Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రకృతి'ని ఎంతగా ప్రేమిస్తామో, అంత ప్రకృతి తిరిగి మనకు ఇస్తుందనే కొత్త సిద్ధాంతం మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చిన తరుణంలో 'ప్రేమ' అనే పదానికి విస్తృత భావనలు ప్రారంభమయ్యాయి. మనిషి జీవితంలో 'కౌమార' దశ అత్యంత కీలకమైనది, విలువైనది. కారణం 13వ సంవత్సరం నుండి 19 సంవత్సరం వరకు మనిషిలో త్వరితగతిన మార్పులు చోటు చేసుకుంటాయి. వేగంగా జరిగే మార్పులకు తగినట్లుగా సమాజం, కుటుంబం, విద్యావ్యవస్థ వారి మనస్తత్వాన్ని నియంత్రించి, సవ్యమైన దిశలోకి నడిపించేటట్లుగా ఉండాలి. అయితే నేటి సమాజం ఆయా స్థితులకు తగినట్టుగా ఉందా అనేది చర్చానీయంశం. శారీరక మార్పులు, మానసిక ఒత్తిడులను జయించలేని యుక్త వయస్సులో కలిగే విపరీత భావనలను 'ప్రేమ' అనే పదానికి అన్వయించుకుని జీవితాలలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న యువత ఆలోచించాల్సింది ఒక్కటే. తల్లి జన్మనిచ్చి, పాలిచ్చి, పెంచి, మన మల మూత్రాలను శుభ్రపరిచి మన ప్రతి అడుగులో తన సర్వం త్యాగం చేసిన అమ్మ 'ప్రేమ' కన్నా గొప్పది ఏముంటుంది? కుటుంబ క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ తన అవసరాలను మానుకుని మనల్ని ప్రయోజకులను చేయాలనే సంకల్పంతో మనకొక జీవితాన్ని ఇస్తున్న నాన్న 'ప్రేమ' కన్నా గొప్పది ఏముంటుంది.? కేవలం రోజూ మన కంటి ముందే కనపడుతున్న 'ప్రేమకు' ప్రతి రూపాలను నిర్లక్ష్యంగా తోసివేసి లేని దాని కోసం వెంపర్లాడటం ఎంత వరకు సబబో ఆలోచించండి?
శారీరక ఆకర్షణే 'ప్రేమ' ఐతే మరి 'ప్రేమ' అనే అక్షరాలకు అర్థం ఇన్ని రకాలుగా ఎందుకు ఉంది? గమనించండి? కుటుంబంతో, తల్లిదండ్రులకు సంబంధంలేని ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని వ్యామోహాలతో కొట్టుకుపోతున్న యువజనులందరూ గమనించాల్సింది ఒక్కటే. జీవితమంటే కేవలం శారీరక తృప్తి కాదు. మీరనుకుంటున్న ప్రేమ అంతకన్నా కాదు. జీవితమంటే ప్రపంచాన్ని జయించటానికి మనకు లభించిన అపురూప వరం.. అవకాశం. మన పుట్టుకకు చిహ్నాలైన మనదైన ముద్ర, మనదైన సంతకం ఈ నేలపై విడిచి వెళ్లటం, చిరస్థాయిగా నిలిచిపోవటం. ప్రేమికుల దినోత్సవం పేరిట పాశ్చాత్య సంస్కృతిని మనలోకి ఆహ్వానించి తెలిసీ తెలియని వయస్సు ప్రభావంతో జీవితాలను ఇబ్బం దులలోకి నెట్టుకోవటం అవసరమా? ఆమోదయోగ్యమా? జీవితంలో స్థిరత్వం, శారీరక అవసరాలకు మించిన నిబద్ధత, నిశ్చలత వల్లన మాత్రమే 'ప్రేమ' అనే పదం పరిపూర్ణత సంతరించుకుంటుంది. అంతే కాని 'ప్రేమ' అనే ముసుగుతో ఒకరి జీవితాలను ఒకరు ఇబ్బంది పెట్టుకుని అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోకూడదు. ఇది ప్రతి ఒక్క కుటుంబం కోరుకుంటున్న అంశం.
