Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డబ్బులెవరికీ ఊరికే రావు' ఇదొక వ్యాపార ప్రకటన. ప్రకృతిలో సమాజంలో కూడా ఏదీ ఊరికే రాలేదు. ఊరికనే ఏదీ శూన్యంలోంచి ఊడిపడదు. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఎలా ఆవిర్భవిస్తోంది? ఎలా వస్తున్నాయి. ఎలా ఉద్భవిస్తున్నాయి! దేనికైనా, దానికవసరమైన పరిస్థితులు, హేతువులు, ఒక పూర్వరంగం ఏర్పడి ఉన్నప్పుడే అది ఆవిర్భవిస్తోంది. వీటన్నింటినీ కలిపి 'అవకాశం' అంటాము. ఇప్పుడు అస్తిత్వంలో ఉన్న ప్రతిదీ కూడా అవకాశం నుండి ఆవిర్భవించినవే. ఏదైనా అది అలా ఆవిర్భవించడానికి అవసరమైన అవకాశం ఏర్పడి ఉండాలన్నమాట. నిత్యం తడిలో నానుతున్న చెక్కకే చెదలు పడుతుంది. అంటే చెదలు ఏర్పడటానికి అనువైన పరిస్థితులు, ఆ అవకాశాన్ని వాటికిచ్చాయి. దోమలు పుట్టడానికుండే అవకాశం ఎక్కడ ఉంటుంది? నిలువ నీరు ఉన్న చోట. మురికి నీరు నిలువ ఉన్న చోట. ఇది ప్రకృతి సిద్ధమైనది.
తార్కిక నియమాల ప్రకారం అవశ్యకంగా అభివృద్ధి చెందుతూ ఏర్పడేది అకస్మాత్తుగా అవతరించదు. దానికి అవసరమైన విశిష్ట పరిస్థితులు, దాని పుట్టుకకు కావలసిన అంశాలు సృష్టించబడతాయి. తర్వాత అవి పరిపక్వమై, అభివృద్ధి చెంది వస్తుగత నియమాల ద్వారా కొత్త వస్తువు లేదా పరిణామం ఉద్భవిస్తుంది. ఇదివరకే ఉనికిలో ఉన్న పాత దానిలోకే అస్తిత్వాన్ని కలిగి ఉండి కొత్త దాని పుట్టుకకు అవసరమైన ఈ పరిస్థితులనే అవకాశాలు అంటారు. ఆ అవకాశం సాకారమై ఫలవంతమైనప్పుడు అది వాస్తవమవుతుంది. ఇవే అవకాశం వాస్తవికత అనే అభివర్గంగా పిలుస్తాము.
ఉత్పత్తి, సాధనాల సమష్టి యాజమాన్యానికి అవసరమైన పరిస్థితులను పెట్టుబడిదారీ అభివృద్ధే పరిపక్వం చేస్తుంది. అందువల్ల ఇప్పుడు అస్తిత్వంలో ఉన్న పెట్టుబడిదారీ విధానమే స్వయంగా కొత్తదైన కమ్యూనిజం ఉత్పన్నం కావడానికి కావలసిన అవకాశాన్ని కలిగి ఉంటుంది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ యదార్థం లోకంలో అవకాశంగానే ఉంటుంది. అవకాశం వాస్తవం రెండూ కలిసి ఉంటాయి. అవకాశం సిద్ధమైతే అది వాస్తవమవుతుంది. అవకాశాన్ని కూడా వాస్తవం సృస్టిస్తుంది. ముందు వాస్తవం, తర్వాత అవకాశం ఇది లేకుండా అది, అది లేకుండా ఇది ఉండవు. అయితే వీటి మధ్య ఒక అంతరముంది. మనిషి ప్రపంచంలో ఉన్న దానంతటి గురించీ తెలుసుకోగలడు. ఆ అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని ఆచరణ యోగ్యం చేయడం అంటే వాస్తవం చేయడం అనేది ఇంకా మిగిలే ఉంది. అవకాశమున్నా ఆచరణకు పూనుకోకపోతే వాస్తవం కాజాలదు.
అవకాశాలు అనేకం ఉంటాయి. ఉదాహరణకు మన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా కటీశ్వరులు కావచ్చు. బాగా చదువుకుని గొప్ప ఉద్యోగులూ కావచ్చు. ఇవన్నీ సామాన్యంగా ఉండే అవకాశాలు కానీ పెద్ద చదువులు చదువుకునే, ఎన్నికల్లో నిలబడి పోటీ చేయగలిగే పరిస్థితులు ఆచరణలో అందరికీ ఉండవు. పేరుకు అవకాశాలను అందరికీ ఇవ్వటం గానీ, అవకాశాలను వాస్తవం చేసుకునే పరిస్థితి లేకపోవడం ఇక్కడ మనం చూస్తున్నాం.
