Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిరాక్ ప్రేమించిన వారందరూ తనకి దూరమయ్యారు. ఎంతో ప్రేమతో సొంత కొడుకులా
పెంచిన తన తమ్ముడి మరణం, తన కొడుకు మరణం ఫిరాక్ కి తీరని దుఃఖాన్ని
మిగిల్చాయి. భార్యాభర్తల వివాదం వల్ల 1958లో తన భార్య ఫిరాక్ ని వీడిపోయింది. ఈ
ఒంటరితనంలో మద్యపానం, కవిత్వం తనకి తోడునిచ్చాయి. ఇంటి బయట ఎంత
గౌరవమున్నా, ఇంటి లోపల ఫిరాక్ నిస్సహాయుడిగానే ఉండేవాడు. ఇవన్నీ పక్కనపెడితే
గొప్ప సమయస్ఫూర్తి, మేధస్సు, జ్ఞానం, గంభీరమైన వాగ్ధాటి ఫిరాక్ సొంతం.
ఫిరాక్ గోరఖ్పురీ.. ఆధునిక ఉర్దూ సాహిత్యంలో సంచలనం సష్టించిన ఈ పేరు ఉర్దూ కవిత్వపు దశను, దిశను ఊహించని రీతిలో మార్చేయడమే కాకుండా శతాబ్దాలుగా ఫారసీ కవుల కవిత్వాన్ని, జీవం లేని ఇరానీ సంప్రదాయాలను దిగుమతి చేసుకునే పద్ధతిని పటాపంచలు చేస్తూ ఉర్దూ కవిత్వంలో భారతీయతను, భారతీయ నాగరికతను నిక్షిప్తం చేసి చరిత్రకెక్కింది. 1896 ఆగస్టు 28న బ్రిటీషిండీయాలోని గోరఖ్పూర్ లో జన్మించిన ఫిరాక్ గోరఖ్పురీ అసలు పేరు రఘుపతి సహారు. వత్తిపరంగా న్యాయవాది అయిన తన తండ్రి గోరఖ్ ప్రసాద్ కూడా కవియే. ఇంటివద్దనే ఉర్దూ, ఫారసీ నేర్చుకున్న ఫిరాక్ గవర్నమెంట్ జూబ్లీ కాలేజ్ నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యాక 1930లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ ఇంగ్లిష్ పూర్తి చేశాడు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే తన ధ్యేయం అవ్వడం వల్ల, డిప్యూటీ కలెక్టర్ గా ఇండియన్ సివిల్ సర్వీస్ లో సెలెక్ట్ అయిన కూడా రిజెక్ట్ చేసాడు. రాజకీయాలలో ఆసక్తి లేకున్నా, దేశం మీద ప్రేమతో కొంత రాజకీయ సేవ చేశాడు. 1920లో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన పిదప 1922లో కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీగా నియమించబడ్డాడు. స్వాతంత్య్రానంతరం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా చేరిన ఫిరాక్, తన పాఠాలతో ఎందరో విద్యార్థులను ఆకర్షించాడు. బోధించాల్సిన సిలబస్ కంటే ఎక్కువగా షేరో షాయరీ, ప్రపంచ సాహిత్యం మొదలైన వాటి గురించి విద్యార్థులతో ఎక్కువగా చర్చించిన ఫిరాక్ , తనకిష్టమైన ఇంగ్లీష్ కవి వర్డ్స్వర్త్ గురించి గంటల తరబడి ఉపన్యాసాలిచ్చేవాడు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరినీ ఒకేలా గౌరవించేవాడు. ఫిరాక్ స్వభావంలో కోపం, స్వార్థం కూడా కనబడతాయి. తను కూడా వాటినెన్నడూ దాచలేదు. ఫిరాక్ ప్రేమించిన వారందరూ తనకి దూరమయ్యారు. ఎంతో ప్రేమతో సొంత కొడుకులా పెంచిన తన తమ్ముడి మరణం, తన కొడుకు మరణం ఫిరాక్ కి తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. భార్యాభర్తల వివాదం వల్ల 1958లో తన