Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య మగరాజు రక రకాలుగా దుస్తులు వేసుకుని హోయలు పోతూ ఉంది. ఒక రోజు అందంగా సింగారించుకుని '' ఈ వేషం ఎలా ఉంది'' అని తోటి జంతువులను అడిగింది. దానికి ఓ దుప్పి ''ఈ వేషంలో మెరిసిపోతున్నావ్, మెడకు ఉన్న ఆ టై నీకు కొత్త అందాన్నిస్తోంది బాగుంది''. అనగానే సింహం ముసి, మూసిగా నవ్వుతూ జంతువుల వైపు చూసింది. అవి ''అన్నా బాగుంది ఈ వేషధారణ'' అన్నాయి ముక్తకంఠంతో. జంతువులు అన్నీ సింహం వస్త్రధారణను చూసి మెచ్చు కుంటుంటే సహజంగా నచ్చని నక్క మనసులో, ఏం బాగుంది చూస్తూనే వాంతి వస్తోంది. నల్లటి ఆ దుస్తులలో నిజంగా దెయ్యంలా ఉంది. అదేమో టక్కు చేసుకుని ఊగిపోతూ కులుకుతూ ఉంది. దాని నడక అదీను. దీనికి నా వస్త్రధారణ తోనే దుమ్ము దులపాలని నిర్ణయిం చుకుంది. నక్క సింహాన్ని ఉద్దేశించి ''ఈరోజు మీ వేషం, అదే మీ వస్త్రధారణ బాగుంది. రేపు అదిరి పోయేలా మంచి వేషం వేసుకురండి '' అంది. దానికి జంతువులు అన్ని తలూపి ''అవును రేపు మీ వేషం చూసి అడవంతా పులకించాలి'' అన్నాయి. దానికి సింహం ''రేపు మీకు మంచి విందు కూడా ఉంటుంది. ఎలాగూ నా పుట్టినరోజు రేపే అన్నీ కలసి వచ్చాయి '' అంది.
ఆ మరుసటి రోజు సింహం మల్లెపువ్వులా తెల్లని చొక్క,తెల్ల ప్యాంటు టక్ చేసి, చొక్కాకు ఓ ఎర్రటి గులాబీ పువ్వు పెట్టుకుని, కాళ్లకు నల్లని బూట్లు వేసుకుని, చేతిలో ఓ కర్ర ఊపుకుంటూ, టక్, టక్ మని శబ్దం చేస్తూ వస్తోంది. ఆ శబ్దం చూసి నక్క దానికి మించి అదిరిపోయేలా నేను కూడా ఓ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకుంది. సింహం టక్ చేసుకుని వస్తుంటే జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. ''నీకు టక్ భలే గుంది. దానికి తోడు నీ నడక టక్కు టమారంలా ఉంది హ్యాపీ బర్త్ డే'' అంటూ పొగిడాయి. సింహం నవ్వుతూ ''థాంక్యూ'' అని ప్రతి దాని దగ్గరకు పోయి షేక్ హ్యాండ్ తీసుకుంటోంది. ఇంతలో దూరం నుంచి ఎదో ధూళి పొగలా రేగడం, ఓ ఊల వినపడటంతో జంతువులన్నీ ఆ దుమ్ము వస్తున్న వైపు చూడసాగాయి. దుమ్ము దట్టంగా కమ్ముకుంటోంది. జంతువులు పరిశీలనగా చూశాయి. దుమ్ము రేగుతుండగా నక్క వారికి కనిపించింది. బొమ్మల, బొమ్మల చొక్క, గళ్ళ లుంగీ, నల్ల అద్దాలు, కాళ్ళకు పెద్ద చెప్పులతో దుమ్ము రేపుకుంటూ వస్తోంది. దాన్ని చూడగానే జంతువులు లోలోపల జోకర్ వస్తోంది అని నసిగాయి. సింహం మాత్రం ''నక్క బావ దుమ్ము దుమారం లేపావే'' అంది. నక్క అది వినగానే ''నువ్వు టక్కు టమారం మాదిరి అలంకరించుకున్నావు, ఆ మాత్రం నీకు ధీటుగా నేను వుండొద్దు. నువ్వు టమారం అయితే, నేను దుమారంను'' అంది. ఆ మాటకు జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.
''నిజంగా జోకర్లా ఉన్నాడు'' అనుకున్నాయి. ఎలుగుబంటి సింహం, నక్క వంక చూస్తూ ''మీ ఇద్దరి అందం ఈ అడవికే సొంతం. మీరు ఒకరు టమారం, మరొకరు దుమారం బాగా ఉన్నారు. ఈ శుభ సమయంలో మాకు ఏదయినా విందు, మందు ఏర్పాటు చేయండి'' అనగానే సింహం ''ఓ ఎవరికి ఇష్టమైనవి వారికి నా గుహలో ఏర్పాటు చేశాను'' అంది. దానికి నక్క ''నేను మీ వెంటే పదండి'' అంది దుమ్ము లేపుతూ.
- కనుమ ఎల్లారెడ్డి