Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిప్పు లేకుండా పొగరాదు''. 'పూర్ణం లేని బూరి' ''వీరణం లేని పెండ్లి ఉండవు'' అన్నవి సామెతలు. అలాగే 'కారణం లేకుండా కార్యం పుట్టదు' అనేది కూడా అంతే. కారణం లేకుండా ఏ కార్యమూ ఉండదని అర్థం. చిన్నతనంలో ఏడు చేపల కథను పరిశీలించండి. వేటకు పోయిన రాజు ఏడు చేపలు తెచ్చి ఎండబెడితే, ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపా ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మేయలేదు. ఆవూ! ఆవూ ఎందుకు మేయలేదు? గొల్లవాడు మేపలేదు. ఇలా ఒక కార్యానికి, స్థితికి, కారణం వెతుకుతూ వెళ్తూ వెళ్తూ '' నా పుట్టలో వేలు పెడితే నే కుట్టనా!'' అని చీమ సమాధానం చెబుతుంది. అంటే అసలు కారణాన్ని చెబుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం అదన్నమాట. ఈ కథంతా మనకు తెలియకుండానే కార్య -కారణ సంబంధాన్ని మనకు అవగతం చేయిస్తుంది. మరి ఇప్పుడు మనం కారణం, కార్యం గురించిన అభివర్గాన్ని కొంత తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ఏ సంఘటనైనా సరే, పరిణామమైనా సరే ఒకటి లేదా కొన్ని కారణాల వల్లనే సంభవిస్తాయి. కారణం, కార్యం అనే సంబంధం సార్వజనీనమైన విషయం. ఏదైనా ఒక విషయాన్ని, పరిస్థితిని, ఘటనను సృష్టించే దానిని కారణం అంటాము. కారణం పని చేయడం వలన కలిగిన ఫలితాన్ని కార్యం అంటాము. ఉదాహరణకు వానలు కురిసి, బావులు చెరువులు, వాగులు నిండాయి. ఇక్కడ వానలు కురవడం కారణం, చెరువులు, బావులు వాగులు నిండటం కారణం యొక్క ఫలితం. అయితే వాన కురవడం వలన చెరువులు నిండాయి. అయితే ఇక్కడ వాన కురవడం అనే కారణం, కార్యంగా కూడా ఉంటుంది. అంటే వాటి స్థానాలు మారతాయి. ఎలా అంటే మేఘాలు చల్లబడ్డ కారణం, వానలు కురిసాయి. ఇక్కడ మేఘాలు చల్లబడటం కారణం. వానలు కురవడం కార్యం. సముద్రాలు, నదుల నీరు వేడిమితో ఆవిరిగా మారడమనే కారణంగా మేఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆవిరిగా మారడం కారణం మేఘం కార్యం. ఇలా కార్యాకారణ సంబంధాలు గొలుసు కట్టుగా సార్వత్రిక సంబంధంలో ఉంటాయి. కార్యం ఒక సందర్భంలో కారణంగా నిలుస్తుంది. కారణం మరో సందర్భంలో కార్యంగా నిలుస్తుంది. కారణం, కార్యం అనేవి ఒక విడి సందర్భానికి అన్వయించినప్పుడు మాత్రమే వర్తించే భావనలు.
చాలా విషయాలకు ముఖ్యంగా సంక్లిష్ట విషయాలకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అంతర్గత కారణాలు, మౌలిక కారణాలే నిర్ణయాత్మకమైనవిగా ఉంటాయి. కార్యాకారణ సంబంధం అర్థం చేసుకోవడం వలన వినాశకరమైన, హానికరమైన పరిణామాలను, వాటి ప్రభావాలను పరిమితం చేయడమో, వాటిని నిలువరించడమో సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఫలితాలు చూస్తూ ఉంటాం. వాటి వాటి కారణాలు వెంటనే తెలియవు. ఉదాహరణకు ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియవు. అంతమాత్రాన కారణం లేదని కాదు. ఆలస్యంగానైనా కారణం తెలుసుకుని వ్యాధిని నిర్మూలించడం జరుగుతుంది. వందేండ్ల క్రితం కారణం తెలుసుకుని ఎన్నో వ్యాధులకు ఈ రోజు చికిత్స చేయగలుగుతున్నాము. అందుకని ఒక్కో అప్పుడు కార్యాలకు కారణం అర్థం కాదు. కారణాలను తెలుసుకోవడం వలన చెడును, నష్టాన్ని నిర్మూలించడమే కాదు. అనుకూల కారణాలు తెలుసుకుని లాభపడతున్నాము కూడా. ఉదాహరణకు పంట దిగుబడి పెరగడానికి ఏ ఏ అనుకూల కారణాలు దోహదపడతాయో తెలుసుకుని మెరుగుపరచుకుంటున్నాము.
