Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి మనిషిగా బతకాలంటే కవులు
కూడా కొంత కారణం కావాలి. కవులకు
సామాజిక బాధ్యత ఉండాలి. కవులెప్పుడూ
ప్రజాలవైపే ఉండాలి. సమాజంలో జరిగే
ప్రతి అన్యాయాన్ని ప్రజల మాటగా కవి
చెప్పాలి. మార్పునకు దోహదపడాలి.
అందుకే నా కవిత్వం ఎక్కువగా సామాజిక
అంశాలచుట్టే తిరుగుతుంది.
ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇటిక్యాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మహబూబ్ నగర్లో నివాసం.
మీరు కవిత్వం వైపుకు మళ్ళడానికి కారణం?
నేను పాలెం శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో డిగ్రీ చదివాను. అక్కడి వాతావరణం, గురువుల ప్రభావమే నన్ను కవిత్వం వైపు నడిపించింది. అప్పటి నుండే రాయడం మొదలు పెట్టాను.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలిశాయి కదా! నానీలనే ఎందుకు ఎంచుకున్నారు?
నానీల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలు మిగతా ప్రక్రియల్లో కనబడవు అనిపిస్తుంది. ఆ మెరుపు ఇందులో ఉంది. నిజానికి నేను వచన కవిత్వమే ఎక్కువగా రాశాను. అప్పుడప్పుడు కొన్ని నానీలు రాశాను. నానీల సృష్టికర్త డా. ఎన్. గోపి సర్ నాకు పి.జి.లో గురువు గారు. నా నానీలు చూసి బాగున్నాయి, పుస్తకం వేద్దామన్నారు. అలా ''పుట్టెడు నానీలు'' ముందుగా వచ్చింది.
నానీల ప్రక్రియ వల్ల మీ భావపరిధి తగ్గినట్లు అనిపించలేదా?
లేదు. కవిత్వం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. కొన్ని విషయాలు కొన్ని వాక్యాల్లో చెబితేనే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వాటిని నానీలుగా రాయడం జరిగింది. పాఠకులను కూడా ఎంతో ఆకట్టుకుంది.
ప్రఖ్యాత చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ గారు వేసిన బొమ్మలు మీ నానీలకు ఎట్లా ఉపయోగపడ్డాయి?
కూరెళ్ళ గారు నానీలకు గొప్ప చిత్రాలు వేశారు. ఒక్కోసారి అన్నిటికీ అవసరం లేకపోయినా కొన్నింటికి బొమ్మలతో బాటుగా కవిత్వం ఉంటే పాఠకులకు మరింత ఆకట్టుకుంటుంది. కవిత చదివాక అక్కడే అదే భావంలో పాఠకుడు కొద్దిసేపు ఉండిపోతాడు.
నానీల కంటే ముందు మీరు వచనకవితలు చాలానే రాశారు. పుస్తక రూపంలో ఎందుకు తేలేదు?
కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లు నా వచనకవితా పుస్తకాలు రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ వేరే కారణాలు. కానీ గోపీ సార్ సూచన మేరకు మొదట నానీల పుస్తకం తెచ్చాను. ఆలస్యమైనా తొందరలోనే వచనకవితల పుస్తకాన్ని ప్రచురిస్తాను.
మీ కవితలలో ఆవేశమే ఎక్కువగా ఉంది, ఎందుకంటారు?
భావావేశం కవికి తప్పనిసరి. దాన్ని వ్యక్తపరచడంలో అతని శక్తి తెలుస్తుంది. పాఠకుల మనసులోకి చేరాలంటే ఆమాత్రం భావావేశం ఉండాలంటాను. నిజానికి అసలు ఆవేశం కంటే అక్షరాల్లో కాస్త తగ్గించే రాస్తుంటాను. దానికి మన ఉద్యోగం, మన స్థాయి లాంటి కొన్ని కారణాలు కూడా ఉంటాయి.
మీ కవితల్లో ఎక్కువగా సామాజిక అంశాలనే స్పృశించారు, ఎందుకని?
అవును, ఇప్పుడు మనిషి మనిషిగా బతకాలంటే కవులు కూడా కొంత కారణం కావాలి. కవులకు సామాజిక బాధ్యత ఉండాలి. కవులెప్పుడూ ప్రజాలవైపే ఉండాలి. సమాజంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రజల మాటగా కవి చెప్పాలి. మార్పునకు దోహదపడాలి. అందుకే నా కవిత్వం ఎక్కువగా సామాజిక అంశాలచుట్టే తిరుగుతుంది. అలాగే మానవ సంబంధాల మీద, మనుషులు ఆలోచనా విధానాల మీద, మనుషుల చుట్టూ ఉండే ప్రతి విషయం మీద నా అక్షరాలు కవితలుగా మలచబడ్డాయి.
సమాజానికి మీ కవిత్వం ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నారు?
ప్రజలు ఆయా అంశాల పట్ల స్పందించే విషయాలనే నా స్పందనగా కవిత్వంగా రాస్తాను. అవినీతి, అక్రమాలు, స్వార్థం...లాంటి ఏ అవలక్షణాలైన సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేవే. సమాజానికి చెదలు పట్టించే అటువంటి వాళ్లలో మార్పు తెచ్చే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను.
కవిత్వమే కాకుండా ఇంకా ఏమేమి రాస్తుంటారు, విద్యార్థులను కూడా రచన వైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది, ఎందుకని?
వచనకవిత్వం, నానీలతో బాటు కథలు, సమీక్షలు, వ్యాసాలు కూడా విరివిగా రాస్తుంటాను. నిజానికి నేను మొదట కథకుడిని, కథలు రాయడం చదవటం పట్ల అభిరుచి ఎక్కువ. అనుకోకుండా ఇలా కవిత్వంవైపు తిరిగాను. విద్యార్థులు కూడా సమాజంలో భాగమే కాబట్టి రేపటి సమాజాన్ని ఇప్పటినుండే సరైన దిశలో నడిపించాలంటే చదువుతో బాటు రాయడం, పుస్తకాలు చదవడం కూడా ముఖ్యం. ఏదో ఒకటి రాస్తుంటేనే సమాజం పట్ల అవగాహన, ఆలోచన వస్తుంది. అందుకే వాళ్ళను రచనా వ్యాసంగం వైపు నడిపిస్తుంటాను. పత్రికల్లో వాళ్ళ రచనలు కూడా వస్తుంటాయి.
మీ రాబోయే రచనలు?
వచన కవిత్వం, భావ కవిత్వం, పాలెం నానీలు.
సామాజిక అంశాలపై రాసిన కవిత్వంతోబాటు, ప్రేమ కవిత్వం ప్రత్యేకంగా వెయ్యాలి అనుకుంటున్నాను. అలాగే నేను చదివిన ప్రాచ్య కళాశాల ఇప్పుడు లేదు. అందుకే మా కళాశాల స్మృతి కావ్యంగా పాలెంనానీలు రాయడం జరిగింది.
కవిగా మీ గురించి రెండే రెండు మాటలు చెప్పండి?
అటు వృత్తిని గౌరవిస్తూ, ఇటు సామాజిక బాధ్యతతో, నిబద్ధతతో కవిత్వం రాయడమే నా కర్తవ్యం.
-నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం