Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరుగాలం కాయ కష్టం చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వోర్చి కోటి ఆశలతో రైతులు మిర్చి పంటను సాగుచేస్తే కొత్తరకం వైరస్ అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మిరపపువ్వుపై తామర పురుగులు చేరి పంటను నాశనం చేస్తున్నాయి. ఎన్ని మందులను పిచికారీ చేసినప్పటికీ ఫలితం శూన్యం అవుతున్నది. దీంతో, మిరప పంటను సాగుచేసిన వేలాదిమంది రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. లక్షలాది రూపాయలు అప్పులకు తెచ్చి పంట సాగు చేస్తే మొదట్లోనే ఇలా వైరస్ సోకడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే రేగొండ, జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కోనరావు పేట, గోరికొత్తపల్లి, నిజాం పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో మిరప తోటలు ఇప్పటికే ఎరుపురంగులోకి మారి దెబ్బతిన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
- శ్రీనివాస్ చిరిపోతుల
ఫోన్:9603471199