ఇక ప్రేమికుల దినోత్సవం పేరిట జరుగుతున్న వ్యాపారం లక్షల కోట్లు ఉంటోందనేది స్పష్టం. తమ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి యవతను నిస్తేజం వైపుకు నెడుతున్నారనేది వాస్తవం. అర్థంలేని అంశాలతో, కేవలం యువత శారీరక వాంఛలను రేకెత్తించే మాద్యమాలుగా సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్స్‌యాప్, ఇన్‌స్ట్రాగ్రాం, చలన చిత్రాలు తయారు కావటం ఎంతో పవిత్రమైన 'ప్రేమ' అనే పదానికి కళంకం ఏర్పడింది. ఆ పదం మాటున లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిలింగ్స్, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండటం సమాజాన్ని కుదిపేస్తోంది. కేవలం 'నమ్మించటం' ద్వారా యువతీ యువకులు పరస్పరం నష్టపోతున్నారు. చదువుకుని ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాల్సిన యువశక్తి నిర్వీర్యానికి సాంకేతిక విధ్వంసం కూడా ఒక కారణం. ముఖ్యంగా తీవ్రతరమైన కమ్యునికేషన్ వ్యవస్థ, సెల్‌ఫోన్ అనే సమాచార విప్లవ సాధనం యుక్తవయస్సు వారి పట్ల ఉరితాడుగా మారిందనేది కఠోరసత్యం. అమ్మ, నాన్న కుటుంబం పంచే 'ప్రేమ' కన్నా గొప్పగా ఎవరూ ఇవ్వలేరన్నది స్పష్టం. జీవితం అన్నింటి కన్నా గొప్పది. మీ జీవితానికి అర్థం ఈ సృష్టి ఉన్నంత వరకు మీరు చిరంజీవిగా ఉండటం. అంతులేని భావ దారిద్య్రాల సమాహారంగా ఉన్న స్థితికి 'ప్రేమ' అనే ముసుగు వేసి యువత జరుపుకుంటున్న ప్రత్యేక రోజు ప్రేమికుల దినోత్సవం. ఏది దేనికి దారి తీస్తుందో తెలియని అసంబద్ధ స్థితిలో యువత అయోమయానికి గురవుతున్నారు. 'ప్రేమించటం' అనే పదానికి కూడా అర్థం తెలియని తనం ఏదో చేసేయాలనే ఆరాటం, అందరికంటే గొప్పగా ఉండాలనుకునే తెంపరితనం వెరసి కుటుంబ స్థితులకు అతీతమైన కార్యకలాపాలకు పాల్పడి అటు చదువుకు, ఇటు తల్లిదండ్రులకు దూరమై లోకం నుండి శాశ్వతంగా దూరమవుతుండటం అత్యంత విచారకరం. వేషధారణలు, భాషా సంస్కృతులు, అహారపు అలవాట్లు, అన్నింటికి మించి నూతన పోకడలకు దగ్గరగా ఉండాలనుకునే దూకుడు మనస్తత్వం వల్ల కుటుంబ బంధాలను పణంగా పెడుతున్నారు.
కాలంతోపాటు జీవనశైలి, సరళి మారుతోంది. దానితోపాటు కుటుంబ మూలాలను మార్చుకోవటం వీటన్నిటికి మూలకారణం. నాగరికతను స్వీకరించాలి కాని మనం అనాగరికంగా ఉండకూడదు. ఇక్కడ కుటుంబ బంధాలు, ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, ప్రేమాభిమానాలు, ఒకరి ఇబ్బందిలో మరొకరు అండగా ఉండటం వెరసి ఒక అద్భుత కుటుంబ వ్యవస్థ దేశాన్ని కొన్ని దశాబ్ధాలుగా సజీవంగా ఉంచింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితులే యువతను స్వతంత్య్ర భావాల వైపు నడిపించి వారి భవిష్యత్‌ను విచిత్ర పరిస్థితిలోకి నెట్టివేసింది. ఎప్పుడైతే కుటుంబంలో నిరంతరం తమ పిల్లలకు స్నేహ పూర్వక వాతావరణం కల్పించి నిరంతరం పర్యవేక్షిస్తూ కాపాడుతారో వారు సన్మార్గంలో, సచ్ఛీలతలో ఉంటారనేది స్పష్టం. ఆ వైపుగా అడుగులు వేద్దాం.. వాస్తవజీవన గమనం నేర్పుదాం..
- అట్లూరి వెంకటరమణ
సెల్ : 9177237945