కార్యాకారణ సంబంధానికి అతీతమైన విషయమేదీ ఉండదు. ఈ సం బంధం వస్తుగతమైనది. కొన్ని నిర్థిష్ట పరిస్థితులలో నిర్థిష్ట కారణం, నిర్థిష్ట కార్యాని కి దారితీస్తుంది. ఇనుము వేడి చేస్తే సాగుతుంది. అంతేకాని అది బంగారంలా మారదు. రాయిని వేడి చేసినా సాగదు. హేతుబద్ధంగానే ఇవి జరుగుతున్నాయి. కారణాన్ని అనుసరించి కార్యం జరగడమనేది కార్యాకారణ సంబంధంలోని ప్రముఖ లక్షణం. కారణమెప్పుడూ కాలంలో ముందుగా జరుగుతుంది. కారణం తర్వాతనే కార్యం జరుగుతుంది. ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది.
ప్రతి దానికీ దానికి సబంంధించిన కొన్ని కారణాలుంటాయని దీనివల్ల తెలుస్తుంది. ఈ సూత్రాన్ని అన్నింటికీ అన్వయించి చూడవచ్చు. అప్పుడప్పుడు ఒక్కో మనిషి ప్రవర్తనకి కారణం తెలియదు. పిచ్చి అనుకుంటాము. పిచ్చికి కూడా కారణం ఉంటుంది. ుష్ట్రవతీవ ఱర a ఎవ్ష్ట్రశీస ఱఅ ్‌ష్ట్రవ ఎaసఅవరర అని హేమ్లెట్ చెబుతాడు. ఆడవాళ్లకి కొందరికి అప్పుడప్పుడు దేవత పూనుతుంది. కుటుంబ సభ్యుల చెడు ప్రవర్తనలను, మనుషుల ప్రవర్తలపై వ్యాఖ్యానిస్తుంది. దీన్ని హిస్టీరియా అంటున్నాం. మహిళలపై ఉన్న అనేక ఒత్తిళ్లు, అణచివేతలు, హింస ఇందుకు కారణం. అంటే కారణం తెలియనప్పుడు ఏదో ఒక కారణాన్ని మనిషి చెప్పుకుని సమాధానపడతాడు. నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇలా ఏర్పడ్డవే. హిస్టీరియాను 'దేవుడొచ్చింది' అని అంటున్నాము. కారణాన్ని సరిగ్గా గుర్తించనప్పుడు విశ్వాసం, మూఢ విశ్వాసం ఏర్పడుతుంది. సమాజంలో ఉత్పత్తి క్రమంలో అంటే ఆర్థిక విషయాలలో కూడా అనేక విశ్వాసాలు, అసలైన కారణాలను మరుగుపరిచే పద్ధతులు కూడా మనం చూస్తుంటాం. వస్తు ఉత్పత్తిలో లాభం అనేది పెట్టుబడి వల్ల వస్తుందని చాలామంది చెబుతారు. కానీ లాభం అనేది శ్రామికుడి శ్రమ వల్ల ఏర్పడేది మాత్రమే అని అసలు కారణాన్ని వివరించాడు మార్క్స్. అంటే లాభాలు పెరిగి కొందరు ధనవంతులు కావడానికి చాలా మంది పేదలుగా ఉండటమనే కార్యానికి అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. కానీ నేటి పాలకులు, మన వెనుకబాటుతనానికి ప్రాంతాలను, కులాలను, మతాలను కారణాలుగా చూపి మనుషుల మధ్య ముఖ్యంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాల్సిన వారి మధ్య విబేధాలు సృష్టిస్తున్నారు. కాబట్టి కార్యాకారణ విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ కార్యాకారణ సంబంధం ఒక చిన్న భాగాన్ని మాత్రమే అందివ్వగలుగుతుంది. మొత్తం సార్వత్రిక సంబంధాలను వ్యక్తం చేయదు.
సామాజిక అంశాలనూ ఈ కార్యాకారణ సంబంధంలో పరిశీలించవచ్చు. ఉదాహరణకు మొన్న దిశ సంఘటనలో దిశపై అంతటి పాశవిక దాడి చేసిన నలుగురు యువకులు ఎందుకలా రాక్షసుల్లా ప్రవర్తించారు? కారణమేంటి? అని ఆలోచిస్తే వాళ్ల మనస్తత్వం అలాంటిదని, వాళ్లను చంపేస్తే పరిష్కారం అవుతుందని, ఏదో కారణం చెప్పుకుని సమాధానపడుతున్నాము. కానీ ఈ వ్యవస్థలోని ప్రతి అంశమూ యువతలో నేర ప్రవృత్తిని, విచ్చలవిడితనాన్ని పెంచుతోందని, దీని కారణం దోపిడీ వ్యవస్థలో ఉందనేది వాస్తవమైన విషయం. స్త్రీలను సరుకుగా మార్చే ధోరణి, సినిమాలు, మీడియా, పోర్న్‌సైట్స్, నిరుద్యోగం, అవిద్య, పేదరికం, మత్తు వ్యాపారం, హింసా చర్యలు మహిళా వివక్షత, ఒత్తిడి ఎన్నో కారణాలు ఒక చర్యను పురికొల్పుతాయి. ఆ రకమైన మానసికతకు వ్యవస్థ తీరు ప్రధాన కారణంగా ఉంటుంది. అన్ని సంబంధాలలోంచి పరిశీలిస్తే కానీ మనకు ఇవి అర్థం కాదు.
