Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊళ్ళో చిట్టి దుకాణం
చిన్నటి చెక్కగదిలో
అమరిన చిరు ప్రపంచం!
ఊరోళ్లకు వాణిజ్య కేంద్రం!
గోలీ షోడాతో మొదలయి
గోల్డ్ ఫ్లేక్తో అంతమయి
దాహం తీర్చి, దమ్ము వేసే
ఊళ్ళో కాలక్షేపపు జాగా!
చీట్లపేకలు, బ్రాకెట్ అంకెలు
చీకట్లో వారుణ వాహిణీలు
కారా కిళ్ళీలు, గుట్కా పొట్లాలు
అన్నీ దొరికే అంగడి గదుళ్లు!
పేలపు ఉండలు, పప్పుబెల్లాలు
పతంగులు, గాలి బుడగలు
చిరుతిళ్ళకు కోశాగారం!
చిన్ని సరదాల కర్మాగారం!
సమభాగం చేసిన టీ చుక్క
సమంగా పంచిన బీడీపీక
కూర్చొటానికి చెక్క బల్లా
కొంటె కుర్రాళ్లకు అదో అడ్డా!
గోడ పత్రికలన్నీ వెలిసేవి
దిన పత్రికలన్నీ వెళ్ళాడేవి
సమాచారమూ అక్కడే!
సమ్మేళనమూ అక్కడే!
అడపాదడపా అక్రమాలు
చాటుమాటు వ్యవహారాలు
ఏం చేసినా పొట్టకూటికే!
ఏమయినా కుటుంబ పోషణకే!
చిన్ననాటి జ్ఞాపకం
చిట్టి విషయాల వ్యాపకం
కాలగమనంలో కొన్ని చిక్కిపోతే
కొన్ని చోట్ల క్షయమయ్యాయి
- ఉషారం,
9553875577