Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది చిన్నారులు అనాథలైనట్లు లాన్సెంట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్‌లో ప్రచురించిన కొత్త మోడలింగ్ అధ్యయనం చెబుతోంది. 20 దేశాల చిన్నారులపై చేసిన ఈ అధ్యయనంలో జర్మనీ నుంచి 2,400 మంది ఉంటే భారత్ నుంచి 19 లక్షల మంది చిన్నారులు ఉన్నట్లు తేలింది. అత్యంత ప్రమాదకర పరిస్థితి దక్షిణాఫ్రికా పెరూలో కనిపించింది. అక్కడ ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 8 లేక ఏడుగురు అనాథలుగా మిగిలిపోయారు. 0-4 సంవత్సరాల మధ్య వయసువారు ఐదు లక్షల మంది, 5-9 సంవత్సరాల మధ్య వాళ్లు 7.4 లక్షల మంది కోవిడ్ కారణంగా అనాథలుగా మారిపోయారు. 10-17 సంవత్సరాల పిల్లల్లో 21 లక్షల మంది ఈ మహమ్మారి వల్ల ఒంటరివారయ్యారు. ప్రతి ముగ్గురులో ఇద్దరు కోవిడ్ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయారు.
సంతానోత్పత్తి, అదనపు మరణాలను పరిగణనలోకి తీసుకుని చేసిన ఈ సర్వే అధ్యయనం ప్రకారం... 52 లక్షల మంది చిన్నారులు 2020 మార్చి 1 నుంచి 2021 అక్టోబరు 31 మధ్యకాలంలో కోవిడ్ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. మొదటి 14 నెలల కాలంలో జరిగిన మరణాలతో పోలిస్తే 2021 మే 1 నుంచి అక్టోబరు 31 మధ్య ఆరు నెలల్లో సంరక్షకుల మరణాల సంఖ్య రెట్టింపైందని సర్వేలో తేలింది. యు.ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర పరి శోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. కోవిడ్ వల్ల జరిగిన మరణాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉందని గణాం కాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కలనుబట్టి తండ్రులను కోల్పోయిన చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది.
మన దేశంలో ఈ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కోల్పోయిన పిల్లల సంఖ్య 19.17 లక్షలని తేలింది. 10-17 మధ్య వయసు పిల్లల్లో 49శాతం మంది తండ్రులను కోల్పోయారు. 15శాతం మంది తల్లులను కోల్పోయారు. వాస్తవానికి 2021 జులైన సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల వివరాలతో మొదటి సర్వే విడుదలైంది. దానిప్రకారం 15లక్షల మంది చిన్నారులు 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో అనాథలైనట్లు వెల్లడైంది. అయితే న్యూ మోడలింగ్ చేసిన అధ్యయనంలో ఆ సంఖ్యను పునఃపరిశీలించి (కోవిడ్ ప్రభావిత మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని) 27లక్షలుగా తేల్చారు (మొదటి సర్వేలో 2021 జులైలో 15,62,000 ఉంటే తాజా సర్వేలో 27,37,300).
తాజా ప్రపంచ నివేదికతో కోవిడ్, కోవిడ్ కారక మరణాలు మరోసారి పెరిగే అవకాశముందని అధ్యయన కర్తలు వెల్లడిస్తున్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆఫ్రికా దేశాల్లో కోవిడ్ మరణాల నివేదికలు కచ్చితంగా ఉన్నాయని భావించింది. కాని వాస్తవ అంచనాలు ప్రస్తుతం నివేదించిన సంఖ్యకు మించి 10రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలే కోవిడ్ ప్రభావంగా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను కూడా తక్కువ సంఖ్యలో అంచనా వేశాయి. తాజా సర్వే అక్టోబరు 2021 నాటి అంచనాలను బట్టే ఉంది. ఆ తరువాత కూడా మనదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కోవిడ్ విజృంభించింది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం జనవరి 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనాథలైన పిల్లల సంఖ్య 67లక్షలకు చేరుకుందని భావిస్తున్నారు.
ఈ అధ్యయనంలో తేలిన మరో బాధాకరమైన విషయమేమంటే హెచ్ఐవి/ఎయిడ్స్ బారినపడి సంరక్షకులు, తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలు పదేండ్లలో 50లక్షల మంది ఉంటే కోవిడ్ ప్రభావంగా కేవలం రెండేండ్లలోనే అంతమంది పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఖ్యలు ఒమిక్రాన్ విజృంభించక ముందు నాటివి. అనాథలైన ఈ పిల్లల సంరక్షణను జాతీయ కోవిడ్ ప్రతిస్పందన ప్రణాళికలో చేర్చాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయడం, నియంత్రణ, చికిత్సలపై దృష్టి పెట్టాలి. సంరక్షకుల మరణాలను నివారించాలి. బాధిత పిల్లలకు మద్దతుగా ఆయా కుటుంబాలను సిద్ధపరచాలి. పేదరికం, ప్రతికూలత, హింస వంటి ప్రమాదాల బారిన పడకుండా పిల్లలను రక్షించాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్