Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రపంచంలో గొప్ప కవులు ఎందరున్నా, గాలిబ్ యొక్క భావ వ్యక్తీకరణ ధోరణి అపూర్వమైనదని అంటారు'' అని స్వయంగా తన కావ్య పటిమను ప్రకటించుకున్న ఉర్దూ మహాకవి మీర్జా గాలిబ్ అసలు పేరు మీర్జా అసదుల్లా బైగ్ ఖాన్. 1797 డిసెంబర్ 27న ఆగ్రాలో జన్మించిన గాలిబ్, తరువాత ఢిల్లీకి వలస వచ్చి, తన జీవితకాలాన్ని మొత్తం ఇక్కడే గడిపాడు. గాలిబ్ ప్రాథమిక విద్యనభ్యసించలేదు. కాని ముల్లా అబ్దుసమ్మద్ నుంచి అరబ్బీ, ఫారసీ, తర్కం, తత్త్వం మొదలైన శాస్త్రాలను నేర్చుకున్నాడు. గాలిబ్ గొప్ప కవియే కాదు. మంచి రచయిత, విమర్శకుడు కూడా. ఎన్నో వ్యాసాలు, లేఖలు చాలా చక్కగా రాసాడని ప్రముఖ విమర్శకులు పేర్కొన్నారు. గజళ్ళ దీవాన్తో పాటుగా తైఫ్ు-ఎ-తైజ్, ఖతా-ఎ-బురాÛన్ మొదలైన గ్రంథాలతో పాటు వివిధ కవితా ప్రక్రియలు, గద్య ప్రక్రియలు ఇలా ఎన్నో రాసాడు. గాలిబ్ యొక్క ఫారసీ రచనలు ఉర్దూ రచనల కంటే ఎక్కువే అయినప్పటికీ తన కావ్య ప్రశస్తి ఉర్దూలోనే ఎక్కువగా గోచరిస్తుంది. నజ్ముద్దౌలా, దబీర్-ఉల్-ముల్క్, నిజాం జంగ్, మీర్జా నౌషా లాంటి బిరుదులను కైవసం చేసుకున్న మీర్జా అసదుల్లా బైగ్ ఖాన్, తీవ్ర అనారోగ్యం వల్ల 15 ఫిబ్రవరి 1869న ఢిల్లీలో తన చివరి శ్వాసను విడిచాడు.
మూలం...
కోయీ ఉమ్మీద్ భర్ నహీ ఆతీ
కోయీ సూరత్ నజర్ నహీ ఆతీ
మౌత్ కా ఏక్ దిన్ ముఅయ్యన్ హై
నీంద్ క్యూ రాత్ భర్ నహీ ఆతీ
ఆగే ఆతీ థీ హాల్-ఎ-దిల్ పే హంసీ
అబ్ కిసీ బాత్ పర్ నహీ ఆతీ
జాన్తా హూ సవాబ్-ఎ-తాఅత్-ఒ-జొహద్
పర్ తబియత్ ఇధర్ నహీ ఆతీ
హమ్ వహా హై జహా సే హమ్ కో భీ
కుఛ్ హమారీ ఖబర్ నహీ ఆతీ
మర్తే హై ఆర్జూ మే మర్నే కీ
మౌత్ ఆతీ పర్ నహీ ఆతీ
కాబా కిస్ మూ హ్ సే జాఓగే గాలిబ్
శరమ్ తుమ్ కో మగర్ నహీ ఆతీ
అనువాదం...
మనసునింపే నమ్మిక ఒకటి కూడ రాదసలే
కనులముందు ఏ ఒక్కరి ముఖం కూడ రాదసలే.
మరణానికి ఒక రోజు నిశ్చయమై ఉన్నది
అయినకాని రేయినిండ నిదురెందుకో రాదసలే.
ఒకనాడు గుండె ప్రతిలయలోనూ నవ్వుండేది
ఇపుడైతే దేనిపైన కూడా నవ్వనేది రాదసలే.
భక్తి, వినయం రెండూ తెలుసు నాకు
కాని మనసు నాది ఇటువైపుకు రాదసలే.
నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ నుండి,
నాకు నా గురించి కొంత కబురైనా రాదసలే.
మరణించడానికని ప్రతి ప్రార్థనలో మరణిస్తాను
మరణం వచ్చినట్టే వస్తుంది కాని అది రాదసలే.
కాబాకు ఏ మొహం పెట్టుకొని వెళ్తావు 'గాలిబ్'
సిగ్గన్నది నీకెన్నడు రాదసలే.
గాలిబ్ గజళ్ళలో ప్రేమ, విరహం, విషాదం, తత్త్వం, తర్కంతో కూడిన పరిహాసం మొదలైన భావాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. బుద్ధి చాతుర్యంలో తనకు తానే సాటి అయిన గాలిబ్, ఏది చెప్పాలనుకున్న తనదైన శైలిలో ఆకర్షణీయంగా చెప్పేవాడని గాలిబ్ సమకాలికులు, తనని అభిమానించేవారు అభిప్రాయ పడుతుంటారు. గాలిబ్ రాసిన ఈ గజల్ నిరాశ , విచారం ప్రధాన నేపథ్యాలుగా సాగింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం, తొమ్మిదేండ్లలోనే తన పినతండ్రి కూడా మరణించడం, చిన్న వయస్సులోనే పెళ్ళవ్వడం, పుట్టిన ఏడుగురు సంతానం, నడక నేర్వకమునుపే మరణించడం, ఇలా ఎన్నో బాధలను అనుభవించిన గాలిబ్, వాటినే తన కవితా వస్తువుగా మలచుకొని కవిత్వం అల్లాడు. మరణాన్ని గురించి రెండు షేర్లలో ఇందులో ప్రస్తావించాడు. మరణం వస్తుందని తెలిసినా రాత్రికి నిదురెందుకు రాదని ప్రశ్నించుకుంటాడు. అంటే రాతిరంతా ప్రతికూల ఆలోచనలతో కఠినంగా గడుస్తుందని ఇక్కడ భావం. గాలిబ్ మనసులో జీవితంపైన గాఢమైన విముఖత చోటుచేసుకుంది. అందుకే తను చెప్పిన ఆ నిశ్చయమై ఉన్న మరణాన్ని తన ప్రార్థనలో కోరుకుంటానని అంటాడు. గాలిబ్ ని ఆవరించిన దుఃఖాలు ఎంతో భారమైనవి. అందుకే వాటిని మరణంతో పోల్చాడు. కాని ఎంత భారమైన దుఃఖం కూడా శాశ్వతం కాదు. కాబట్టే మరణం వచ్చినట్టే వస్తుంది కాని రాదని అంటాడు. అంటే దుఃఖం సమసిపోతుంది. గాలిబ్ జీవితమంతా మద్యం తాగడం, జూదం ఆడడం, చట్టాలను అతిక్రమించడంతోనే సరిపోయింది. ఇంకా కాబాకి ఎలా వెళ్తావని తనను తాను నిందించుకుంటాడు. ఇక్కడే గాలిబ్ వ్యక్తిత్వంలోని చెక్కుచెదరని నిజాయితీ కనిపిస్తుంది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
సెల్ : 9441002256