Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘాల పయనం ఎటు సాగుతున్నా
జలపాతం జారి పడవలసిందే,
గాలుల గమనం ఎటు సాగుతున్నా
పరిమళం ఎద చేరవలసిందే!
గుప్పెడంత మట్టినవ్వు చాలు
గుండెగాయం పైపైకి ఎగిరిపోడానికి,
చిన్ని చినుకుమాట చాలు
బతుకుమొక్క పైపైకి చిగురించడానికి!
అనంతమైన విశ్వంలో
ఒక్క చూపుచుక్క చాలు
ఇంద్రధనుస్సు వెల్లివిరియడానికి,
దట్టమైన చీకటిలో
ఒక్క వెలుగురెక్క చాలు
వెన్నెలజల్లు కురవడానికి!
నీవు వెలుగై నాపై వాలగానే
నీడనై చల్లగా పరుచుకుంటాను,
ఎడబాటుముల్లు గుచ్చుకున్నా
గులాబీలా విరబూస్తుంటాను!
మాటలన్నీ నీ ఎదుట సమాధులౌతున్నా
అక్షరాలై నీవెంట పరుగు తీస్తుంటాను,
నీ పెదవుల మౌన కదలికలతోనే
నా పదముల ప్రాణం నిలుపుకుంటాను!
- పుట్టి గిరిధర్,
9491493170