Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యం ఓ మధుర జ్ఞాపకం. ఇది మానవ జీవితంలో అత్యంత కీలక దశ. జాతికి నిజమైన సంపద బాలలే. అందుకే ఈ భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ఉంది. అందరిపై వారి ఎదుగుదలకు కావలసిన వనరులను సమకూర్చాలి. వారి హక్కుల సంరక్షణకు కృషి చేయాలి. అప్పుడే ఉత్తమ పౌర సమాజం నిర్మితమవుతుంది. ఇందు కోసం ప్రపంచ దేశాలు నిబద్ధతతో కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటన చేసింది. తదుపరి 1989లో వారి హక్కులపై చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందంలో పిల్లలకు శారీరక మానసిక ఒత్తిడి, హింస, దోపిడీ నుంచి రక్షణ కల్పిస్తూ, వారికి పౌర, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక రాజకీయ హక్కులు వంటి మానవ హక్కులను చేర్చారు. బాలల హక్కుల మనుగడ, గుర్తింపు, ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, అభివృద్ధి, కుటుంబం, పర్యావరణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ఈ చారిత్రక తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, వాటి పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రతి ఏటా నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవం జరుపుతున్నారు. ఈ సంవత్సరం ''ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు'' అనే నినాదంతో నిర్వహించడం జరుగుతున్నది. కానీ గత రెండేండ్లుగా కరోనా సంక్షోభంతో పిల్లల హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడటంతో వారి అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా కోట్లాది బాలలు ప్రాథమిక అవసరాలకు నోచుకోక బాల్యం భయానకంగా మారింది. ఇది వారి సమగ్రాభివృద్ధికి సవాలు విసురుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని నేటి బాలల దినోత్సవం నొక్కి చెబుతోంది.
బాలల హక్కులకు సంక్షోభం...
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, నిర్లక్ష్యం, అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిత్యకృత్యమైపోయాయి. కనీస అవసరాలను పొందలేని పిల్లల సంఖ్య పెరిగిపోతున్నది. కరోనా సంక్షోభంతో కుటుంబాల జీవనోపాధి దెబ్బతినడంతో ఆర్థిక, సామాజిక పరిస్థితులు మరింత దిగజారాయి. దీని ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడింది. గతేడాది పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పోషణ, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలలో 45శాతానికిపైగా పిల్లలు వీటిలో ఒక్క దాన్ని కూడా పొందలేకపోతున్నారని యూనిసెఫ్, సేవ్ ద చిల్డ్రన్ సంయుక్తంగా 70కి పైగా దేశాలపై చేసిన అధ్యయనంలో తేలింది. నేటి కరోనా సంక్షోభంలో ఇది అధికమైనదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 31శాతం పిల్లలు డిజిటల్ విద్య అవకాశాలను, 37కోట్ల మంది పిల్లలు పోషకాహార మధ్యాహ్న భోజనం పొందలేకపోతున్నరని, కనీసం 68దేశాలలో ఏడాదిలోపు ఉన్న 8కోట్ల పిల్లలు టీకాలకు దూరమయ్యారని ఆ అధ్యయనం చెపుతున్నది. మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో బాలల్లో పోషకాహారం లోపంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత్లో ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు వెనకబడిన కులం లేదా తెగకు చెందినవారేనని ఇటీవల వెలువడిన ఐక్యరాజ్యసమితి బహువిధ పేదరిక సూచి పేర్కొన్నది. ముఖ్యంగా 12.9కోట్ల షెడ్యూల్ తెగలలో 6.5కోట్ల మంది పేదరికంతో బాధపడుతుండగా... షెడ్యూల్ కులాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. 58.8కోట్ల వెనుకబడిన తరగతుల్లో 16కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. అత్యధిక బాల జనాభా ఉన్న భారతదేశంలో 33లక్షల మందికి పైగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఇటీవల పేర్కొనడం గమనర్హం. మరోవైపు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పిల్లలు విద్యకు దూరమవడంతో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లాంటి దుర్లక్షణాలు పెరుగుతున్నాయి. పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి దుస్సంస్కృతి పెచ్చిరిల్లుతున్నది. ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే శిక్షలు, వేధింపులు వారి మనసులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
బాలల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు...
అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందం అమలు చేయడానికి ప్రభుత్వాలు నిబద్ధతతో కృషి చేయాలి. ముఖ్యంగా అందరికీ ఉచిత విద్య, వైద్య అవకాశాలు మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న చట్టాల, విధానాలను పునః సమీక్షించాలి. పిల్లలను పేదరికం నుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించి సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది కొంత కరోనా తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల ద్వారా విద్యను అందించి అంతరాలను తొలగించాలి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించాలి. దీంతో వారికి జీవితం పట్ల భరోసా ఏర్పడుతుంది . ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణలో కొంత మేరకు పురోగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా భారతదేశం పిల్లల హక్కులను గుర్తించడంలో వెనుకబడి ఉందని క్షేత్రస్థాయి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి వీరి హక్కుల సంరక్షణకు మరిన్ని చట్టాలు చేసి పటిష్టంగా అమలు పరచాలి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించడంతో పాటు వారి అవసరాలను తీరుస్తూ, సాధికారతకు కృషి చేయాలి. బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి. పిల్లల హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల హక్కులు సంరక్షించబడి వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.
- ఎస్. శ్యామల,
సెల్:8008539905