Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుడు సామాజిక, సాంస్కతిక, ఆర్థికాభివృద్ధిలో వాతావరణం కీలక పాత్ర వహిస్తుంది. భూ ఉపరితలం నుండి 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అనేక వాయువులు, ఆవరణల మిశ్రమమే వాతావరణం. భూ ఉపరితలంపై, భూగర్భంలో జరిగే అనేక భౌతిక మార్పులు ప్రకృతి సహజ ఆవాసాలపై చూపే ప్రభావం తెలియజేసే శాస్త్రమే వాతావరణ శాస్త్రం. ప్రకృతి సంబంధం, మానవ సంబంధ కారణాల వలన వాతావరణంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ ముందస్తుగా అంచనా వేసినప్పుడు వాతావరణంతో అనుసంధానమైన జీవావరణం, జలావరణం వ్యవస్థకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జీవులు సురక్షితంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. వాతావరణ శాస్త్రం ఉష్ణోగ్రతను, గాలి తేమను, వర్షపాతం, ఆర్ద్రతను, వరదలు, కరువులను, పీడనాలను, ప్రవాహాలను, సునామీలను, భూకంపాలను ఎప్పటికప్పుడు అంచనావేసి తెలియజేయడం ద్వారా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ వాతావరణాన్ని అంచనా వేయడంలో వాతావరణ శాస్త్ర విభాగంలో ఖచ్చితత్వం లోపించడం వలన అనేక రకాలైౖన విపత్తును ఎదుర్కొంటూ ప్రాణ హాని, ఆస్తి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, మానవ ఆవాసాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ నష్టం చేకూర్చుతుంది.
భూ ఉపరితలంలో, భూగర్భంలో జరిగే ఆకస్మిక మార్పులను అంచనా వేయడంలో ప్రపంచ వాతావరణ సంస్థ మరియు దేశీయ వాతావరణ సంస్థలు విఫలం కావడం జరుగుతుంది. తద్వారా నేడు సముద్రం ఒడ్డున ఉన్న అనేక దేశాలు భూకంపాలు, సునామీల భారినపడి ఆస్తి, ప్రాణ నష్టాలకు గురవుతున్నాయి. కావున వాతావరణ మార్పు శాస్త్రంలో ఇంకా విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఇన్కాయిస్ సంస్థ సముద్ర సునామీలను, భూకంపాలను, ఇస్రో కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా నాసా లాంటి సంస్థలు కూడా వాతావరణ శాస్త్రంపై అనేక పరిశోధనలు చేశారు. కావున ప్రపంచ వాతావరణశాస్త్రంలో విస్తతమైన పరిశోధన, అభివృద్ధి జరుపుతూ వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేస్తూ వేగవంతమైన సమాచారాన్ని అంది ఇవ్వవలసిన అవసరం ఉంది.
- సంపతి రమేష్ మహారాజ్
సెల్ : 9959556367