Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా పేరు వెంకట శివ కుమార్ కాకు. మాది నెల్లూరు. నాన్న ప్రయివేట్
ఉద్యోగి. అమ్మ, అక్క, చెల్లి ఇది నా కుటుంబం. పదవ తరగతి వరకు నా చదువంతా నెల్లూరులోనే. డిప్లొమా హైదరాబాద్‌లో చేశాను. తెలుగంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టంతో అనర్గళంగా చదివే వాడిని. క్రియేటివ్‌గా పరిక్షలు రాసే వాడ్ని. దీంతో మా తెలుగు టీచర్‌కు నేను ప్రత్యేకం. స్కూల్లో ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా నేనే ముందుండే వాడ్ని. అలా ఏడవ తరగతి లోనే వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో బహుమతి అందుకున్నాను. అదే సమయంలో నేను వ్రాసిన 'చెకుముఖి' పత్రికలో అచ్చు అయింది. ఇక నా బాల్యంలోనే సినిమాపై ఇష్టం ఏర్పడింది. నెల్లూరు వాళ్లకు సహజంగానే సినిమా అంటే పెద్ద పండగ. నేను చిరంజీవి అభిమానిని. చిరు డాన్స్, ఫైట్సన అంటే చాలా ఇష్టం. ఏడు తరగతిలోనే చిరంజీవి కోసం రెండు కథలు వ్రాసాను. కానీ వారికి ఎట్లా పంపాలో తెలియదు. సినిమా వాళ్ళు హైదరాబాద్ బంజారా హిల్ల్స్లో వుంటారు అని పత్రికల్లో చదివిన గుర్తు. వెంటనే రెండు కవర్లలో రెండు కథలు పెట్టి దాచుకోవడానికి ఇచ్చిన రూపాయితో స్టాంపులు కొని అంటించి దాసరి గారికి, రామానాయుడి గారికి పోస్టు చేశాను. ఆ క్షణం నా ఆనందం చూడాలి. ఆ కథలు ఎక్కడకి చేరాయో అనే సంగతి వదిలేస్తే! నాలో రచయిత వేసిన తొలి తప్పటడుగులు అవే!
నాకు సినిమా అంటే ఇష్టం. నేను రచయితను కావాలి అనే ఆశ. పూణేలో డైరక్షన్ కోర్సు చేస్తే బాగుంటుందని తెలుసుకున్నా..కానీ నేను సినిమాలోకి వెళ్తాను అని చెప్పే ధైర్యం లేదు. అమ్మానాన్నల కోసం ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతిలో ఇంజనీరింగ్ చేసాను. ఇంజనీరింగ్‌లో వుండగానే బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక అందరిలాగానే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అయిదేళ్లు చేశాను.
ఆ సమయంలో ఆర్కుట్, ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక డైరెక్టర్ రచయితగా ఛాన్స్ ఇస్తాను అని చెప్పడంతో ఆనందంతో హైదరాబాద్ వచ్చాను. అన్నాడు. అప్పుడు గాల్లో తెలినంత ఆనందం. అలా వీకెండ్స్ హైదరాబాద్ రావడం సినిమా ఆఫీసుకి వెళ్ళడం. ఒక సినిమా ఆఫీసు సెటప్. ఆర్టిస్ట్ ఛాన్స్‌ల కోసం వచ్చే వాళ్ళు. అస్సిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్‌ల కోసం వచ్చే వాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్లు , సింగర్లు. డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ మధ్యలో నాతో స్టోరీ డిస్కషన్ చేస్తూ. ఆ వాతావరణం చాలా గమ్మత్తుగా వుండేది. ఇంటికి వచ్చాక స్క్రిప్ట్ పని ఇలా ఒక ఒన్ ఇయర్లో అయిదు నుంచి ఆరు వర్షన్లు వ్రాసాము. ప్రొడ్యూసర్లు మారారు. నటులు మారారు. ఆఫీసులు మారాయి. షూట్ మాత్రం స్టార్ట్ కాలేదు. మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ అన్నారు. మళ్ళీ డిస్కషన్లు. ఇది జరిగే పని కాదు అని నాకు కాస్త ఆలస్యంగా అర్ధమయ్యింది. ఇన్ని రోజులు పడిన కష్టం వధానా? మళ్ళీ ఆలోచనలో పడ్డాను. నా ప్రొఫెషనల్ కెరీర్ మీద దష్టి పెట్టాను. సంవత్సరాలు గడిచాయి. పెండ్లి అయింది. పాప పుట్టింది. ఖాళీ సమయం చూసుకొని తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ తెలుగు రైటింగ్ చేసాను. తెలుగు మాగజైన్ లకి కథలు పంపించాను. 2013 లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను.
