Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది పార్వతీపురం గ్రామం. ఆ ఊరికంతటికీ మంచినీటి చేద బావి ఒక్కటే ఉంది. అక్కడ స్త్రీలంతా వరుస క్రమంలో బిందెలకు నీళ్లు తోడుకుంటున్నారు. ఒక రోజు నీళ్లు తోడుకున్న తరువాత సుమతి అనే ఆమె సీతతో పోట్లాడుతోంది ''నేను బిందెలో నింపుకున్న నీళ్లల్లో, నీవు బిందెను ఎత్తే సమయంలో నీ బిందెలో నీళ్లు నా బిందెలో పడ్డాయి'' అని గొడవ పెట్టుకుంది.
''మరి విచిత్రం కాకపోతే ఆవిడ బిందెలో నీళ్లు, నీ బిందెలో పడితే మాత్రం ఇంత గొడవ చేయడం ఏంటీ'' అని వయసు పైబడ్డ స్త్రీలు చెప్పినా సుమతీ వినలేదు.
''నీవు బీద ఇంటి ఆమెవు... నేను కలిగిన ఇంటి దాన్ని'' అని సీతతో అంది.
ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఆ ఇద్దరూ ఆ దేశం రాజు వద్దకు వెళ్లారు.
రాజుకు, సుమతి జరిగింది చెప్పింది. రాజు మంత్రితో సమస్యను పరిష్కరించమన్నాడు.
''అవును సుమతి చెప్పింది నిజమే.. సీత బిందెలో నీళ్లు ఆమె బిందెలో పడడం నేరమే'' అన్నాడు మంత్రి.
''ఇందుకు ఏం చేయాలో చెప్పమ్మా!'' అని రాజు, సుమతిని అడిగాడు.
''నాకు నష్టపరిహారంగా ఆమె ఒక వెండి నాణెం ఇవ్వాలి'' అంది సుమతి.
''అవును ఆమె కోరిన ప్రకారం సీత ఒక వెండి నాణెం ఇవాల్సిందే!'' అని రాజు తీర్పు చెప్పాడు.
రాజు చెప్పిన దానికి సభలో చాలా మంది నివ్వెరపోయారు కానీ ఏమీ చేయలేకపోయారు.
మరుసటి రోజు సీత ఒక వెండి నాణెం సుమతికి ఇచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. అదే బావి దగ్గర, సీత నీళ్లు తోడి బిందెను ఎత్తే లోపల, సుమతి బిందెలో నీళ్లు సీత బిందెలో పడ్డాయి, దీనిని కొంత మంది స్త్రీలు చూశారు. మళ్లీ సీత, సుమతి రాజుగారి వద్దకు వెళ్లారు.
సీత, రాజుకు విషయం చెప్పింది. ''ఏం చేయాలో చెప్పు'' అన్నాడు రాజు.
''మహారాజా! సుమతి వాళ్లు బాగా కలిగిన వాళ్లు.. కాబట్టి, ఆమె నాకు ఒక బంగారు నాణెం ఇవ్వాలి?'' అంది సీత.
''అవును ఇందులో ఆలోచించేదే లేదు.. సుమతీ, నీవు సీతకు ఒక బంగారు నాణెం ఇవ్వాల్సిందే?'' అని రాజు తీర్పు చెప్పాడు.
సభలోని వారు,రాజు తీర్పుకు చప్పట్లు చరిచారు. చేసేది లేక ''అలాగే మహారాజా!'' అంది సుమతి.
మరుసటి రోజు సుమతి, సీతకు ఒక బంగారు నాణెం ఇచ్చింది.
ఇదంతా మంత్రి ఎత్తుకు పైఎత్తు వేసి, సీతతో నడిపిన నాటకం అని, సుమతికి తెలియదు. అటు తరువాత సుమతి మరెవ్వరితోనూ గొడవ పెట్టుకోలేదు.
- యు.విజయశేఖర రెడ్డి,
9959736475