Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాళవరాజు మదనుడు అకస్మాత్తుగా చనిపోవడంతో యువ రాజు మోహనుడు రాజయ్యాడు. యువరాజుకు పాలనానుభవం లేదు. తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం ఉండేది. అందుకోసం ఏమి చేయాలని ఆలోచించాడు. కానీ తగిన ఆలోచన తట్టకపోవడంతో మంత్రులను సలహా అడిగాడు.
''మీకు పాలనలో అనుభవం వచ్చాక కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అనుభవజ్ఞుడైన మీ తండ్రి పాలనను కొనసాగిద్దాం'' చెప్పాడు మంత్రి వివేకుడు.
యువరాజుకు ఆ మాటలు నచ్చలేదు. కొందరు మంత్రులు మాత్రం మోహనుడిని మెప్పించే సలహాలిచ్చారు. అవి విన్న మోహనుడు సంతోషించి ప్రజలతో సభ ఏర్పాటు చేసాడు. అమలు చేయబోతున్న పథకాలను వారికి చెప్పాడు. ప్రజలంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు. మరునాటి నుండి రాజ్యమంతటా పేదలందరికీ ఉచిత ఆహార ధాన్యాలను అందించారు. ఇల్లు నిర్మించి ఇచ్చారు. నిరుద్యోగులు, వికలాంగులు, వయోవద్ధులకు ధన సహాయం చేసారు. ధర్మ సత్రాలు, అన్నదాన కేంద్రాలు నిర్మించి వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు.
'అలాంటి పథకాల వలన ముందు ముందు కష్టాలు వస్తాయని' చెప్పాడు వివేకుడు. యువరాజు వాటిని పెడచెవిన పెట్టాడు. ప్రజలు సంతోషించడమే కాకుండా యువరాజుని పొగిడారు. అన్ని అవసరాలను రాజుగారే ఉచితంగా తీర్చడం సోమరులకు వరంగా మారింది. పేద కుటుంబాల వారికి ఆహారధాన్యాలతో బాటు కొంత డబ్బు ఇవ్వడంతో వారికి పనుల మీద శ్రద్ధ తగ్గింది. మరికొందరు ఇంట్లో వంట మానేసి ఉచిత భోజనశాలకు వెళ్లారు.
శ్రమ పడకుండా డబ్బు, ఆహారం చేతికి అందుతుండేసరికి చేతి వత్తుల వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎండనకా వాననకా కష్టమెందుకు పడాలనుకున్నారు. వత్తి పనులను మూల పెట్టేసారు. మరొకవైపు పొలంలో పనికి కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. సమయానికి పంటలు వేయలేకపోయారు కొందరు. మరికొందరు పంటల్నే పండించలేదు. తమ పిల్లలు చదువుకున్న వారయితే నౌకరీ దొరుకుతుందన్న ఆశతో బడులకు పంపే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది. అన్నీ రాజుగారే ఇస్తుంటే వేరే కొలువులెందుకని బడులకు పిల్లల్ని పంపడం మానేశారు. వ్యాపారులయితే యువరాజు బలహీనత కనిపెట్టి పన్నులు చెల్లించకుండా సాకులతో తప్పించుకునేవారు. పని చెయ్యకుండా ఉండడంతో పొద్దుపోక జూదం, మద్యపానం వైపు మొగ్గు చూపారు ప్రజలు. రాజ్యంలో క్రమశిక్షణ నశించింది. రెండేళ్ళు గడిచేసరికి ఖజానా ఖాళీ అయింది. పంటలు పండించక రాజ్యంలో తిండి ధాన్యాల కొరత వచ్చింది. మరోప్రక్క పన్నుల ఆదాయం తగ్గింది. చాలా సరుకులకు రాజ్యంలో కొరత వచ్చింది. ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల సైనిక సదుపాయాల్లో, జీతాల్లో కోత విధించాడు రాజు. ఫలితంగా సైనికుల ఆత్మవిశ్వాసం, నైపుణ్యం దెబ్బతిన్నాయి. క్రమశిక్షణ కొరవడింది. అలసత్వం, బద్ధకం పెరిగాయి.
మాళవ రాజ్య పరిస్థితులను వేగుల ద్వారా నిత్యమూ తెలుసుకుంటున్న శత్రురాజు సమీరుడు అదే మంచి సమయమనుకున్నాడు. దండయాత్రకు వస్తున్నట్టు మోహనుడికి వర్తమానం పంపించాడు.
దిక్కుతోచక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గండం గట్టెక్కించమని మంత్రులను కోరాడు మోహనుడు.
వివేకుడు ''ఉచితాలను అలవాటు చేయొద్దని విన్నవించినా తమరు వినలేదు. తమ తండ్రిగారు ఇలాంటివి ప్రోత్సహించ లేదు సరికదా శ్రమ గొప్పదనం వివరిస్తూ కష్టార్జితం విలువ తెలిపేవారు. మన రాజ్యం సుభిక్షంగా ఉండేదప్పుడు. ఇప్పుడు సోమరులతో, వ్యసనపరులతో నిండిపోయింది.మీ తండ్రిలా కష్టించే తత్వాన్ని ప్రజల్లో పెంచుతానంటే ఉపాయం ఆలోచిస్తాను' అన్నాడు.
వివేకుడి మాటలకు అంగీకారం తెలపడమే కాకుండా తక్షణమే ఉచితాలను రద్దు చేసిన పత్రం విడుదల చేసాడు మోహనుడు.
వివేకుడు బుర్రకు పదునుపెట్టాడు. మొదటి చర్యగా పూర్వపు తమ రాజుగారైన మదనుడితో మిత్ర రాజుల వద్దకు సైనిక సహాయం కోరుతూ దూత లను పంపాడు. తిండి ధాన్యా లను అప్పుగా పంపమని కూడా కోరాడు. తదుపరి చర్యగా ఖచ్చితమైన సందేశం ప్రజల్లోకి పంపాడు. ''సోమరి తనం వీడమని, మునుపటిలా కష్టించి పనిచేయాలని, పని చేయ కుండా కనిపించే వారిని సైన్యంలోకి తీసుకుని శిక్షణ ఇచ్చి యుద్ధానికి పంపుతామని' చాటించాడు. ప్రజల్లో భయం, అభద్రతాభావం కల్పించి వారిలో గూడుకట్టుకున్న పెనునిద్దరను వదిలించాడు. మూడవచర్యగా తమకు మద్దతు నిలిచిన రాజుల వివరాలతో శత్రురాజు సమీరుడికి జవాబు పంపాడు. మాళవరాజ్య పరిణామాలను, తాజా పరిస్థితులు తెలుసుకున్న సమీరుడు దండయాత్ర ఆలోచన మానుకున్నాడు.
వివేకుడు చూపిన ప్రజ్ఞ వలన ఆపద తప్పినందుకు మోహనుడు ఊపిరి పీల్చుకున్నాడు. జరిగిన దానికి బుద్ధి తెచ్చుకుని, తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రి వివేకుడి సలహాలను స్వీకరిస్తూ పాలనలో మంచి పేరు తెచ్చుకున్నాడు మోహనుడు.
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
94907 99203