంతో, నీ చమటతో, నీ శ్రమతో తయారయ్యే వస్తువును నీకే ఎక్కువ ధరకు అమ్ముతుంది. నిన్ను మృతప్రాయం చేస్తుంది. జాలి, దయ, కరుణ, మానవత్వం దానికి ఉండవు. లాభం కోసం అన్నింటినీ జీర్ణం చేసుకుంటుంది. అదే ఇప్పుడు బహుళ జాతి సంస్థలుగా, కార్పొరేట్లుగా, సూపర్మార్కెట్లుగా అవతరిస్తూ కొత్తగా మీద పడుతున్నది. అయితే ఇప్పుడు మన దేశంలో ఏకకాలంలో చిన్న చిన్న చారిత్రిక దశల, సామాజిక తరగతుల, వర్గాల, వర్ణాల జీవనశైలిని చూడవచ్చు. వాస్తు, ముహూర్తం అనుగుణంగా బిడ్డలను కనడం (సిజేరియన్ ఆపరేషన్‌తో), క్షుద్ర పూజలతో నరబలులు గావించడం అన్నీ గమనిస్తున్నాం.
ఈ మూర్ఖత్వాలకు, అశాస్త్రీయతకు భిన్నంగా మనిషిని మనిషిగా, సంఘ జీవిగా నిలబెట్టే సమానత్వం సంస్కృతి మనకు ఇప్పుడు మార్గదర్శకం. సాటి మనిషి పట్ల సహనుభూతి కలిగే ప్రేమ, కరుణ, భావజాలాలను పునరుజ్జీవంపచేయడమే ఈ నాటి కర్తవ్యం. యతాతథ స్థితిలోని, అక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యాలను ప్రశ్నించకుండా ముందుకు పోలేం. ఈ విధమైన సమ్యక్ దృక్పథంతోనే ప్రజలను ముఖ్యంగా శ్రమజీవులను గౌరవించే ప్రజాస్వామ్య సంస్కృతిని నిర్మించుకోగలం. తన్ను తాను తెలుసుకోవడం, మంచి పనులు చేయడం, చెప్పేదానికి చేసేదానికి తేడా లేకుండా చూసుకోవడం 'సరైన సంస్కృతికి రాచబాట అవుతుంది' అని తెలిపారు.
డాక్టర్ స్టాలిన్ మాట్లాడుతూ... ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకబిగిన సాగిన ఈ సమాలోచన సదస్సు నిజమైన జ్ఞానపాఠశాలను స్ఫూరింప చేస్తుందని, వివిధ ప్రజా రంగాలలో పనిచేసే కార్యకర్తలకు ఇలాంటి పాఠశాలలు అవశ్యమని, కార్యకర్తలు మరింత శక్తివంతంగా పనిచేయడానికి తోడ్పడతాయని చెప్పారు.
సాంస్కృతిక పునరుజ్జీవనం లేదా పునర్వికాసం కేవలం వ్యక్తులు, సంస్థలు, మతాలు కేంద్రంగా విలసిల్లవనీ, మనిషి, సమానత్వం, శ్రమజీవుల ఉద్యమాలు కేంద్రంగానే విస్తరిస్తాయనీ, ముందుకు పోతాయనీ ఈ సదస్సు తేటతెల్లం చేసింది. ఇప్పటికే ఈ ప్రజా సంస్కృతిక రంగంలో పనిచేస్తున్న రావు కృష్ణారావు, సి.ఎ. ప్రసాద్, ఇబ్రహీం, మనోరమ, విజయాబక్ష్, డాక్టర్ రవికుమార్, రాజేష్, రవికాంత్, పద్మావతి, పద్మజావాణి, త్రిమూర్తులు, సత్యనారాయణరెడ్డి, వర్మ, జానకిరాం, గంగాధర్‌రావు, పి. రామకృష్ణ, గోపు చంద్రరావు, బాబాయమ్మ, సిద్దు ప్రభృతులు పాల్గొన్నారు. నిర్వాహకులుగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమాఖ్య బాధ్యులు కట్టా కృష్ణారావు, గౌరవ్, శాంతారావులు వ్యవహరించారు. ప్రజానాట్యమండలి పెద్దాపురం బృందం గేయాలాపన సదస్యులను ఉత్తేజపరిచింది.
- కె. శాంతారావు
సెల్: 9959745723