Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్యాన్ని రాయడం సులువేమీ కాదు. అందులోనూ కంద పద్యం రాయడం గొట్టు. రాసి మెప్పించడం సాహసమే! నేటితరం కవుల్లో మరీ ముఖ్యంగా యువకవుల్లో పద్యసాహిత్యం వైపు అడుగులు వేసే వాళ్ళు అతి స్వల్పం. అటువంటి తరుణంలో పద్యాలు మాత్రమే రాస్తూ ముందుకు నడుస్తున్న యువకవి రాజశేఖర్. ఉమ్మడి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని బాచారం రాజశేఖర్ స్వస్థలం. నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శేఖర్ ఇంటి పేరూ మంగలి. ఆ పేరును మెతుకు రాజశేఖర్ పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నాడు. మెతుకు సీమ ఒడిలో పద్యకవిగా రాణిస్తున్నాడు. ఆయనతో ఈ వారం నర్రా అభిముఖం.
ఖీఆధునిక కాలంలో యువకవుల నుండి వచన కవిత్వం విస్తతంగా వస్తుంది. ఈ సమయంలో పద్యం వైపుకు ఎందుకు మళ్ళారు?
ప్రాంతీయ కవుల ప్రభావం నాపై ఎక్కువగా ఉండటంతో చిన్నప్పటి నుండే పద్యంపై మక్కువ ఏర్పడింది. పాఠశాల స్థాయి నుండే పద్యం రాయాలన్న కసి,పట్టుదలే నన్ను 'రాజశేఖర శతకం' రాసేలా చేశాయి. నా చిన్నతనంలో గ్రామంలోని దేవాలయాల వద్ద భజనలు చేస్తుంటే విని పద్యంపై మక్కువ పెంచుకున్నాను. వచన కవిత్వం కన్నా పద్యం రాగయుక్తంగా పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పద్యం వైపుకు మళ్ళాను.
నేటి యువతకు పద్య సాహిత్యం నచ్చుతుందా?
తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే పద్యం సరస్వతికి నైవేద్యం లాంటిది. వచన కవిత్వం ఎంత వచ్చినా పద్యంలోని మాధుర్యాన్ని అవి అందించలేవు. పద్యం అనేకమంది కవులనే కాదు యువ అవధానులనూ తయారు చేసింది. వచన కవిత్వంలో ఎన్ని కొత్త ఒరవడులు వచ్చినా పద్యం తన వైభవాన్ని కోల్పోదు.
'రాజశేఖర శతక' రచనకు ప్రేరణ ఏమిటి?
నేను పుట్టి పెరిగిన నేపథ్యం. పాఠశాల స్థాయి నుండే పద్య రచనపై మెలకువలు నేర్పి ప్రోత్సహించిన గురువు అంజాగౌడ్ గారి ప్రోత్సాహం మరువలేనిది. డిగ్రీలో చేరిన తర్వాత అడపాదడపా పద్యాలు రాసే నేను రెండవ సంవత్సరంలో ఉండగానే అక్కడ అధ్యాపకులుగా ఉన్న డా.వి.శంకర్ గారి ప్రేరణతో ఏకంగా 'రాజశేఖర శతకా'న్ని వెలువరించాను. అప్పటికీ నా వయసు 19 సంవత్సరాలే. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు మెతుకుసీమ పద్యకవి, యువ అవధాని అవుసుల భానుప్రకాష్ గారి ప్రభావం నాపై ఎక్కువగా ఉంది.
శతకం పూర్తిగా సామాజిక అంశాల చుట్టే తిరిగింది కదా?
అవును. సమాజంలో జరుగుతున్న సంఘటన లతో పాటు, అనిశ్ఛితి దారిద్య్రం, రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు వంటి అనేక సామాజిక అంశాలనూ పద్యాలుగా మలిచాను. మనిషి మారాలి, సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో సామాజిక అంశాలను తీసుకుని శతక రచన చేశాను. ఈ పద్యాల ద్వారా సమాజంలో ఎంతో కొంత చైతన్యం వచ్చినా నా శతకానికి సార్థకత దక్కినట్లే.
మిగతా ఛందస్సులో కాకుండా కందంలో మాత్రమే రాస్తున్నట్లు గమనించాను! కారణం?
'కందం రాసిన వాడే కవి' అంటారు కదా! అట్లా మొదట నేను కవిని అనిపించుకోవాలనే ఉత్సాహం కొద్దీ కందం రాశాను. మిగతా ఛందస్సులోనూ పద్యాలు రాసినప్పటికీ ఎక్కువగా కందమే . రాసాను. కందం చాలా కఠినమైన పద్యం. పద్యం చూడడానికి చిన్నదిగా ఉంటుంది, కానీ లక్షణాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అసలు పద్యం రాయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అందులోనూ కందం రాయడం మరింత సాహసోపేతం.
మెతుకుసీమ పద్యసాహిత్య పూర్వాపరాలు ఏమైనా చెప్పగలరా?
పద్యానికి పట్టుకొమ్మగా ఉన్న మెతుకుసీమలో అనేక మంది పద్య కవులు తమ పద్యాలతో ఈ నేలను పునీతం చేశారు. మహా మహౌపాధ్యాయ మల్లినాథ సూరి సహా వేముగంటి నరసింహా చార్యులు, గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ లాంటి అనేకమంది పద్య కవుల సాహిత్య ప్రభావం మెతుకుసీమపై ఎంతో ఉంది.
సంప్రదాయిక సాహిత్య ప్రభావం మెతుకుసీమలో యువకవులపై ఏ మేరకు ఉంది?
చాలా ఉంది. ఉంటుంది కూడా. ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, తెలంగాణ ఏర్పాటు తర్వాత భాషా సాంస్కతిక శాఖ ఏర్పాటు చేసిన పద్య కార్యశాలలు మరో కారణం. మెతుకుసీమలో పాఠశాల స్థాయి నుండే పద్యరచనలో మెలకువలు నేర్పే ఉపాధ్యాయులు ఉండటం, బాల కవిసమ్మేళనాలు, పద్యరచన పోటీలు నిర్వహించడం వల్ల మెతుకుసీమ యువకవులపై సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉంటూ వస్తుంది.
మీకు ఇష్టమైన కవులు , రచయితలు ఎవరు? ఎందుకు?
నాకు ఇష్టమైన కవులు దాశరథి కష్ణమాచార్య, నందిని సిధారెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి. పద్యకవుల్లో దాశరథి గారి పద్యధార అంటే నాకు చాలా ఇష్టం. ముక్కుసూటి మనిషి,కవిత్వాన్ని వ్యక్తిత్వంగా మలుచుకున్న రచయిత నందిని సిధారెడ్డి గారి వచనకవిత్వం అంటే ఇష్టం. సహదయ సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి . వెంకటరెడ్డి గారి సంప్ర దాయ సాహిత్యం అంటే ఇష్టం.
మీ భావి రచనల గురించి చెప్పండి?
నా 'రాజశేఖర శతకం' తర్వాత మాత్రా ఛందస్సులో రాసిన 'బంగారు తెలంగాణ' అనే రచన ముద్రణకు సిద్ధంగా ఉంది. దీనికి నందిని సిధారెడ్డి గారు ముందుమాట రాశారు. కందంతో పాటూ,సామాజిక అంశాలపైన ఇతర ఛందస్సులోనూ పద్యాలు ఎప్పటికప్పుడు రాస్తూనే ఉన్నా, కచ్చితంగా పద్యంతోనే నా సాహిత్య ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తా.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
ఉస్మానియా విశ్వవిద్యాలయం