Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్ను చూసిన క్షణం నా అక్షరాలు
గగనానికెగిరే పక్షులౌతున్నాయి
నీకై పారేందుకు నా భావనదులు సిద్ధమౌతున్నాయి
అక్షర తూపులపై అగ్నిముద్దలద్దే నా కలం,
నిన్ను చూడగానే మంచుముద్దై
శరత్కాల చంద్రికౌతుంది
నైరాశ్యపు చీకట్లో కొట్టుకుపోయే
నా ఆలోచనలకు నీ కాటుక కాంతుల దర్శనభాగ్యం
కవనకాసారంలో విరబూసిన
నిత్య చైతన్య నీలోత్పలమైంది
నీ రాక, నా కవితా కొలిమిని మండించి పసిడి కాంతుల కావ్య నగిషీని ప్రసవించింది
మన బలమైన బంధనాలకు అక్షరగంధం పూసిన రోజులనెలా మర్చిపోగలను
జీవిత నిశీధినీడలో నన్ను నిటారుగా నిలబెట్టిన వెన్నెముకను మర్చిపోగలనా!
నీ కళ్ళ వెలుగు నాపై ప్రసరించినంత కాలం
నీ మాటల వెల్లువ నాలో ప్రవహించినంత దూరం
నీ హదయపరిమళాలు
నన్ను తాకుతూనే ఉంటాయి
నన్ను కొత్తగా మొలకెత్తిస్తూనే ఉంటాయి
- డా.బూర్ల చంద్రశేఖర్
9849582926