అయితే అసలు ఈ కార్యాకారణ సంబంధాన్ని ఎలా తెలుసుకోవడం అర్థం చేసుకోవడం జరిగింది అనేది కూడా పరిశీలించాలి. చరిత్రలోకి వెళ్తే ప్రపంచాన్ని గూర్చి తెలుసుకునే దారిలో, మానవుడు తన మనుగడ కోసం చేసే పోరాటంలో, సాంఘిక ఆచరణ మార్గంలో కార్యాకారణం పరిశీలించడం మొదలైంది. ఈ ప్రపంచగమన నియమాలు కార్యాకారణ అభివర్గం ద్వారానే మన ఆలోచనకు అందుతాయి. ఫలానా దానికి ఫలానాది కారణం అని తెలిసినప్పుడు ఆ జ్ఞానం మన ఆచరణకి ఆలంభనగా ఉంటుంది. అనేక కార్యాలకు కారాణాన్ని మనిషి తెలుసుకోవడం ద్వారానే ప్రగతిని, పురోగతిని సాధించాడు. నాగరికతను సాధించాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పొంది సౌకర్యాలను పొందగలుగు తున్నాడు. కార్యాకారణ సంబంధం గురించిన కచ్చితమైన అవగాహన రావడానికి ఆచరణ గీటురాయి. ఆచరణ ఫలితాలలోంచే కారణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లోపుగా అనేక కారణాలను ఊహిస్తూ ఉంటాము.
ఫలానా కారణం వల్ల ఫలానా కార్యం విధిగా రావడంతోపాటు కారక సంబంధంలో కాలక్రమం కచ్చితంగా ఉంటుంది. కార్యానికి ముందే కారణం ఉండి తీరాలి. అయితే ముందుగా కనిపించేదంతా ఆ తర్వాత వచ్చే దానికి కారణం కాదు. కార్యత్వ సంబంధం లేకుండా కొన్ని ఘటనలు జరుగవచ్చు. శీతాకాలం వచ్చింది. తరువాత వసంతం వస్తుంది. వసంతం రావడానికి శీతాకాలం కారణం కాదు. 'పొద్దుటే వీడి మొఖం చూశాను ఏం జరుగుతుందో ఏమో' అని వాపోతారు కొందరు. పొద్దుటే చూసిన దాన్ని బట్టి ఘటనలు జరుగ వు. కారణ సంబంధంలో కూడా మిగిలిన విషయాలలో లాగానే భౌతికవాదులకు భావవాదులకు తీవ్రమైన విభేదం ఉంటుంది. మన కోరికలకు సంబంధం లేకుండా, సంకల్పాలకు ప్రమేయం లేకుండా కార్యాకారణ సంబంధం ఉందని భౌతికవాదులంటారు. కార్యాకారణ సంబంధం కూడా దేవుని సృష్టి అని మహ త్తులు, మహిమలు ఉంటాయని అంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనేది వీరి వాదన. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కార్యాకారణ సంబంధాన్ని సరిగ్గా గ్రహించడం అవసరమని గతితార్కిక భౌతికవాదం చెబుతుంది.
అటు ప్రకృతిలోనూ ఇటు సామాజిక విషయాలలోనూ కార్యాకారణ సం బంధం వస్తుగతమైనదే. అయితే ప్రకృతిలో కార్యాకారణ సంబంధాలు ప్రాకృతిక నియమాలకనుగుణంగా పని చేస్తాయి. వాటికి ఒక లక్ష్యం ఉండదు. అవి అలా జరుగుతూ ఉంటాయి. కాగా సామాజిక విషయాలలో చైతన్యయుతమైన, నిర్ధిష్ట లక్ష్యంతో కూడిన కార్యాచరణ కార్యాకారణ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంటు ంది. ఆకలి కావడం అనేది శారీరక ధర్మం. కానీ ఆహారాన్ని సమకూర్చుకొని కడుపునింపుకోవడం అనే మనిషి చైతన్యయుతంగా చేసేపని. మనిషి చైతన్య యుత కార్యాల ద్వారా కొన్నింటిని పొందగలుగుతాడు. అయితే మానవుని చైతన్య యుతమైన లక్ష్య సహితమైన కృషి యొక్క ప్రభావం కార్యకారణ సంబంధపు వస్తుగత నియమబద్ధ స్వభావాన్ని నిరాకరించజాలదని గమనంలో ఉంచుకోవాలి. ప్రకృతిని మనకనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రకృతి నియమాన్ని మార్చడం కుదరదు. అయితే కార్యకారణ సంబంధం తెలియడం ద్వారానే మనం ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకోవడం, మనకనుకూలంగా మలచుకోవడం చేయగలుగుతాము.
- కె.ఆనందాచారి
సెల్ : 9948787660