Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్చి రైతులకు తామర పురుగు యమపాశం అయింది. ఈ పంట సాగు రైతుల ప్రాణాలకు గండంగా మారింది. ఎన్ని పురుగుల మందులు పిచికారి చేసినా తామర పురుగు చావక పోవడంతో పాటు మిర్చి పంటను పూర్తిగా నాశనం చేస్తోంది. ఆ పంట చేనును చూసిన రైతులు తట్టుకోలేక, అప్పులు తీర్చే మార్గం కనబడక తనను కాపాడుతాయి అనుకున్న మిర్చి పంటలోనే ప్రాణాలు తీసుకుం టున్నారు. దీనితో ఆ కుటుంబ సభ్యులు వీధిన పడుతున్నారు. ఇన్ని జరిగినా పాలకులు, అధికారులు వారివైపు కన్నెత్తి చూడకపోవడం చాలా దురదృష్టకరం. ''రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు'' అని చెప్పే పాలకులు లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
ఈ ఏడాది తెలంగాణజిల్లాలో మూడు లక్షల 58 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో లక్షా 30 వేల ఎకరాలలోనూ, మహబూబాబాద్‌లో 83 వేల ఎకరాల్లో, గద్వాల జోగులాంబలో 35 వేల ఎకరాలు, వరంగల్ జిల్లాలో 28 వేల ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 30 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26 వేల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 26 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. కాగా మిర్చి రైతుల ఆత్మహత్యల పరంపర ఇతర జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కొనసాగుతుంది.
''కాడెడ్లు అమ్మిన తీరని అప్పులు''
ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం బాలపేట గ్రామానికి చెందిన పులి వెంకట రామయ్య వయసు 40 సంవత్సరాలు. ఐదుఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. అందులో ఒక ఎకరం సొంత భూమి కాగా, మిగిలిన నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. కౌలు సంవత్సరానికి ఒక ఎకరాకు రూ.35 వేలు చొప్పున చెల్లించి తీసుకున్నాడు. అలాగే ఒక ఎకరాకు పెట్టుబడి ఒక లక్ష 30 వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలకు 6 లక్షల 50 వేల రూపాయలు పెట్టుబడి అయింది. దీనితోపాటు గత అక్టోబర్ మాసంలో భార్యకు ఇద్దరు పిల్లలకు డెంగ్యూ జ్వరం రావడంతో లక్ష 50 వేల రూపాయలు ఖర్చు అయినాయి. ఇవన్నీ కలిపి దాదాపు 9లక్షల 40వేల రూపాయలు అప్పులు అయినట్టు ఆ కుటుంబ సభ్యులు వివరించారు. గత సంవత్సరం ఒక ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వచ్చిందని ఆ కుటుంబ సభ్యులు అన్నారు. కానీ ఈ సంవత్సరం కనీసం 4 క్వింటాలు కూడ మిర్చి దిగుబడి రాలేదని వెంకట్రామయ్య భార్య జ్యోతి ఏడ్చుకుంటూ వివరించింది. అప్పుల బాధ తాళలేక వెంకట్రామయ్య తనకున్న రెండు ఎడ్లను కేవలం రూ.52 వేలకు అమ్మాడు. గత ఏప్రిల్ మాసంలో ఆ ఎడ్లను ఒక లక్షా 40 వేల రూపాయలకు కొనుగోలు చేసి వ్యవసాయాన్ని నడిపించాడు. ఎడ్లను అమ్మగా వచ్చిన డబ్బును తీసుకోవడానికి చేతులు రాక తన భార్య జ్యోతి ఆడబ్బును తీసుకుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సుమారు నాలుగు గంటలకు భార్య, పిల్లలు పడుకున్న ఆ గదికి బయట నుండి తాళం వేసి ఇంటి వెనకాల ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో అతని శవం పోస్టుమార్టానికి, దహనసంస్కారాలకు ఒక లక్ష 70 వేల రూపాయలు ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాడెద్దులు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం అతని చావు ఖర్చుకు వాడిన దురదృష్ట సంఘటన ఇది. దీంతో అప్పుల బాధ తీరక ఇద్దరు పిల్లల పోషణ ఎలాగో తెలియక బతుకు అగమ్యగోచరంగా మారిందని అతని భార్య జ్యోతి రోదిస్తూ చెప్పింది.
