Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలల హక్కుల గురించి ప్రతి సంవత్సరం కనీసం నవంబర్ 14న మన దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా, నవంబర్ 20వ తేదిని ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడిగా నైనా బాలల గురించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు. కొన్ని విధానాలు ప్రకటించేవారు. ఈ సంవత్సరం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జిల్లా స్థాయి మహిళా శిశు సంక్షేమ సంస్థలు ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాయే తప్ప అటు కేంద్రంలో ప్రధానమంత్రి కానీ ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఎటువంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనకపోవడంలోనే బాలల పట్ల మన ప్రభుత్వాల ఉదాసీనత అర్థం అవుతున్నది. జనాభాలో దాదాపు నలభై శాతంగా ఉన్న బాలలకు భారత రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులను అందించడంలో విఫలమయ్యాం. బాలలు విద్య, ఆరోగ్యం, భద్రత, పోషకాహార లోపం, వివక్షత, లైంగిక దాడులు, శారీరక దాడులు, స్వేచ్ఛ మొదలగు అనేక అంశాలలో చాల వెనుకబడే ఉన్నారని అనేక ప్రభుత్వ గణాంకాలే తెలియచేస్తున్నాయి.
బాలలకు అనేకమైన బాధల నుండి రక్షణ పొందే హక్కు ఉన్నప్పటికీ, ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్న పిల్లలు బాల కార్మికత, బాల్య వివాహాలు, వ్యభిచారం, అక్రమ రవాణా, ఆకలి, పౌష్టికాహార లోపం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, హెచ్ఐవి/ఎయిడ్స్, నిరాశ్రయులవడం అనాధలుగా మారడం, నివాస వసతి లేకపోవడం, సాయుధ సంఘర్షణలలో నలిగి పోవడం, రకరకాల మార్గాలలో అదృశ్యం అయిపోవడం లాంటివి బాలలకు భద్రత లేకుండా చేస్తాయి. భద్రత అంటే వాళ్ళు నిందలు పడకుండా, దోపిడీ, హింసలకు గురికాకుండా, నిర్లక్ష్యం బారిన పడకుండా చూడటం, అటువంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడం. బాలలకు భద్రత కల్పించడం అంటే వారు తమ జీవన హక్కును, వికాసపు హక్కును, తమ ఎదుగుదల, భాగస్వామ్యపు హక్కులను పొందగలిగి ఉండాలి.
కానీ పెద వర్గాలకు చెందిన బాలలు తీవ్రమైన అన్యాయాలకు బాధితులుగా నిలుస్తారు. భద్రత మరింత అవసరమయే పరిస్థితులలోకి నెట్టబడుతారు. పేదరికం కలుగజేసే అవమానాలు, పిల్లలు ఎదుర్కొనే ఛీత్కారాలు విస్తృతమయినవి. ఇవి అక్కడక్కడా, ఎప్పుడో ఒకసారి జరిగే సంఘటనలు కావు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ అంటే బహిరంగ ప్రదేశాలలో, స్వంత ప్రదేశాలలో తరచూ జరిగే అమర్యాదకర సంఘటనలే. ఉదాహరణకు వీధులలో, క్రీడా స్థలాల్లో, ఆసుపత్రులలో, పోలీస్ స్టేషన్లలో, హాస్టళ్లు మొదలైన ప్రదేశాలలో కూడా ఇవి ప్రతి రోజూ జరుగుతున్నవే. పేదరికం మూలాన పిల్లలు అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోవడం విషాదకరం. వాస్తవానికి పేదరికానికి పిల్లలు బాధ్యులు కాకపోయినా పిల్లలు భద్రతలేని బాల్యాన్ని చవిచూడటం అన్యాయం.
బాలల భద్రతకు బాలల హక్కులకు మధ్య అవినావభావ సంబంధముంది. బాలలు ఏ రకమైన వివక్ష లేకుండా హక్కులను అనునిత్యం పొందడానికి ఉన్న ఏకైక అర్హత వారి బాల్యమే అని గుర్తించాలి. బాలల హక్కులు సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలలో అంతర్లీనంగా ఉండే విశ్వజనీనమైన సార్వత్రిక నియమాలు. కాబట్టి, బాలల హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించవలసిందే. బాలల హక్కులనేవి వారు తమ పూర్తి సామర్థ్యాలతో బాల్యంలోనే వారికి అందుబాటులో ఉండి, పూర్తిగా ఉపయోగించుకోవలసినవి. కానీ బాలల హక్కుల రక్షణ విధాన నిర్ణయాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో కూడా రాజీ దోరిణీనే కనపడుతుంది.
ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడిక ఉన్నప్పటికీ, చట్టాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించే సమయంలో బాలల హక్కుల పట్ల ప్రభుత్వాలు ఎప్పుడూ రాజీధోరణే ప్రదర్శిస్తూ ఉంటాయి. బాలకార్మిక నిర్మూలనా చట్టం: పాఠశాల పని వేళల ముందు, తరువాత పిల్లలు 'సహాయం' చేయవచ్చు అన్న ప్రతిపాదన పెట్టి బాలల శ్రమ దోపిడీని అంగీకరించింది. విద్యా హక్కు చట్టం: 0-6 సంవత్సరాల పిల్లలకు, 14-18 సంవత్సరాల పిల్లలకు ఇందులో చోటులేదు. అలాగే ప్రభుత్వాలు నడిపే పాఠశాలలలోనే అనేక అంతరాలు సృష్టించింది. పాక్సో చట్టం: కిశోరబాలలలోని సహజ సిద్ధమైన లైంగికాసక్తిని నేరపూరితంగా వర్గీకరించింది. జె.జె.యాక్ట్: హేయమైన నేరాలకు పాల్పడిన 16-18సంవత్సరాల పిల్లలను జె.జె.యాక్ట్ వయోజనులుగా పరిగణిస్తుంది ఏ చట్టమూ జవాబుదారీతనాన్ని సంస్థాగతం చేయలేదు.