భార్య ఫిరాక్ ని వీడిపోయింది. ఈ ఒంటరితనంలో మద్యపానం, కవిత్వం తనకి తోడునిచ్చాయి. ఇంటి బయట ఎంత గౌరవమున్నా, ఇంటి లోపల ఫిరాక్ నిస్సహాయుడిగానే ఉండేవాడు. ఇవన్నీ పక్కనపెడితే గొప్ప సమయస్ఫూర్తి, మేధస్సు, జ్ఞానం, గంభీరమైన వాగ్ధాటి ఫిరాక్ సొంతం. తన మేధస్సు గూర్చి ఆసక్తికరమైన గాథలెన్నో వినిపిస్తాయి. ఫిరాక్ ప్రకతి అణువణువునా సమస్త విశ్వాన్ని, విశ్వసౌందర్యాన్ని దర్శించగల మహనీయ దక్పథం కలవాడని విమర్శకులు అంటారు. గుల్-ఎ-నఘ్మా, రూప్, మొదలుకొని డజను కంటే ఎక్కువ ఉర్దూ కవితా సంకలనాలతో పాటుగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో సాహిత్య సాంస్కతిక విషయాల మీద కొన్ని విలువైన విమర్శనాత్మక గ్రంథాలు వెలువరించాడు. మహమ్మద్ ఇక్బాల్, జోష్ మలీహాబాదీ, జిగర్ మురాదాబాదీ వంటి ప్రతిభా వంతులైన సమకాలికులున్న తరుణంలో కూడా ఉర్దూ సాహిత్య చరిత్రలో తనదైన చెరగని ముద్ర వేయగలిగాడు. ఫిరాక్ కవిత్వ ప్రస్తావన లేకుండా ప్రస్తుత ఆధునిక ఉర్దూ సాహిత్యం అసంపూర్ణమైనదని చెప్పడం అతిశయోక్తి కాదు. 1969లో ఉర్దూలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం కైవసం చేసుకున్న ఫిరాక్, సాహిత్య అకాడమీ (1961), సోవియెట్ నెహ్రూ (1968) గాలిబ్ అకాడమీ (1981) పురస్కారాలను అందుకున్నాడు. భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ పురస్కారంతో ఫిరాక్ ని సన్మానించింది. 1982 మార్చి 1న చనిపోయిన ఫిరాక్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
ఫిరాక్ శతాబ్దాల ప్రాచీన భారతీయ సాహిత్య సారాన్ని కాలక్రమేణా ఉర్దూ భాషగా పరిణామం చెందిన ఖడీబోలీ భాష నుండి గ్రహించాడు. సంస్కతం, ఫార్సీ, ఆంగ్లం వంటి వివిధ భాషల్లో సాహిత్యాభినివేశం కలిగుండడం వల్ల ఫిరాక్ కి భాష పైన ఒక ప్రత్యేకమైన దక్పథం ఉండేది. కబీర్, మీరాబాయి, సూర్ దాస్ వంటి సంతుల బాణీలు, రామాయణ గాథలు, జానపద గీతాలు, కాళిదాసు కవిత్వం, ఫార్సీ సాహిత్యం ఫిరాక్ ని చిన్నప్పటి నుండే ఆకర్షించేవి. తను ఎం.ఏ చేస్తున్న సమయంలో వర్డ్స్వర్త్, జాన్ కీట్స్, శెల్లీ వంటి ఇంగ్లిష్ కవుల సాహిత్యం, విశాలమైన ప్రపంచ సాహిత్యం పట్ల తన ఆలోచనా పరిధిని మరింత విస్తత పరిచాయి. ఇవన్నీ ఫిరాక్ పైన గాఢమైన ప్రభావం చూపడమే కాకుండా తనలో ఒక విన్నూత్నమైన కళాసౌందర్యాత్మక దక్పథాన్ని ఏర్పరచుకునేలా ప్రేరేపిస్తూనే భారతీయ సాహిత్యాన్ని సంస్కతులను లోతుగా అధ్యయనం చేసేలా సిద్ధం చేసాయి. ఫలితంగా, ఫిరాక్ తనదైన భావ వ్యక్తీకరణ శైలిని నిర్మించుకుని నూతన జాతీయాలను, రూపకాలను సష్టించాడు. ఉర్దూ కవిత్వంలో సంస్కత కవితా సంప్రదాయాలు ఇమడలేవని విమర్శించిన ఫార్సీ సంప్రదాయవాదుల భ్రమలన్నిటినీ చెల్లాచెదురు చేసి 20వ శతాబ్దపు ఉర్దూ కవితకు నూతన మార్గాలను