Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెన్నెల రాత్రి ఈ గజల్ కి సన్నివేశం. ఈ గజల్లోని వాతావరణాన్ని మఖ్దూం ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, తన మనోహరమైన భావుకతతో ఆహా అనిపించే భావాలను గజలంతా వెదజల్లాడు.
మూలం :
ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్
చశ్మ్-ఎ-నమ్ ముస్కురాతీ ఆతీ రహీ రాత్ భర్
రాత్ భర్ దర్ద్ కీ శమా జల్తీ రహీ
ఘమ్ కీ లౌ తర్తరాతీ రహీ రాత్ భర్
బంసురీ కీ సురీలీ సుహానీ సదా
యాద్ బన్ బన్ కే ఆతీ రహీ రాత్ భర్
యాద్ కే చాంద్ దిల్ మే ఉతర్తే రహే
చాంద్నీ జగ్మగాతీ రహీ రాత్ భర్
కోయీ దీవానా గలియోం మే ఫిర్తా రహా
కోయీ ఆవాజ్ ఆతీ రహీ రాత్ భర్
అనువాదం :
నీ తలపే ఛేదిస్తూ ఉన్నదిలే రాతిరంత
తడికన్నులు నవ్వేస్తూ ఉన్నవిలే రాతిరంత
బాధ యొక్క కొవ్వొత్తి వెలుగుతూనె ఉండినది
దిగులువెలుగు వణికేస్తూ ఉన్నదిలే రాతిరంత
తనువంతా తడిసిపోయె శ్రావ్యమైన మురళిపిలుపు
పదే పదే గుర్తొస్తూ ఉన్నదిలే రాతిరంత
ఎదలో ఉదయించిన జ్ఞాపకాల చందమామ వెన్నెల
మిరుమిట్లను గొలిపిస్తూ ఉన్నదిలే రాతిరంత
ఎవడో ఒక పిచ్చివాడు వీధి తిరుగుతున్నాడు
అరుపేదో వినిపిస్తూ ఉన్నదిలే రాతిరంత
అతను ఎర్రని జ్వాలలు రగిలిస్తాడు. అతను చల్లని వెన్నెల కూడా కురిపిస్తాడు. ఆధునిక ఉర్దూ మహాకవులలో సుప్రసిద్ధుడు, కార్మిక నాయకుడు, కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ తన కవితలతో మానవీయ కాంతిని ప్రభవిస్తాడు. షాయరె ఇంక్విలాబ్ (విప్లవ కవి), షాయరె తెలంగాణ మొదలైన బిరుదల రారాజు మఖ్దూం, 1908 ఫిబ్రవరి 4న నాటి హైదరబాద్ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని అందోల్ లో జన్మించాడు. మఖ్దూం ఒక గొప్ప బహుముఖ కళాకారుడు. గానం, హాస్యం, నటన, నాటక రచన వంటి కళలలో మఖ్దూం అందెవేసిన చేయి. బెర్నార్డ్ షా రాసిన విడోవర్స్ హౌసెస్ అనే నాటకాన్ని అనుసరిస్తూ ఉర్దూలో తాను రాసిన 'హోష్ కే నా ఖూన్' అనే నాటకాన్ని 1934లో హైదరాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించగా, ఆ నాటకం చూసిన విశ్వకవి ఉప్పొంగిన ఆనందంతో ప్రదర్శన అయిపోగానే వేదికపైకి వెళ్ళి మఖ్దూంని అభినందించాడు. సుర్ఖ్ సవేరా (1944), గుల్-ఎ-తర్ (1961), బిసాత్-ఎ-రఖ్స్ (1966) మొదలైనవి మఖ్దూం రచనలు. ఇప్టా (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్), అంజుమన్- ఎ- తరఖ్ఖీ ఉర్దూ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో మఖ్దూం ప్రముఖ పాత్ర పోషించాడు. తాను రాసిన కొన్ని పాటలను, గజళ్ళను బాలీవుడ్ చలనచిత్రాలలో స్వీకరించారు. మఖ్దూం రాసిన విప్లవ కవితలు, గీతాలు ఈనాటి ఉద్యమాలలో కూడా జోరుగా వినిపిస్తాయి. 'యే జంగ్ హై జంగ్-ఎ-ఆజాదీ' అనే గీతం భారత దేశంలోని ఎందరో ఉద్యమ కారులను కదిలించింది. 1969లో తను రాసిన 'బిసాత్-ఎ-రఖ్స్' రచనకు ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. కమ్యూనిస్టుగా మఖ్దూం చేసిన కృషికి స్మారకంగా, హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లో నిర్మించిన సీపీఐ రాష్ట్ర కార్యాల యానికి మఖ్దూం భవన్ అని పేరు పెట్టారు. 4 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన మఖ్దూం, తన తల్లి మరో వివాహం చేసుకోవడంతో పినతండ్రి పెంపకంలో ఎంతో క్రమశిక్షణతో పెరిగాడు. మఖ్దూం మతాన్ని అనుసరించకున్న, మత విశ్వాసాలను గౌరవిం చాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. వాస్తవానికి మఖ్దూం ది విశ్వమానవ దృక్పథం. శ్రమజీవుల వికాసం కోసం కవిత్వాన్ని, విప్లవాన్ని సమర్థ వంతంగా ప్రయోగించిన ఈ మహా సవ్యసాచి, 1969 ఆగష్టు 25న, ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు.
