Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయానికి సమాజంలో దిష్టిబొమ్మ
సాయంత్రానికి కులుకుల అంగడిబొమ్మ
చూసిన సమాజం
నాలుక పలుకుల్లో
అమ్మతనమే ఉట్టిపడుతుంది,
మనసు దృక్కోణం మాత్రం
ఆడతనాన్ని తడిమిచూస్తుంది
వెలుతురులో ఆమె బరితెగించిన పతిత
చీకటిపడితే వెలుగు జిలుగుల రంగుల వనిత
రోజంతా సమాజంలో అభాగ్యపు ఆడపిల్ల
రాత్రికి మహాజనానికి మరదలు పిల్ల
ఒకడు మెచ్చిన పేరుతో పిలుస్తాడు
ఇంకొకడు నచ్చిన చోట గిల్లిపోతాడు
పేరు మరచిపోయిన అనామిక
ఉనికి కోల్పోయిన అభిసారిక
సంస్కరణలన్నీ గుమ్మం
దగ్గర నిలిచిపోతే
సరసాలన్నీ గదిలో
కొచ్చి మిగిలిపోతే
జీవితపు బరువు మోయటానికి
తనువు పరుపు చేసుకుని
అబద్ధపు సమాజంలో బతకటానికి
తన పరువు పోగొట్టుకుని
చీకట్లో దివ్వెగా వెలిగిపోతూ
చీకటి బతుకుతో బుగ్గైపోతోంది!
- ఉషారం. 955387557