Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశం అంచులు చూస్తాను
మబ్బుల్లో గిరికీలు కొడతాను
రంగురంగుల హంగులన్నీ నాకే సొంతం
రకరకాల రూపాలన్నీ నాకే సాంతం
అల్లరి అంతా నాదే అయినా
ఆధారం వేరే ఉంది
సంబరం అంతా నాదే అయినా
భారం తనదై ఉంది
సందేశాలు, సంకేతాలు
ఇవ్వడంలో నేనే మేటి
పండుగలు, పబ్బాలలో
నాతో నేనే పోటీ
నా దుడుకుకు చీలిన
మేఘాలు ఎన్నో
రెక్కలు తెగిన
విహంగాలు మరెన్నో
అంబరం అంతా నాదేనని
సంబరం నా సొంతమని
నేల విడిచి సాముచేసిననాడు
తల తెగి చెట్టుకో, పుట్టకో
వేలాడుతూ దిష్టి పీడతలా
మిగిలిపోతా!
ఆధారాన్ని వదులుకుని
అవకాశాన్ని తన్నుకుంటే
ఏమవుతుందో చెప్పే
ఉదాహరణగా ఉండిపోతా!
ఎగిరికిందపడ్డ గర్వానికి
తార్కాణంగా నిలిచిపోతా!
మిడిసిపడ్డ జీవితానికి
నీతి కథలా చెప్పుకుపోతా!
- ఉషారం
9553875577