అవకాశం వాస్తవికంగా మారడమనేది ఒక సుదీర్ఘమైనదీ, కష్టమైనదిగా ఉంటుంది. ప్రకృతిలో అయితే అవకాశం వాస్తవికతగా పరిణమించడానికి వస్తుగత పరిస్థితులు మాత్రమే సరిపోతాయి. అంటే అడవిలో చెట్ల విత్తనాలు, అనువైన నేల, వేడి, తేమ తదితర పరిస్థితులు కలిగిన చోట పడ్డప్పుడూ వాటికవే మొలత్తుతాయి. అయితే సామాజిక జీవితంలో వస్తుగత పరిస్థితులతోపాటు మానవుని చైతన్యయుతమైన కృషి అనేది అవకాశాన్ని వాస్తవికతగా పరిణమించడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. సామాజిక మానవుడు తన ఆహారం కోసం విత్తనాలను భూమి చదును చేసి, నీరు పెట్టి విత్తుతాడు. పంట పండే అవకాశాన్ని కలిగిస్తాడు. అవకాశాన్నుండి వాస్తవ రూపం తేవడానికి నిత్య ఆచరణ కొనసాగిస్తాడు. అలాగే పెట్టుబడిదారీ విధానం దానంతటదే కమ్యూనిజంగా పరివర్తన చెందే అవకాశం లేదు. కార్మికవర్గం చైతన్యయుతంగా సాగించే వర్గ పోరాటం ద్వారానే కమ్యూనిజం ఏర్పడడానికున్న అవకాశం వాస్తవంగా పరివర్తన చెందుతుంది. వర్గ సంఘర్షణకు ఉన్న అవకాశాన్ని గమనించి చైతన్యంతో కమ్యూనిస్టు నిర్మాణం కోసం కృషి చేయవలసి ఉంటుంది. అంటే అవకాశాలను గుర్తించడం ద్వారా, చైతన్యయుతమైన కృషి ద్వారా మానవుడు అనుకూల అంశాలను వాస్తవీకరించడానికి కృషి చేయగలుగుతాడు. అంతేకాదు, అననుకూలమైన వినాశకరమైన అవకాశాలు వాస్తవికతగా మారకుండా అడ్డుకోగలుగుతాడు. పంటకు చీడపట్టే అవకాశాన్ని గుర్తించి పురుగు మందును చల్లుతాము. కాత పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఎరువులు వేయడం ద్వారా సాధిస్తాము. అలాగే బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులు, పదవుల పంపకాలు, అధికారం పంచుకోవడం అనేవి కమ్యూనిస్టు పార్టీలో బూర్జువా పార్లమెంటరీ భ్రమలను పెంచే అవకాశాలు పెరుగుతున్నాయని గమనించగలిగితే అది జరగకుండా చైతన్యయుతమైన కృషి దిద్దుబాటు చేసుకోగలుగతాము. అదేవిధంగా ప్రజా సమస్యపై ఇతర వ్యక్తులు, శక్తులను పార్టీలను కలుపుకుని ఉద్యమాలను నిర్మించడం వలన పార్టీ విస్తరించడానికి, ఉద్యమం బలపడటానికి అవకాశం ఉందనుకుంటే ఆ విధమైన కృషిని చేపడతాము.
మార్క్సిస్టు గతితర్కం భావానాత్మక అవకాశం, వాస్తవ అవకాశం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తిస్తుంది. ఒక అవకాశం వాస్తవికతగా రూపుదాల్చడానికి అవసరమైన పరిస్థితులన్నీ రూపొంది ఉన్నప్పుడు, ఆ అవకాశాన్ని వాస్తవ అవకాశం అంటారు. ఆ పరిస్థితులు ఇంకా ఏర్పడనప్పుడు భావనాత్మక అవకాశం అంటారు.
కాబట్టి సామాజిక పరమైన అవకాశాలను మనుషుల చైతన్యయుత ప్రయత్నం, కృషి ద్వారా మంచి సమాజాన్ని వాస్తవ అవకాశంగా మార్చుకోవచ్చు. వాస్తవీకరించుకోవచ్చు. 'నువ్వు చేసేది చేయి, దైవం నీకు సహకరిస్తుంది' అంటారు కొందరు. 'గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఆగుతుందా? అని కూడా అంటారు. అంటే మనం ప్రయత్నం ద్వారానే అవకాశాన్ని వాస్తవం చేసుకోవచ్చు అని. 'నువ్వెంత చేసినా వాడి అనుగ్రహం లేకుంటే ఏమీ జరుగదు' అని మనిషి యొక్క ప్రయత్నాన్ని తగ్గించి అంతా దైవాధీనం అంటారు భావవాదులు. ఇలా వాదించేవారు అవకాశాలను వాస్తవం చేసుకునే ప్రయత్నం చేయరు. కానీ చరిత్రను తిరగేస్తే మానవుల ప్రయత్నం, కృషితోనే ప్రతిదీ సాకారమైందన్న వాస్తవం తెలుస్తుంది. మనిషి ప్రయత్నం ఎంతో ఘనమైనది. అన్నీ ఒక్కడికి బదులు అందరికీ అన్నీ అనేదే నిజమైన స్వర్గం. అదెక్కడో లేదు, ఈడే నేడే ఉన్నది. అదే సమసమాజం. మనిషి ప్రయత్నం వల్ల సిద్ధించే అవకాశాలే ఇవన్నీ. ప్రపంచాన్ని మార్చే నిత్యకార్యాచరణ క్రమంలో ప్రజలు దానిలోని అంతర్గత అవకాశాలను కనిపెట్టి వాటిని వాస్తవ స్థితిలోకి మార్చేందుకు కృషి చేస్తారు.
- కె.ఆనందాచారి
సెల్ : 9948787660