Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక అడవిలో కుందేలు తన పిల్లలతో జీవనం సాగించేది. అయితే పిల్ల కుందేళ్ళలో ఒక గడుగ్గాయి ఉంది. దానికి అడవిలో తనను మించిన అందగాళ్ళు లేరనే అహంభావం ఉండేది. ఏ జంతువన్నా తారసపడితే నా రంగు చూడు ... ఎంత తెల్లగా ఉన్నానో ... నువ్వేంటి నీ రంగేమిటి ? అని వెటకారంగా మాట్లాడేది. అలాగే మీకు అంత పెద్దపెద్ద ఆకారాలు దేనికి ? నాలాగే అందంగా ... సుకుమారంగా ఉండలేరా అని వేళాకోళం చేసేది. పాపం జంతువులన్నీ గడుగ్గాయి కుందేలు మాటలకు బాధపడేవి. ఏమన్నా అందామంటే అది చిన్నది. చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు. తల్లి కుందేలు కూడా పిల్ల కుందేలు మాటలకు జంతువులు నొచ్చుకోవటం విన్నది. మా గడుగ్గాయి మాటలు పట్టించుకోకండి... చిన్నది ఏదో మాట్లాడింది... తెలిసీతెలియని వయస్సు .. దానికి బుద్ధి చెబుతాను .. మీరు మనస్సులో ఏం పెట్టుకోవద్దు అని సర్దిచెప్పేది. రోజురోజుకూ జంతువులను తక్కువ చేసి మాట్లాడటం గడుగ్గాయి మానలేదు. ఒకరోజు అడవిలో ఎలుగుబంటి తారసపడితే ఏంటి ఎలుగు మామా నల్లగా ఉన్నావు ? అసలు నువ్వు చీకట్లో కనపడతావా అని హేళనగా మాట్లాడింది. పాపం ఎలుగుబంటి మొహంలో నెత్తురుచుక్క లేదు. మరోరోజు ఏనుగు కనపడితే ఏనుగు మామా నీ చెవులేంటి ? చేటల్లా ఉన్నాయి .. కాళ్ళు కూడా చెట్ల మానంత లావుగా ఉన్నాయి ... తొండం ఊపకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవా అని ప్రశ్నించింది. అలాగే జిరాఫీని నీ వంటిపై గీతలేంటి ? మెడ పొడవుగా ఆకాశం వైపు చూస్తుంటే నువ్వు అడవిలో ఎందుకు తిరుగుతున్నావు అని వేళాకోళం చేసింది. కాకులు కనపడితే మీ రంగేమిటి ? మీ గొంతేమిటి ? అని వెటకారం చేసేది. చివరకు జంతువులు గడుగ్గాయి ముందుకు రావాలంటే భయపడేవి. తల్లి కుందేలు నోటి దురుసు తగ్గించుకోవాలని ఎన్ని హితవచనాలు చెప్పినా గడుగ్గాయి లెక్కచేసేది కాదు. చివరకు అడవి జంతువులు కూడా దాని మాటలు ఒక చెవితో విని మరో చెవితో వదిలేయటం అలవాటు చేసుకున్నాయి. ఒకరోజు అడవిలోకి వేటగాళ్ళు ప్రవేశించారు. వారి రాకతో అడవంతా నిశ్శబ్ధంగా మారింది. జంతువులు వేటగాళ్ళ రాకను గమనించి సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకున్నాయి. అయితే గడుగ్గాయి కుందేలుకు వేటగాళ్ళు వచ్చినట్టు తెలియదు. అది ఎప్పటి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వచ్చింది. తల్లి కుందేలు చీకటిలో బయటకు పోవద్దని చెప్పినా వినకుండా బయలుదేరింది. అలా నడుస్తున్న గడుగ్గాయికి దారిలో ఒక్క జంతువు కూడా కనపడలేదు. అయినా ముందుకు సాగింది. కొద్ది దూరం పోయాక దానికి మనుష్యుల మాటలు వినపడసాగాయి. వారి మాటలు వినగా వచ్చిన వారు వేటగాళ్ళని అర్థం చేసుకుంది. దాని వెన్నులో వణుకు మొదలైంది. వారి కంట్లో పడితే తప్పించుకోవటం కష్టం. ఇంతలో వేటగాళ్ళలో ఒకడు గడుగ్గాయి కుందేలును గుర్తించాడు. అందరూ గడుగ్గాయి వైపు రాసాగారు. దానికి ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. చుట్టూ ఉచ్చు బిగించారు. వేటగాళ్ళలో ఒకడు ఈ కుందేలు మన నుంచి తప్పించుకోలేదు. తెల్లగా ఉంది ... చీకట్లో కళ్ళు మెరుస్తున్నాయి. ఏ మూల దాక్కున్నా కనపడుతుంది. దాని రంగే మనకు పట్టిస్తుంది. ఈ రాత్రి హాయిగా కుందేలును చంపి కాల్చుకు తిందాం అన్నాడు. మిగతా వారు తల ఊపారు. ఆ మాటలు విన్న గడుగ్గాయి ప్రాణాలు పైపైనే పోయాయి. ఆ క్షణంలో దానికి తన రంగు మీద అసహ్యం వేసింది. చివరకు తాను ఎంతగా ప్రేమించే తన రంగే చీకట్లో తనను వేటగాళ్ళకు పట్టివ్వ బోతుంది. తన రంగు చూసుకుని మిగతా జంతువులను చులకనగా చూసిందీ... హేళనగా మాట్లాడింది గుర్తుకువచ్చింది. వాటన్నింటికీ మనస్సులోనే క్షమాపణలు చెప్పుకుంది. జంతువులను మాటలతో హింసించిన తనకు వేటగాళ్ళ చేతిలో చావే సరైన శిక్షగా భావించింది. వేటగాళ్ళ దృష్టి నుంచి తప్పించుకునేందుకు గడుగ్గాయి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతూనే ఉంది. వేటగాళ్ళు తనను బంధించేందుకు ముందుకు రావటంతో గడుగ్గాయి చీకట్లో ఎగిరి చెట్ల పక్కకు దూకింది. చీకట్లో ఏమీ కనపడక పోవటంతో పాపం అది పక్కనే ఉన్న బురదగుంతలో పడింది. దాంట్లో పడగానే గడుగ్గాయి రంగు మారిపోయింది. ఒంటికి బురద అంటుకోవటంతో తెలుపు పోయి నలుపు రంగులోకి మారింది. చీకట్లో గడుగ్గాయి కుందేలు రంగు మారటంతో వేటగాళ్ళకు అది కనపడటం లేదు.వేటగాళ్ళు గడుగ్గాయి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. గడుగ్గాయి ఒక్క ఉదుటన వారి నుంచి తప్పించుకుని తల్లి చెంతకు చేరుకుంది. తల్లిని కౌగిలించుకుని బోరున విలపించింది. అసలు రంగు తెలుపు తనను వేటగాళ్ళకు పట్టివ్వబోతే బురదరంగు నలుపు రక్షించింది. ఆ క్షణంలో జంతు వుల పట్ల తాను ఎంత అమర్యాదగా ప్రవర్తించింది గుర్తుచేసుకుని తల్లితో చెప్పింది. రేపు ఉదయాన్నే జంతువులను కలిసి క్షమాపణ కోరుతానంది. గడుగ్గాయిలో వచ్చిన మార్పుకు తల్లి సంతోషిం చింది.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100.