Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతుంటారు మన పెద్దోళ్లు. అది నిజమో, కాదో తెలియదు గానీ ఒకరి ఈ- మెయిల్ పోలిన మరో మెయిల్ మాత్రం కచ్చితంగా ఉంటుందంటున్నారు హైదరాబాద్‌లోని ప్రొఫెసర్లు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే.. ఈ మధ్య మన భాగ్య నగరంలో ఓ సామాజిక అంశంపై పెద్ద ఎత్తున చర్చాగోష్టిని నిర్వహించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ చర్చాగోష్టికి ఒక పబ్లిక్ ఫిగర్నిగానీ, ఒక సామాజిక ఉద్యమకారుణ్నిగానీ పిలవాలని నిర్ణయించారు సదరు నిర్వాహకులు. ఈ బాధ్యతను ఓ సీనియర్ ప్రతినిధికి అప్పగించారు. ఆమె వెంటనే సంబంధిత ప్రముఖ వ్యక్తుల జాబితాను పరిశీలించారు. అందులో ఒకర్ని ఎంపిక చేసుకుని ప్రోగ్రాం వివరాలు, తేదీ, వేదిక తదితర అంశాలను ఈ-మెయిల్ ద్వారా పంపారు. తాము నిర్వహించబోయే కార్యక్రమానికి ముఖ్య వక్తగా రావాలంటూ ఆమె ఆహ్వానించారు. రెండు రోజుల తర్వాత ఈమె మెయిల్‌కు ప్రతిగా.. ఇంకో మెయిల్ ముంబయి నుంచి వచ్చింది. అందులో... 'మేడమ్.. మీరు నన్ను ప్రోగ్రాంకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. కానీ మీరు చెప్పిన తేదీల్లో నాకు సినిమా షూటింగు ఉంది. అందువల్ల మరెప్పుడైనా తప్పకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటాను... ధన్యవాదాలు...' అని రాసుంది. దీంతో అవాక్కయిన సదరు మహిళా ప్రతినిధి తాను పంపిన మెయిల్‌ను ఒకసారి చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత మరింతగా కంగు తిన్నారు. ఎందుకంటే... ఆమె పంపాల్సిన మెయిల్ ఢిల్లీలోని సామాజిక వేత్త మహ్మద్ అమీర్ ఖాన్‌కు కాకుండా.. ముంబయిలోని ప్రఖ్యాత బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ (లగాన్ కథానాయకుడు)కు చేరింది. దీంతో విస్తుబోయిన ఆమె.. మన లగాన్‌కు హీరోకు సారీ, ధన్యవాదాలు చెబుతూ మరో మెయిల్ పంపారు. 'కుడి.. ఎడమైతే...' అంటే ఇదేనేమో కాబోలు.
- బి.వి.యన్.పద్మరాజు