ఆ టైమ్‌లో షార్ట్ ఫిలిమ్స్ హవా నడుస్తోంది. అప్పుడు నాలో వచ్చిన ఆలోచన, శివ వరకాల పరిచయం ''వెన్నెల్లో వరుణ్''. తీశాము. ఒక కొత్త మార్గం చూపించింది. అప్పటి నుంచి ఎవరు అడిగితే వాళ్ళకి ఉచితంగా స్టోరీ వ్రాసి ఇచ్చాను. ''అన్నా! రేపు పొద్దునే షూట్. అన్నీ రెడీ. స్టోరీ ఒక్కటే లేదు అనే వాళ్ళు. నేను ఆఫీసు పని చూసుకొని. పర్సనల్ పనులు చూసుకొని. నైట్ మేలుకొని హడావుడిగా కథ రాత్రికి రాత్రి వ్రాసి పంపిస్తే, వాళ్ళ నుంచి వచ్చే సమాధానం : ''లాస్ట్ మినిట్‌లో ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చాడు బ్రదర్. అని సింపుల్ గా చెప్పే వాళ్ళు''. పోను పోను ఈ మాట కి అలవాటు పడిపోయాను.
ఆరేరు మంచి జాబ్ వుంది. ఇంకా ఈ సినిమాల పిచ్చి ఎందుకు? ఆనందంగా వుండొచ్చు కదా. అని ఇంట్లో వాళ్ళు, బందువులు , స్నేహితుల సలహా. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నేను వ్రాయడం కూడా నా అభిరుచి గా మార్చుకున్నాను. అది సినిమా, వెబ్ మాగజైన్, వెబ్ సిరీస్, లఘుచిత్రం, ఏది అయిన పర్లేదు. వ్రాయడం ముఖ్యం. వ్రాస్తూనే వుండాలి అనుకున్నాను . యాని మేషన్ వెబ్‌సైట్‌కు కిడ్స్ స్టోరీ, పాటలు కూడా వ్రాసాను. ఈ ప్రయాణం లో డైరెక్టర్‌గా తొలి అడుగులు వేస్తున్న శ్రీనాథ్ పులకరం పరిచయం అయ్యారు. కష్ణరావు సూపర్ మార్కెట్ స్క్రిప్ట్ డిస్కషన్ చేసేవాళ్లం. అదే నా మొదటి సినిమా బిగ్ స్క్రీన్ మీద. ''అసోసియేట్ డైలాగ్ రైటర్''. అది నాలో రచయితకి గొప్ప ఊరట. పెద్ద స్టార్ట్‌తో తీసిన ''ముద్దుగారే యశోద'' వెబ్ సిరీస్‌కి కథ అందించాను. విజరు పెద్దకొట్ల డైరక్షన్ లో ''ప్రతి ఫ్రెండ్ అవసరమేర'' కి కథ, కథనం, మాటలు అందించాను. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ''కాలజ్ఞానం'', '' సాలూరి మండలం విజయనగరం జిల్లా'' నుంచి ఈ మధ్యనే రిలీస్ అయిన ''శక్ర'' దాకా, సుకు పూర్వజ్ టీమ్ లో శాశ్వత సభ్యత్వం '' అసోసియేట్ డైలాగ్'' రైటర్.
