Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపర మేథావి ఆయినా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తాడు. పొట్టకోస్తె అక్షరం ముక్కరాని వారు సైతం పండితులకు పాఠాలు చెబుతారు. జ్ఞానం ఎవరి సొంతం కాదు. ఆ మాట కొస్తే ఇంగ్లీషులో కామన్ సెన్స్ అనే పదాన్ని కనీసజ్ఞానం ఉందా అన్న భావనలో తరుచూ వాడుతాం. విశ్వాంతరాలను చుట్టొచ్చిన జ్ఞానికి సైతం ఒక్కోసారీ కామన్ సెన్స్ ఉండక పోవచ్చు. కామన్ సెన్స్ పేరు చెబితే అనేక ఆవిష్కరణలకు బీజం వేసిన ఓ గొప్ప శాస్త్రవేత్తకు ఎదురైన అనుభవం గుర్తొస్తోంది. పరిశోధనలో ఎప్పుడూ ల్యాబ్లో ఉండే శాస్త్రవేత్త రాత్రికి గాని ఇంటికి చేరుకునే వాడుకాదు. అతనికి పిల్లులంటే చాలా ఇష్టం. ఒక పెద్ద పిల్లిని, ఒక చిన్న పిల్లిని పెంచుకునేవాడు. రోజూ ఉదయం ల్యాబ్ కెళ్లే సమయంలో అవికూడా అతనితో పాటు బయటికెళ్లి.. ఏ అర్థరాత్రో అపరాత్రో ఇంటికొచ్చేవి. రోజంతా ల్యాబ్లో ఉండి అలసి పోయి గాఢనిద్రలో ఉండే సమయంలో వచ్చి తలుపు వద్ద అరిచి గోల పెట్టేవి. ప్రతీ రోజూ ఇదే తంతూ కావడంతో ఓ ఉపాయం ఆలోచించాడు. వెంటనే వడ్రంగిని పిలిచి బాబు నేను పెంచుకుంటున్న రెండు పిల్లుల వల్ల అర్థరాత్రి నాకు నిద్రా భంగమవుతున్నది. ఈ తలుపుకు ఒక పెద్ద రంధ్రం, ఒక చిన్న రంధ్రం చేయి.. అవి ఎప్పుడొచ్చినా పెద్ద రంధం నుంచి పెద్ద పిల్లి, చిన్న రంధ్రం నుంచి చిన్న పిల్లి ఇంట్లోకి వస్తాయి అనగానే వండంగి చిన్నగా నవ్వుతాడు. సార్ రెండు రంధ్రాలు ఎందుకు.. ఒకే పెద్ద రంధ్రం నుంచి రెండు పిల్లులు వస్తాయిగా అనడంతో శాస్త్రవేత్త నాలిక్కర్చుకున్నాడు. నాకు ఈ మాత్రం ఆలోచన తట్టలేదెందుకని బాదపడ్డాడు. కామన్ సెన్స్ అంటే ఇదే.. ఒక్కో సారీ చిన్న చిన్న విషయాలు కూడా తట్టవు. అంత మాత్రాన అతనికి ఏమి తెలియదనుకోవడం సరికాదు. జాన్ఞమనే మహా సముద్రంలో అడుగేసి అడుగు తీస్తున్న పసిబాలున్ని నేను అంటాడు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. అందుకే జ్ఞానం అనంతం. -ఊరగొండ మల్లేశం