Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దండకారణ్యం మొత్తంలో ఉన్న జంతువుల అన్నింటిలోనూ నేను మాత్రమే బాగా తెలివైన దానిని అని కుందేలు ఇతర జంతువులను చులకనగా చూడసాగింది! ఈ విషయం ఆ నోటా ఆ నోటా నక్కకు తెలిసింది ఆ విషయం తెలుసుకున్న నక్క నవ్వి ఊరుకుంది, 'నక్క బావ ఈ అడవిలో తెలివైన జంతువునువ్వే కదా కుందేలు చూడు తనే తెలివైన దానిని అని ఎలా విర్ర వీగుతున్నదో దానికి తగిన బుద్ధి చెప్పాలి'' అని ఇతర జంతువులు అన్నీ కలసి నక్కకు విషయాన్ని విన్నవించాయి! నక్క మాత్రం వాటి మాటలు విని ''తెలివి ఒక్కరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు తెలివిగా వ్యవహరించి వారి వారి విషయాలను చక్కబెట్టుకోవాలి అంది నక్క
ఒకరోజు నక్క అడవి దారిన వెళ్తుంటే, కుందేలు 'ఏం నక్క బావ ఈ అడవిలో నేనే బాగా తెలివైన దానిని అని అందరూ అంటున్నారు, నువ్వు వినేఉంటావు నువ్వు కూడా ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకొంటావా లేదా?'' అంటూ నక్కను
రెచ్చగొట్టింది! ఆ మాటలు విన్న నక్క నవ్వి ఊరుకుంది ''ఇద్దరిలో ఎవరు తెలివైనవారమో తేల్చుకుందాం రా.. దమ్ముంటే!'' అన్నది కుందేలు పక్కనే ఉన్నటువంటి జంతువులు 'ఎందుకు నక్క బావతో గొడవ?'' అంటూ కుందేలును వారించాయి! ''కాదు కాదు నేను ఏంటో ఈ అడవికి తెలియాలి నేను గొప్ప తెలివైన దానిని అని అందరూ గుర్తించాలి పందెం పెట్టుకుందాం'' అని పట్టుబట్టింది కుందేలు లాభంలేదు కుందేలుకు ఎలాగైనా బుద్దిచెప్పాలని ఒప్పుకొని ''పందెం ఏమిటో చెప్పమంది'' నక్క ''అదిగో అక్కడ వేటగాడు రెండు వలలు వేసి ఉంచాడు దాంట్లోకి వెళ్లి మనం వేటగాడు వస్తుండగా చూసి దాని నుంచి తప్పించుకుని బయటపడాలి '' అంది కుందేలు ''ఎందుకు ఆపదలను కావాలని కొని తెచ్చుకోవడం నువ్వే గొప్పలే వదిలేరు!'' అని చెప్పి చూసింది నక్క, అవును ఎందుకు ఈ సాహసం అని ఇతర జంతువులు కూడా నచ్చ చెప్పాయి కానీ కుందేలు వినలేదు చేసేదిలేక నక్క సరే అన్నది ఇద్దరూ వెళ్లి అక్కడ ఉన్న రెండు వలల్లో చెరో దాంట్లోకి చేరారు ఇంతలో వేటగాడు రావడం గమనించిన నక్క నిదానంగా తన వల నుంచి బయటకు వచ్చింది కుందేలు మాత్రం వేటగాడిని చూసి కంగారుపడి ఆ వలలో ఇరుక్కుపోయింది! వేటగాడు వచ్చి వలలో చిక్కిన కుందేలును తీసుకుని ఇంటి దారి పట్టాడు! కొంత దూరం వెళ్ళాక కుందేలు ఉన్న వలను కింద పెట్టి చెరువులో నీరు త్రాగడానికి వెళ్ళాడు, సమయస్పూర్తితో వేటగాడిని అనుసరించిన నక్క వెంటనే వెళ్లి కుందేలు ఉన్న వలను కొరికి కుందేలును ఆపద నుంచి కాపాడింది. అక్కడి నుంచి అవి వెంటనే అడవిలోకి వెళ్ళిపోయాయి!.
''నన్ను క్షమించు నక్క బావ నేను చాలా అహంకారంతో నేనే తెలివైన దానిని అని నీతో సహా మిగతా జంతువులను చులకనగా చూశాను. నేను చేసిన పని ఏదీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఆపద నుంచి రక్షించావు నువ్వు ఎంత చెప్పినా వినకుండా పోటీ జరగాల్సిందే అని పట్టుబట్టిన నాకు తగిన శాస్తి జరిగింది! నువ్వే లేకపోతే నేను ఈరోజు వేటగాడికి ఆహారం అయ్యే దానిని నక్క బావ! నువ్వే నిజమైన తెలివైన వాడివి నన్ను క్షమించు!'' అన్నది కుందేలు ''మిత్రమా! కుందేలు తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు పరిస్థితులు కూడా మనలోని తెలివితేటలను బయటికి వచ్చేలా చేస్తాయి అయినా ఈ లోకంలో ఎవరి తెలివి వారిది ఒకరితో పోల్చకోవటం ఏమాత్రం మంచిది కాదు దేనికదే ప్రత్యేకమైనది ''అన్నది నక్క.
- ఏడుకొండలు కళ్ళేపల్లి,
9490832338