అన్నీ ఫేస్బుక్ పరిచయాలే. అలా పరిచయం అయ్యాడు తమ్ముడు తల్లాడ సాయి. అన్నయ్య అని ప్రేమగా పిలుస్తాడు. అప్పటికి తన మొదటి సినిమా ''ఎందరో మహానుభావులు'' రిలీస్ పనుల్లో వున్నాడు. ''నెక్స్ట్ ప్రాజెక్టు రైటర్‌గా ఏమైనా వర్క్ వుంటే చెప్పు'' అని ఫేస్బుక్లో మెసేజ్ చేసాను. అప్పుడు మొదలయ్యిన పరిచయం ఒక బంధంగా మారింది. తను నటించిన, ప్రొడ్యూస్ చేసిన, దర్శకత్వం చేసిన ఏ ప్రాజెక్టు కి అయినా రైటర్ నేనే. అలా మా కాంబినేషన్ 'బ్లాక్ బోర్డు' , 'నరుడి బ్రతుకు నటన' (ఇప్పుడు టైటిల్ మారింది), 'సొగసు చూడ తరమా', 'దక్ష' , 'నమస్తే సెట్ జీ' మరి కొన్ని ఫస్ట్ షెడ్యూల్ చేసుకున్నాయి. ఈ మధ్యలో మా కాంబినేషన్ లో వచ్చిన ''నిన్ను చేరి'' వెబ్ సిరీస్ ఊర్వశి ఓటిటిలో రిలీస్ అయ్యింది. రైటర్‌గా ఎంత చేసిన డైరక్షన్ అనేది ఒక మోజు . అప్పుడప్పుడు
ఆ మోజు బూజు దులపడానికి ''వెన్నెల్లో వరుణ్'', ''గీత దాటిన సీత'', ''వివక్ష'' , ''పరంధామయ్య గారిఅబ్బాయి' ', ''సుమనోహరం'' లఘు చిత్రాలకి రచనతో పాటు దర్శకత్వం చేసాను. యాభైకి పైగా లఘు చిత్రాలకి కథ మాటలు లేదా రచన లేదా అన్నీ కలిపి చేసాను. కాచం ఫౌండేషన్ వారు ఇచ్చిన ''బెస్ట్ రైటర్'' అవార్డ్ చంద్రబోస్, రాజ్ కందుకూరి చేతుల మీదగా అందుకోవడం మరచిపోలేని అనుభూతి. ఇక ప్రతిలిపి మాగజైన్లో ముప్పైకి పైగా రచనలు వున్నాయి. తానా వాళ్ళు పెట్టిన కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. తపన వారు పెట్టిన పోటీలో ''రంగయ్య స్నేహం'' అనే కథకి మొదటి బహుమతి వచ్చింది. నేను వాళ్ళకి ఇవ్వాలసిన సమయంలో కొంత శాతం రచనకి ఉపయోగిస్తున్నా కూడా నా ఇష్టాన్ని తెలుసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న వీళ్ళకి నా సక్సెస్‌ని గిఫ్ట్‌గా ఇవ్వాలి. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. అందుకు వారికి మనస్ఫూర్తిగా థాంక్స్. నాకు వ్రాయడం మాత్రమే తెలుసు. అందుకే వ్రాస్తూనే వుంటాను. నేను ప్రతీ రోజు పొద్దునే, వీకెండ్లు కాస్తా ఎక్కువ. ఏకదాటిగా పది గంటల్లో పూర్తి చేసిన సంధర్భాలు వున్నాయి.100 కథలు రాస్తే 20 షూట్ అయ్యాయి.15 రిలీస్ దాకా వెళ్తాయి. అందుకే నిరాశ వుండ కూడదు. ఆకాశమంత ఓపిక వుండాలి. నీ కథ ని వాళ్ళ కథ అనే వాళ్ళు వుంటారు. కథ తీసుకున్నాక కనిపించని వాళ్ళు వుంటారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు. తడబాటులు. తప్పటడుగులు. ముళ్ళు పక్కకి ఏరి పడేసి ముందుకు సాగి వెళ్ళి పోవడమే మన గమ్యం మనకి తెలిసినప్పుడు దాని కోసం ప్రయాణం కొనసాగించడమే! ఇప్పుడు కరోనా రూపంలో ప్రకతి అందరి జీవితాల్ని మార్చేసింది. అలా సినిమాని కూడా ఇబ్బందిలో పడేసింది. త్వరలో కరోనా నాశనం అయిపోయి అందరి జీవితాల్లో ఆనందం మళ్ళీ వికసించాలి. మంచి సినిమా లు రావాలి. అందులో కొన్ని నా కలం నుంచి వచ్చినవి అయి వుండాలి అనే చిన్న స్వార్ధం.
- జోష్ డెస్క్