Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా వీరాపురం అనే గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యాపారి జీవించేవాడు, ఇతను బాగా ధనవంతుడు, అతనికి ఒక్కగానొక్క కుమారుడు చింటూ, సర్కారు బడిలోనే చదువుకుంటున్నాడు, లేక లేక కలిగిన సంతానం కావడంతో, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు, చింటూ తల్లి కృష్ణవేణి కుట్టుమిషన్ పెట్టుకొని, తీరిక వేళల్లో బట్టలు కుడుతుండేది.
పిల్లలకు బడి సెలవు ఇవ్వడంతో ఇంటి పట్టునే ఉండసాగారు, చింటూకు ఆటలంటే చాలా ఇష్టం, కాస్త సమయం దొరికితే చాలు, బజారుకు వెళ్ళేవాడు, రోజులాగే ఈ రోజు కూడా, చింటూ తన స్నేహితులతో కలిసి, ఆడుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్ళాడు, కృష్ణవేణి ఇల్లు మొత్తం వెతికింది, చింటూ కనిపించకపోవడంతో నేరుగా గ్రౌండ్‌కు వెళ్ళింది, అక్కడ ఆడుకుంటున్న చింటూని చూసి ''అరే చింటూ, నీకు ఎన్నిసార్లు చెప్పేది బయటకు వెళ్ళవద్దని, నీ స్నేహితులకు బుద్ధి లేదు, ఒక్కడైనా శుభ్రంగా వున్నాడా ఇంటికి పద'' అంటూ కొడుకుతో పాటు, స్నేహితులను కూడా దండించి, చింటూని ఇంటికి తీసుకెళ్ళింది కృష్ణవేణి.
''బడికి శెలవులు ఇస్తే చాలు ఆ మురికి వెధవలతో జత కూడడం బజారుకు వెళ్ళడం చేస్తావు. వాళ్ళు పేదవాళ్ళు అలాంటి వాళ్ళతో స్నేహం తగదు ఇంకోసారి వెళ్ళావా దెబ్బలు పడతాయి'' అంటూ చింటూ మీద కోప్పడింది కృష్ణవేణి. ''వాళ్ళు పేదవాళ్ళైనా చాలా మంచివాళ్ళమ్మా. నాకు ఒకసారి దెబ్బ తగిలితే ఏడ్చారు పాపం, నాకు తోడుగా వుంటారు అమ్మ'' అన్నాడు చింటూ. ''నీకు తగిన వాళ్ళని తోడుగా పెట్టుకో. వాళ్ళు సరిగ్గా స్నానం కూడా చేయరు అలాంటి వాళ్లు జత పడితే నీ ఆరోగ్యం కూడా చెడి పోతుంది'' అంది కృష్ణవేణి.
తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా చెప్పినా చింటూకు ఆటలపై ఉన్న ఆసక్తి తనను ఇంట్లో వుండనీయడం లేదు, మరుసటి రోజు కూడా తోటి స్నేహితులతో కలిసి బడి ప్రాంగణంలో క్రికెట్ ఆడడం కోసం వెళ్ళాడు, ఈసారి చింటూను తన తండ్రి శ్రీనివాసులు వెతుక్కుంటూ వెళ్ళాడు, మట్టిలో ఆడుకుంటున్న కుమారున్ని చూడగానే శ్రీనివాసులుకి కోపం వచ్చింది నేరుగా ఇంటి మేడపైకి తీసుకు వెళ్ళాడు '' పక్కింటి పిల్లలు చూడు వాళ్ళ జతలు ఎంత ఉన్నతంగా వుంటాయో, నీలాగా చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో దుమ్ముపట్టిపోయిన ఒళ్ళుతో వున్న చింపిరిగాళ్ళ జత పట్టరు. ఇక వెళ్ళకు'' అన్నాడు శ్రీనివాసులు. '' వెళ్ళను నాన్న'' అన్నాడు చింటూ.''ఇక నుంచి జాగ్రత్తగా వుండు'' అంటూ లోపలికి నడిచాడు శ్రీనివాసులు.
అమ్మ నాన్న చెప్పిన మాటలు చింటూకు పదేపదే గుర్తుకు వచ్చాయి, ఆ రోజు నుంచి చింటూలో మౌనం నిండిపోయింది '' అమ్మ నాన్న చెప్పినట్టు నడుచుకుంటే మంచి స్నేహితుల్ని పోగొట్టుకుంటాను ఆస్థి అంతస్తు చూస్తున్నారు గానీ వారి గుణం చూడలేదు. అమ్మ నాన్న ఎప్పుడు మారుతారో ఏమో'' అని మనసులో అనుకొని బాధ పడ్డాడు.
ఆ రోజు నుంచి చింటూ సరిగా అన్నం తినలేదు, చురుగ్గా కనిపించలేదు, కృష్ణవేణి కొడుకుని చాలా సార్లు అడిగింది, అయినా చింటూ మౌనంగానే ఉన్నాడు, శ్రీనివాసులు తన ప్రతి పుట్టినరోజుకు చింటూ అడిగింది కొనిచ్చేవాడు ఆ రోజు రానే వచ్చింది ''చింటూ నేను బయటికి వెళుతున్నాను నీకు ఏమి కావాలో చెప్పు కొని తెస్తాను'' అన్నాడు శ్రీనివాసులు. చింటూ ఆలోచించాడు ''మా నాన్న, పరుల కోసం, పైసా కూడా ఖర్చు పెట్టే మనిషి కాడు బాగా డబ్బు ఉంది కానీ సహాయం చేసే గుణం లేదు'' అనుకుంటూ ఎలా గైనా సరే నాన్నతో విషయం చెప్పాలని అనుకున్నాడు.
''నాన్న నా స్నేహితులు చాలా పేదవాళ్ళు, కూలి చేస్తే గానీ పూట గడవదు వేసుకోవడానికి బట్టలు సరిగా ఉండవు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ల తల్లిదండ్రులకు కూడా బాధ ఉంటుంది కదా నాన్న, ఈ సారి నా కోసం ఏమి వద్దు నా స్నేహితులకు బట్టలు తీయించు. ఖర్చులకు కాస్త డబ్బులివ్వు వాళ్లు మన లాగా మేడలో లేరు నువ్వు నాకు ఇచ్చే కానుక, వాళ్లకు సహాయంగా ఇద్దాము పాపం పేదవాళ్ళు నాన్న'' అని చింటూ బాధగా అంటుంటే శ్రీనివాసులు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, కొడుకు మంచి మనసుని మెచ్చుకుని చాలా సంతోష పడ్డాడు. ''సరే పదా'' అనగానే చింటూ ఎగిరి గంతేసాడు.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636