నిర్దేశించిన ఘనుడు ఫిరాక్. ఫిరాక్ మీర్ కవితా సంప్రదాయాన్నే పునరుత్థానం చేసాడని విమర్శకులంటుంటారు. తను రాసిన 'అందాజే' అనే విమర్శనా గ్రంథంలో ఫిరాక్ 18, 19 శతాబ్దపు కవుల కవిత్వాన్ని వివరిస్తూ వారిని ప్రశంసించాడు. ఈ గ్రంథమాధారంగా తన వైవిధ్యతను కూడా నిరూపించుకున్నాడు. ఫిరాక్ గొప్ప ఆలోచనపరుడు. శరీరం విశ్వంగా ఎలా మారుతుంది. ప్రేమంటే ఏంటి? అది ఎలా మనిషిగా మారి జీవితానికి, విశ్వానికి బంధాన్ని ఏర్పరుస్తుంది? తాత్వికాలోచనలు తన కవిత్వంలో చూడొచ్చు. మానవత్వం, ప్రేమ, సౌందర్యం, ప్రకతి, మానవ సంబంధాల మార్మికత తన ప్రాథమిక కవిత్వాంశాలు. ఫిరాక్ రాతల్లో మార్మిక విశ్వసంగీతం గోచరిస్తుంది. దుఃఖాన్ని, తన్మయత్వాన్ని జోడించి చిక్కైన ఉద్వేగాలను కూడా సున్నితంగా, మార్మిక సౌందర్యంతో ఆవిష్కరించిన ఫిరాక్ కవిత్వానికి వేదనయే ప్రేరణగా నిలిచింది. ఉర్దూ సాహిత్యం వొమెన్ అనే కాన్సెప్ట్ కి ఇంకా జన్మనివ్వలేదని చెప్తూ ఉర్దూలో శకుంతల, సీత, సావిత్రి వంటి వారు లేరని అంటాడు. ఆధునిక ఉర్దూ గజల్ ని సరికొత్త పథంలో నడిపించడమే కాకుండా ఉర్దూ గజల్ కి అర్థం, ఆలోచన, పదజాలం, వ్యక్తీకరణ తదితర విషయాలలో నూతన పరిధులను నిర్దేశించిన ఫిరాక్, కవిత్వం యొక్క విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ''కవితలనేవి కేవలం వాక్యాలు కాదు, అవి విశ్వ దేవాలయంలోని గంటలను మ్రోగించే చేతులని'' అంటాడు.
మూలం...
సితారోం సే ఉలఝ్తా జా రాహా హూఉ
శబ్-ఎ-ఫుర?త్ ఘబ్రా రహా హూఉ
తిరే ఘమ్ కో భీ కుఛ్ బహల్తా రహా హూఉ
జహాఉ కో భీ సమఝ్తా జా రహా హూఉ
యఖీన్ యే హై హఖీఖత్ ఖుల్ రహీ హై
గుమాన్ యే హై కీ ధోకే ఖా రహా హూఉ
అగర్ ముమ్కిన్ హౌ లే లే అప్నీ ఆహట్
ఖబర్ దో హుస్న్ కో మై ఆ రహా హూఉ
అసర్ భీ లే రహా రహా హూఉ తెరీ ఛుప్ కా
తుర్a ఖాఇల్ భీ కర్తా జా రహా హూఉ
జో ఉన్ మాసూమ్ ఆంఖోం నే దియే థే
వో ధోకే ఆజ్ తక్ మై ఖా రహా హూఉ
అజల్ భీ జిన్ కో సున్ కర్ ఝూమ్తీ హై
వో నఘ్మే జిందగీ కే గా రహా హూఉ
అనువాదం...
తారలతో ఈ వేళ పోట్లాడుతూ వెళ్తున్నాను
విరహరాతిరిలో నేను భయపడుతున్నాను
నీ దుఃఖాన్ని కొంత తగ్గించుకుంటున్నాను
ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాను
నమ్మకమైతే ఉంది సత్యం కనబడుతుందని
అనుమానం కూడా ఉంది మోసపోతున్నానని
ఒకవేళ సాధ్యమైతే తీసేసుకో నా అడుగులను
ఇక అందానికి కబురు పెట్టండి, నేనొస్తున్నాను
నీ మౌనానికున్న తీవ్రతను స్వీకరిస్తున్నాను
ఇంకా నిన్ను నేను అంగీకరిస్తూ వెళ్తున్నాను
ఆ అమాయకమైన కన్నులు నాకు చేసిన
మోసాన్ని నేను ఈ రోజు వరకూ సహిస్తున్నాను
ఏ పాటనైతే విని మరణం కూడా తడబడుతుందో ఆ బ్రతుకుపాటను నేను పాడుకుంటున్నాను.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
9441002256