కుతుబ్ షాహీ వంశీయుడు, హైదరాబాద్ నగర నిర్మాతయైన మహమ్మద్ కులీ కుతుబ్ షా చక్రవర్తి, 16వ శతాబ్దంలోనే గజల్ ప్రక్రియకు పునాది వేసాడు. దాదాపు 400 సంవత్సరాల తరువాత, మఖ్దూం ఉర్దూ సాహిత్య చరిత్రలో చారిత్రక మహత్వం కలిగిన దక్కన్ ప్రాంతంలో గజల్ ప్రక్రియకు పూర్వ వైభవం తీసుకొచ్చాడు. మొదట మఖ్దూం నజ్మ్, వచన కవితలు రాసేవాడు. తరువాత మనోహరమైన గజళ్ళు రాసి తన కవిత్వంలోని సత్తాను చాటుకున్నాడు. మఖ్దూం రాసిన 'ఫిర్ ఛిడీ రాత్ బాత్ ఫూలోం కీ', 'ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్' వంటి గజళ్ళు ఎందరో కవితా ప్రియుల మనస్సులను చూరగొన్నాయి. ఈ కాలమ్ లో తీసుకున్న గజెల్ ని 'గుమన్' (1978) చలనచిత్రంలో పాటగా ఉపయోగించారు. ఈ గజెల్, తెలుగు గజెల్ నియమాల ననుసరించి అనువదించ బడింది. వెన్నెల రాత్రి ఈ గజెల్కి సన్నివేశం. ఈ గజెల్్లోని వాతావర ణాన్ని మఖ్దూం ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, తన మనోహరమైన భావుకతతో ఆహా అనిపించే భావాలను గజెలంతా వెదజల్లాడు. శ్రోతలకు ఈ గజెల్ ఒక మ్యాజికల్ మ్యూస్ (వీaస్త్రఱషaశ్రీ ఎబరవ))లాగా గోచరిస్తుంది. ఇందులో మఖ్దూం ప్రయోగించిన భాష ఎంతో సరళమైనది, సహజ సుందరమైనది. సురీలీ సుహానీ సదా అనే పదబంధం కేవలం శ్రావ్యమైన పిలుపు అనే అర్థాన్ని సూచిస్తుంది. మూలంలోని శబ్ద సౌందర్యం, తన్మయత్వం అనువాదంలో కూడా ప్రతిబింబించాలనే ఆశతో 'తనువంతా తడిసిపోయే' అనే పదబంధాన్ని కలిపి ప్రయోగించడం జరిగింది. ప్రేయసి ఆలోచనలు, వేదన మనసును తాకుతున్నా, కవి రాత్రిలోని ఆహ్లాదాన్ని ఎంతో చక్కగా వ్యక్తీకరించాడు. ఇక యాద్ కే చాంద్ దిల్ మే ఉతర్తే రహే అంటే జ్ఞాపకాల చందమామ ఎదలోపల ఉదయిస్తున్నాడన్న వ్యక్తీకరణ, మొత్తం గజెల్లోని అహ్లాదకరమైన వాతావరణానికి ఒక చక్కని ప్రతీకగా నిలుస్తుంది.
నిప్పులు కక్కిన ముఖ్దూం కలం, చల్లని వెన్నెల కురిపించిన తీరును చూస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మఖ్దూం మాత్రమే కాదు, ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) నినాదమిచ్చిన హస్రత్ మోహానీ భావుకత కూడా ఇలానే అని పిస్తుంది. దీనిబట్టి ప్రేమకి, విప్లవానికి ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టనిపిస్తుంది. ప్రియు రాలి కోసం పోరాడడం ప్రేమ అయితే, దేశం యొక్క సామాజిక వికాసం కోసం పోరా డడమే విప్లవం. ప్రణయాన్ని, విప్లవాన్ని ఆకర్షణీయంగా పలికించిన మఖ్దూం కలం, గళం, కవికి ఉండవల్సిన వైవిధ్యమైన దృక్పథానికి, నైపుణ్యానికి చక్కని ఉదాహర ణలుగా చెప్పవచ్చు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
సెల్: 9441002256