''అప్పులు తీర్చే మార్గం తెలియక''
ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం మండలం లోని పాపడపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు భుక్యా సోమ్లా వయసు 45 సంవత్సరాలు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. అలాంటిది కష్టపడితే బాగుపడతాం అని ఆశించి రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. ఏపుగా పెరిగిన చేనుకు కోత సమయంలో తామర పురుగు సోకడంతో ఎన్ని మందులు కొట్టినా పురుగు చావక పంట దిగుబడి రాదని తెలిసి జీవితంపై విరక్తి కలిగి తన ఇంటిలోని పురుగుల మందు సేవించి పది రోజుల పాటు ఖమ్మం ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో భార్య ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఇప్పుడు భార్య, పిల్లలకు కూడా కౌలుకు చెల్లించిన పురుగుల మందులు, ఎరువుల కొనుగోలు, కూలీల కోసం చేసిన అప్పులు నిద్రలేకుండా చేస్తున్నాయి.
''భార్యను బతికించి తనువు చాలించిన రైతు''
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గేట్ రాలకాయలపల్లిలోని వాంకుడోత్ ఫుల్లు వయస్సు 65సంవత్సరాలు. తనకు గల మూడెకరాల సొంత భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మూడు ఎకరాలు మిర్చి పంట నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. రెండు పంటలు నష్టం చవిచూడగా, అతని భార్యను మెదడు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో ఆస్పత్రిలో చేర్పించగా వైద్యం కోసం దాదాపు లక్ష రూపాయల ఖర్చు అయింది. భార్యను బతికించుకోవడం కోసం ఆ రైతు తన పేరు మీద ఉన్న మూడు ఎకరాల భూమిని భార్య పేరు మీద పట్టా చేశాడు. తనకున్న పదిహేను మేకలను అప్పు కోసం అమ్మేశాడు. ఎన్ని చేసినా పంటల ద్వారా వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడం ఎలాగో తెలియక తన భావి దగ్గర గడ్డి మందు తాగి తనువు చాలించాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా కూడా రాకుండా పోయింది. భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
''వాడాల్సిన దాని కంటే పది రెట్లు ఎక్కువగా వాడినం''
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితపురానికి చెందిన గిరిజన మహిళారైతు బానోతు విజయ మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకున్న ఎకరా భూమితో పాటు రెండున్నర ఎకరాల భూమిని రూ.70 వేలు చొప్పున కౌలుకు తీసుకొని నీళ్లకు రూ.25 వేలు చెల్లించి ఏపుగా పెరిగిన మిర్చి చేను ఖాతాకు వచ్చే సమయంలో తామర పురుగు సోకి దాన్ని నివారించడానికి ప్రతిసారి వాడే దాని కన్నా 10 రెట్లు పురుగుల మందు ఎక్కువగా వాడినట్లు ఆమె చెప్పింది. తన ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలి? ఈ అప్పులు ఎలా తీర్చాలి? అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం మిర్చి పంటతో ఐదు సంవత్సరాలు వెనుకకు పోయినట్లే అని చెప్పింది. ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆమె అన్నది.
కాగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో 194 ప్రకారం ఆరు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. రైతు బీమా పథకాన్ని కుటుంబ యూనిట్‌గా తీసుకోవాలి. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందించాలి. ప్రకృతి వైపరీత్యాల కింద మిర్చి పంట రైతులకు రుణమాఫీ చేసి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. ప్రయివేటు అప్పు ఇచ్చిన వారి వేధింపుల నుండి రైతులకు ఉపశమనం కల్పించాలి. అలాగే తామర పురుగు నివారణకు తగిన శాస్త్రీయ పరిశోధన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారిలో మనోధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- పులి రాజు
సెల్:9908383567