పేదరికంలో పెరుగుతున్న పిల్లలనే ఆ పేదరికానికి బాధ్యులను చేయడం భావ్యం కాదు. తాము పేదరికంలో మగ్గడాన్ని పిల్లలు కోరుకోరు. కోరుకొని మరీ వారు పేదకుటుంబాలలో, నిర్దిష్ట సామాజిక వాతావరణంలో జన్మించరు. పిల్లలకు పేదరికం నుంచి బయటపడడానికి అతి తక్కువ అవకాశాలుంటాయి. పిల్లలు ఎక్కువగా ఇతరుల మీదా, వారు కల్పించే మద్దతు మీదా ఆధారపడుతుంటారు. పేదరికం కలుగజేసే కష్టాలు అనుభవించవలసిన అగత్యం పిల్లలకు పట్టకూడదు. ప్రభుత్వాలు, రాజ్యం కల్పించవలసిన, కల్పిస్తున్న రక్షణాత్మక హక్కులను అనుభవించలేని పరిస్థితులలో పిల్లలు ప్రతి అడుగులోనూ తమ భవిష్యతు కోసం అనేకమైన పోరాటాలు చేయవలసి వస్తోంది. బాలలు పేదరికంలో మగ్గడం సంస్థాగతంగా జరుగుతున్న ఒక అన్యాయం. ఈ దుస్థితికి ప్రస్తుతం ఉనికిలోనున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలే బాధ్యత వహించాలి.
ఇప్పటి వరకు పిల్లల విషయంలో మనం నేర్చుకున్న వాటిని స్థిరీకరించుకుంటూ బాలల భద్రతను మన జీవన విధానంలో భాగంగా చేసుకొని, బాలల హక్కుల పరిధిని పెంచుకుంటూ ముందుకు సాగాలి. వివిధ చట్టాలలో పేర్కొన్న ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమశాలలు, జూవెనైల్ జస్టిస్ బోర్డులు, బాలల సంక్షేమ సంఘాలు, ప్రత్యేక జువెనైల్ పోలీస్ యూనిట్లు, సమగ్ర బాలల పరిరక్షణా పథకం, జిల్లా బాలల పరిరక్షణా యూనిట్లు, బాలల హౌమ్స్, షెల్టర్లు, దత్తత, స్పాన్సర్షిప్, చైల్డ్ లైన్ మొదలైన వ్యవస్థల, అందులో పని చేస్తున్న వృత్తి నిపుణుల, వివిధ హౌదాలలో (ప్రొబేషన్ ఆఫీసర్లు, ప్రొహిబిషన్ ఆఫీసర్లు, బాలల సంక్షేమ అధికారులు) ఉన్నవారి సమగ్ర పనితీరుకై ఒత్తిడి చేస్తూనే ఉండాలి. బాలల సంక్షేమానికి బడ్జెట్లలో తగినంత కేటాయింపులకై ఒత్తిడి చేస్తూనే ఉండాలి. బాలలకు భద్రత కల్పించడం కేవలం సామాజిక విధానమే కాదు, అది పౌర సదుపాయాల కల్పనా, ఆరోగ్య పరిరక్షణ, విద్య మొదలైన అనేక విధానాలను స్పృశించే అంశం. పొందిన ప్రతీ హక్కు సమాజంపై, అందులోని వ్యవస్థలపై, వాటి పనిపై, పనితీరుపై ప్రభావం కలుగజేసేవే.
బాలల పట్ల సమాజంలో వేళ్లూనుకొని పోయిన నిర్లక్ష్యం ఫలితంగా వారికున్న హక్కులకు భంగం జరుగుతూనే ఉంది. వారి ప్రాధమిక అవసరాలు నిరాకరించబడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో వారికి విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, వారిలో ఆత్మగౌరవం, వారి ప్రాధాన్యతను గుర్తించే పరిస్థితులను కల్పించవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తరతరాలుగా వెనుకబడిన, నిర్లక్ష్యం చేయబడ్డ, అనిచివేయబడ్డ వర్గాలకు చెందిన పిల్లల అభివృద్ధిని కాంక్షించి హృదయ పూర్వకంగా, రాజీలేని కృషి చేయ వలసిన అవసరం ఉంది అన్న వాస్తవాన్ని న్యాయబద్ధంగా గుర్తిస్తేనే జరుగుతుంది. ఇంతవరకూ వారు అనునిత్యం అనుభవిస్తున్న అన్యాయాలను, దౌర్జన్యాలను సరిదిద్దాలనే స్పృహ బాలల హక్కులను కాపాడాలనే రాజకీయ సంకల్పం గ్రామ పంచాయతి నుండి జాతీయస్థాయి వరకు రావాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు, నిజమైన బాలల దినోత్సవాలకు, బాలల హక్కుల వారోత్సవాలకు అర్థం ఉంటుంది. బాలలకు న్యాయం జరుగుతుంది. బాలలు హుందాగా, స్వేచ్ఛగా ఎదగడానికి పూచీపడిన రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుంది.
- ఆర్. వెంకట్ రెడ్డి