Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వట్టి చాపలెండినట్లు
ఎండిన నేలను చూసి
వానోవరుపోనంటూ రైతు
వలవల వడ్పవట్టే
వలపోతదీర్చా కుండపోతై
నైరుతి దారులెంట ధారలై
మృగశిరకార్తె ముంగటవడంగ
వానలతో నేల పూటపండోలేనాని
మట్టివాసనలతో పరిమళిస్తూ
చల్లని మునిమాపు గాలై
వానాకాలం సాగు ఆశలు వీస్తున్నాయి
సాగుతో కష్టమైనా నష్టమైనా
మంట్లగలిసే మట్టిమనిషి బతుకెప్పుడు
మన్నుతోనే సావుమర్నమవుతూ
సాలు సాలుకు సాగువాటవుతుంది
మొలకెత్తిన ఆశలు ఎదుగుతుంటే
చిదిమేసే చీడపీడలు
పెట్టుబడి అప్పులు
పట్టెడన్నం తిప్పలు
ఎట్లయితే గట్లాయె
ఉపవాసముంటే అప్పుతీరది
ఊపిరివడితే బొర్రనిండదనీ
రాబడి బట్టపొట్టకైనా
పగడమంతయిన తడబడక
దున్నకం మొదలెట్టిండ్రు
కర్రుసందు నాగలి సందు యిరికినట్లు
అయితేనేం
నకిలీవిత్తనాలతో నట్టేట ముంచుడు
ఎరువులకొరత కోరలుచాచి
బుసలుకొడుతు
కాంటాల కపటంతో
ధరల దగాతో
నాణ్యత నాటకంతో
అన్నంబెట్టినోనికి సున్నం బెట్టుడు
సకులంలోకానికి సాగివస్తుంది.
- జినుకల వెంకటేష్
సెల్: 9652092120