Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్మారాలో పుస్తకం చూశాక
ఒక్కసారిగా పొలమారింది.
'నన్ను చదివావా?' అని
కవిగారు ప్రశ్నించినట్టు.
నాది బద్దకం కాదు
ప్రతి అక్షరాన్ని తడుముతూ
తీరికగా చదవాలనే నిబద్ధతే!
చదవడం అంటే
పుటలను గిరాటు వేయడమా?
అక్షరాలని అక్షరాలా
మనసుకు హత్తుకోవాలి.
చదవాలి అనుకోవడం వరకే
మనం చేయగలిగేది.
చదవడం మొదలెట్టాక
ఓసారి చక్కిలిగిలి పెట్టొచ్చు
ఇంకోసారి కన్నుల్లో
జేగురుజీరల్ని ఎగదోయచ్చు
మరోసారిజి
మన కన్నీటి నిధుల్ని దోచేసుకోనూవచ్చు.
కవి ఏమైనా చేయొచ్చు
మనల్ని వదిలిపెట్టడం తప్ప!
పుస్తకం ఆసాంతం చదివితే తెలుస్తుంది.
పదాల మధ్యలో ఉన్నది
కరిగిపోని ఖాళీ కాదు
ఘనీభవించిన గాలి కాదు
భావాల్ని గాఢంగా పట్టుకున్న
కవి ఊపిరి పాళీ.
అది కంటికి కనిపించదు
పుస్తకాన్ని గుండెకి హత్తుకో
వెచ్చని నిట్టూర్పు తాకుతుంది.
- కుడికాల వంశీధర్
సెల్ :9885201600